Botsa Satyanarayana : ఏపీ ప్రజలకి బంపర్ గుడ్ న్యూస్ చెప్పిన బొత్స సత్యనారాయణ..!
Botsa Satyanarayana : విద్య సంవత్సరం ఏపీలో పూర్తయింది. ఈనేపథ్యంలో విద్యార్థులు, ఉపాధ్యాయులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా విద్యా సంవత్సరానికి ఎలాంటి అంతరాయం జరగకుండానే ఉపాధ్యాయ బదిలీలు చేపడతామని ఏపీ విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. ఆయన క్యాంపు కార్యాలయంలో మాట్లాడుతూ.. ఉపాధ్యాయ బదిలీలు చేపట్టాలని ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు కోరుతున్నారని, అందుకే బదిలీలను చేపట్టేందుకు అన్ని విధివిధానాలను చేపడుతున్నట్టు మంత్రి బొత్స వెల్లడించారు.
త్వరలోనే సీఎం జగన్ తో చర్చించి ఉపాధ్యాయ బదిలీలపై విధివిధానాలు ప్రకటిస్తామని ఈ ప్రక్రియను త్వరలోనే పూర్తి చేస్తామని దానికి సంబంధించి ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని మంత్రి చెప్పారు. ఉపాధ్యాయ బదిలీలతో పాటు విద్యారంగంలో ఉన్న ఖాళీలను కూడా భర్తీ చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు మంత్రి. డీఎస్సీ, లెక్చరర్ పోస్టులను భర్తీ చేస్తామన్నారు. ఉపాధ్యాయుల ఖాళీలపై కూడా లెక్కలు తీస్తున్నామని.. ఖాళీలు దాదాపు 15 వేలు ఉన్నాయని అన్నారు. అలాగే.. కాంట్రాక్ట్ లెక్చరర్లను క్రమబద్ధీకరిస్తామని బొత్స స్పష్టం చేశారు. కాంట్రాక్ట్ లెక్చరర్లపై సీఎం జగన్ సానుకూలంగా ఉన్నారన్నారు.
Botsa Satyanarayana : కాంట్రాక్ట్ లెక్చరర్లను కూడా క్రమబద్ధీకరిస్తాం
సుప్రీం కోర్టు ఆదేశాలకు అనుగుణంగానే కాంట్రాక్ట్ లెక్చరర్లను క్రమబద్ధీకరిస్తామన్నారు. అలాగే.. రాజధాని విషయంలోనూ ఎలాంటి మార్పు లేదని.. తాము మూడు రాజధానులకు కట్టుబడి ఉన్నామన్నారు బొత్స. త్వరలో విశాఖ పరిపాలన రాజధానిగా మారుతోందన్నారు. మూడు రాజధానులపై ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలకు బొత్స గట్టిగానే బదులిచ్చారు. గతంలో చంద్రబాబు ఏపీకి ముఖ్యమంత్రిగా ఉండి హైదరాబాద్ లో ఎలా కాపురం చేశారంటూ ప్రశ్నించారు. మూడు ప్రాంతాలు అభివృద్ధి చెందాలన్నదే తమ పాలసీ అని, అందుకే విశాఖను కార్యనిర్వాహక రాజధానిగా చేస్తున్నట్టు, అమరావతిలో శాసన రాజధానిగా, కర్నూలును న్యాయ రాజధానిగా చేస్తున్నట్టు తెలిపారు.