Pawan Kalyan : జనసేన పార్టీ పవన్ కళ్యాణ్‌ని కంగారు పెడుతున్న బీజేపీ కొత్త వాదన
Pawan Kalyan : ఏపీలో సార్వత్రిక ఎన్నికలకు మరో రెండేళ్ల సమయం మాత్రమే ఉంది. ఈ లోపే పొత్తుల విషయంలో తేల్చాల్సిందే అంటూ జనసేనాని పవన్ కళ్యాణ్ అటు బీజేపీ మరియు ఇటు తెలుగు దేశం పార్టీని డిమాండ్ చేస్తున్నారు. ఏ రాజకీయ పార్టీ అయినా ఎక్కువ శాతం సొంతంగా ఎన్నికల్లో నిలిచి గెలవాలని అనుకుంటారు. కాని పవన్ కళ్యాణ్ మాత్రం గత ఎన్నికల అనుభవమో లేదా మరేంటో కాని పొత్తు పెట్టుకుని అన్నో ఇన్నో సీట్లను దక్కించుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నాడు. అందులో భాగంగానే తెలుగు దేశం పార్టీ తో కలిసేందుకు ఉవ్విల్లూరుతున్నారు.
ఇప్పటికే జనసేన పార్టీకి మరియు బీజేపీకి మద్య పొత్తు ఉంది. ఆ పొత్తు వచ్చే ఎన్నికల వరకు కొనసాగే అవకాశాలు కనిపించడం లేదు అంటూ రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అందుకు కారణం తెలుగు దేశం పార్టీ అయ్యే అవకాశం ఉంది. పవన్ కళ్యాణ్ 2024 ఎన్నికల్లో ఖచ్చితంగా పొత్తులు పెట్టుకుని జగన్ ను ఢీ కొట్టాలని అనుకుంటున్నారు. పొత్తులు లేకుండా ఎవరి దారిన వారు అంటూ ఇష్టానుసారంగా పోటీ చేస్తే ఖచ్చితంగా ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి మళ్లీ జగన్ సీఎం అవుతాడు.ఆ విషయం పవన్ కు బాగా తెలుసు. అందుకే జగన్ ను ఓడించాలని పొత్తులు కట్టే ప్రయత్నాలు చేస్తున్నారు.
2014 తరహా లో బీజేపీ మరియు తెలుగు దేశంను ఒక్క చోటుకు చేర్చి వారితో జనసేనాని నడవాలని రూట్ మ్యాప్ కోసం ఎదురు చూస్తున్నాడు. కాని ఏపీ బీజేపీ నాయకులు మాత్రం అసలు చంద్రబాబు నాయుడును కనీసం కలిసేందుకు కూడా ఆసక్తి చూపడం లేదు. చంద్రబాబు నాయుడు వల్లే ఏపీ పరిస్థితి ఇలా అయ్యిందంటూ వారు ఆరోపిస్తున్నారు. ఆ వ్యాఖ్యలు తెలుగు దేశం మరియు బీజేపీ మద్య మరింత దూరం పెంచేలా ఉన్నాయి. తద్వార జనసేనాని కోరుకున్న పొత్తు చిగురించేలా లేదు అంటూ రాజకీయ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. బీజేపీ ఇదే వాదనతో ఉంటే జనసేనాని రోడ్డు మ్యాప్ ఏంటీ అనేది తెలియాల్సి ఉంది.