Telangana Politics : తెలంగాణ రాజకీయంలో అన్నదమ్ముల ‘పంచాయితీ’.!
Telangana Politics : నిన్న కోమటిరెడ్డి బ్రదర్స్.. ఇప్పుడేమో ఎర్రబెల్లి బ్రదర్స్.! కానీ, ఇక్కడ ఓ రాజకీయ పార్టీ కామన్.! అదే, భారతీయ జనతా పార్టీ. తెలంగాణలో బలపడే ప్రయత్నాల్లో వున్న భారతీయ జనతా పార్టీ అత్యంత వ్యూహాత్మకంగా పావులు కదుపుతోంది. నల్గొండ జిల్లాలో ‘పవర్’ పాలిటిక్స్‌కి కేరాఫ్ అడ్రస్ అయిన కోమటిరెడ్డి బ్రదర్స్‌లో, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తాను బీజేపీలో చేరుతున్నట్లు ప్రకటించారు, కాంగ్రెస్ పార్టీకి ఆయన రాజీనామా చేశారు కూడా. తాజాగా, షాక్ తెలంగాణ రాష్ట్ర సమితికి తగిలింది. మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సోదరుడు ఎర్రబెల్లి ప్రదీప్ రావు, తెలంగాణ రాష్ట్ర సమితికి రాజీనామా చేశారు. ఆయన కూడా భారతీయ జనతా పార్టీలో చేరబోతున్నారు.
అత్యంత వ్యూహాత్మకంగా బీజేపీ వ్యవహరిస్తోందా.? లేదంటే, బీజేపీలోనే తమ భవిష్యత్తుని తెలంగాణ రాష్ట్రంలో ప్రముఖ రాజకీయ నాయకులు వెతుక్కుంటున్నారా.? కారణం ఏదైతేనేం, భారతీయ జనతా పార్టీ క్రమక్రమంగా తెలంగాణలో బలపడుతోంది. అదే సమయంలో కాంగ్రెస్ పార్టీ, తెలంగాణ రాష్ట్ర సమితి క్రమక్రమంగా బలహీన పడుతున్నాయి. ఇప్పటికిప్పుడు తెలంగాణ రాష్ట్ర సమితికి వచ్చిన ముప్పేమీ లేదుగానీ, కాంగ్రెస్ పార్టీ అయితే, పూర్తిగా పలచబడిపోయింది. కాంగ్రెస్ పార్టీకి వేరే శతృవు అవసరం లేదు. సొంత పార్టీ నాయకులే కాంగ్రెస్ పార్టీని నిలువునా పాతరేసేస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి వ్యవహారం వేరు.
వరుసగా రెండు సార్లు అధికారంలోకి వచ్చిన పార్టీ గనుక, ఖచ్చితంగా పార్టీలో చిన్నపాటి అభిప్రాయ బేధాలు, ప్రభుత్వం పరంగా చూసుకున్నా కొంత ప్రజా వ్యతిరేకత వుండడం సహజం. దాన్ని క్యాష్ చేసుకోవాల్సింది నిజానికి కాంగ్రెస్ పార్టీ. అయితే, అనూహ్యంగా బీజేపీ తెలంగాణలో బలం పుంజుకుంది. బీజేపీలోకి చేరికలు పెరుగుతున్నాయని అంటే, బీజేపీ పూర్తిగా బలపడిపోతుందనీ, తెలంగాణ రాష్ట్ర సమితిని గద్దె దించుతుందనీ ఓ నిర్ణయానికి వచ్చేయలేం. ఇతర పార్టీల నుంచి వచ్చిన నాయకులు, బీజేపీలో పాతుకుపోవాలంటే, చాలా లెక్కలుంటాయ్. భిన్న ధృవాలు బీజేపీలో చేరుతున్నాయ్. దాంతో, ఎప్పుడైనా బీజేపీ పుట్టి మునిగిపోవచ్చు కూడా.