BSF : బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్‌లో పని చేయాలనుకుంటున్నవారికి శుభవార్త
BSF Tradesman Posts 2025 : బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (BSF) 2025 సంవత్సరానికి సంబంధించి భారీ స్థాయిలో నియామక ప్రక్రియను ప్రారంభించింది. ట్రేడ్స్‌మెన్ పోస్టుల కోసం మొత్తం 3588 ఖాళీలకు నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో 3406 పోస్టులు పురుషుల కోసం, 182 పోస్టులు మహిళల కోసం ఉన్నాయి. అభ్యర్థులు 2025 ఆగస్ట్ 23లోగా అధికారిక వెబ్‌సైట్ rectt.bsf.gov.in ద్వారా మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. ఈ నియామకాల్లో కుక్, వాటర్ క్యారియర్, బార్బర్, కార్పెంటర్, ఎలక్ట్రిషియన్, ప్లంబర్, పెయింటర్, స్వీపర్, టైలర్, వాషర్‌మ్యాన్ వంటి విభిన్న ట్రేడ్స్ ఉన్నాయి. వయసు పరంగా కనీసం 18 ఏళ్లు పూర్తి చేసి ఉండాలి, గరిష్టంగా 25 ఏళ్లు మించకూడదు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ అభ్యర్థులకు వయసులో సడలింపులు ఉంటాయి.
BSF Tradesman Posts
విద్యార్హతల విషయంలో ట్రేడ్‌ను బట్టి అర్హతలు వేరుగా నిర్ధేశించారు. ఉదాహరణకు కుక్, వాటర్ క్యారియర్, వైటర్ ఉద్యోగాలకు కనీసం పదో తరగతి పాస్ కావాలి. అదనంగా కిచెన్ లేదా ఫుడ్ ప్రొడక్షన్‌లో గుర్తింపు పొందిన ఇన్స్టిట్యూట్ నుంచి సర్టిఫికేట్ ఉండాలి. ఎలక్ట్రిషియన్, ప్లంబర్, పెయింటర్ పోస్టులకు పదో తరగతితో పాటు ఐటీఐ డిప్లొమా లేదా అనుభవం తప్పనిసరి. టైలర్, కాబ్లర్, వాషర్‌మ్యాన్, బార్బర్ పోస్టుల విషయంలో పదో తరగతి పాస్‌తో పాటు ఆ పనిలో నైపుణ్యం ఉండాలి. దరఖాస్తు ఫీజు జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.150 + జీఎస్టీగా నిర్ణయించారు. ఎస్సీ, ఎస్టీ, మహిళలు, మాజీ సైనికులకు ఫీజు మినహాయింపు ఉంది.
ఎంపిక ప్రక్రియలో ఫిజికల్ టెస్టులు, ట్రేడ్ టెస్టులు, రాత పరీక్ష ప్రధానంగా ఉంటాయి. పురుషులు 5 కిలోమీటర్ల పరుగును 24 నిమిషాల్లో పూర్తి చేయాలి, మహిళలు 1.6 కిలోమీటర్లను 8 నిమిషాలు 30 సెకన్లలో పూర్తిచేయాలి. ట్రేడ్ టెస్టులో అభ్యర్థుల నైపుణ్యాన్ని ప్రాక్టికల్‌గా పరీక్షిస్తారు. అనంతరం జరిగే రాత పరీక్షలో 100 మార్కుల ప్రశ్నాపత్రం ఉంటుంది. పాస్ అయిన అభ్యర్థులు డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ టెస్ట్‌కి హాజరుకావాలి. ఎంపికైనవారికి 7వ పే కమిషన్ ప్రకారం లెవల్ 3 జీతం (రూ.21,700 – రూ.69,100)తో పాటు ఇతర అలవెన్సులు లభిస్తాయి. ఈ నియామకాలు యువతకు మంచి అవకాశంగా భావించబడుతున్నాయి.