Small savings Intrest Rates : చిన్న మొత్తాల పొదుపు వడ్డీ రేట్లపై కేంద్రం గుడ్ న్యూస్!
Small savings Intrest rates : చిన్న మొత్తాల పొదుపు ఖాతాదారులకు కేంద్రం శుభవార్త చెప్పింది. ప్రస్తుతం కొనసాగుతున్న వడ్డీ రేట్లను తగ్గించబోమని ప్రకటించింది. 2021-2022 చివరి త్రైమాసికంలో వడ్డీ రేట్లను సవరించకపోవడం వలన స్మాల్ సేవింగ్స్ ఖాతాదారులకు లబ్ది చేకూరనుంది. ప్రపంచవ్యాప్తంగా కొవిడ్ ప్రభావం, మరో వైపు ఒమిక్రాన్ విజృంభణతో ద్రవ్యోల్భణం పెరుగుతోంది. ఇది ఆర్థిక వృద్దికి నిరోధకంగా కాకుండా చిన్న పొదుపు మొత్తాలను ప్రోత్సహించే నేపథ్యంలో కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.అదే విధంగా మరో రెండు నెలల్లో ఐదు రాష్ట్రాలకు ఎన్నికలు జరగనున్నాయి.
యూపీ, ఉత్తరాఖండ్, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, గోవా ఎన్నికల నేపథ్యంలో కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. సాధారణంగా ఈ రాష్ట్రాల ప్రజలు అధికంగా చిన్న మొత్తాల పొదుపును వినియోగిస్తున్నారు. ఇంతకు ముందు పశ్చిమ బెంగాల్లో ఎన్నికల సమయంలోనూ వడ్డీ రేట్లను తగ్గించిన కేంద్రం మళ్లీ ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది. పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్, నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్ పై వార్షిక వడ్డీరేట్లు వరుసగా 7.01 శాతం, 6.08 శాతం ఈ త్రైమాసికంలోనూ కొనసాగనున్నాయి. చిన్న తరహా పొదుపు పథకాలపై 2021-2022 ఆర్థిక ఏడాది మూడో త్రైమాసికంలోనూ ప్రస్తుత వడ్డీ రేట్లనే (జనవరి 1 నుంచి మార్చి 31) వరకు కొనసాగించనున్నట్టు ఆర్థిక మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది.
Small savings Intrest rates : మూడో త్రైమాసికం అవే వడ్డీ రేట్లు
సంవత్సరం కాలపరిమితితో కూడిన పథకాలపై 5.5 శాతం వడ్డీ లభించనుంది. సుకన్యా సమృద్ధి యోజనపై 7.6 శాతం వడ్డీ ఇవ్వనున్నారు. ఐదేళ్ల సీనియర్ సిటీజన్ సేవింగ్స్ స్కీం పై 7.4 శాతం వడ్డీని పొందొచ్చు. సేవింగ్ డిపాజిట్లపై 4 శాతం వడ్డీ వస్తుంది. ఐదేళ్ల కాలపరిమితితో కూడిన టర్మ్ డిపాజిట్లపై 5.5 నుంచి 6.7 శాతం వడ్డీ ఇస్తున్నారు. అయితే, కేంద్రం ప్రతీ మూడు నెలల కొకసారి వడ్డీని జమ చేస్తుందన్న విషయం అందరికీ తెలిసిందే.