Chiru-Pawan : ఆ సారైనా మల్టీస్టారర్ హీట్ అవుతుందా..?
Chiru-Pawan : మెగాస్టార్ చిరంజీవి 150కి పైగా సినిమాలు చేశారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పట్టుమని 50 చిత్రాల్లో కూడా నటించలేదు. చిరంజీవి.. సినిమా కెరీర్ చివరలో రాజకీయాల్లోకి వచ్చారు. కానీ పవన్ కళ్యాణ్ ఉడుకు రక్తం ఉరకలెత్తుతున్నప్పుడే ఎంట్రీ ఇచ్చారు. అయితే పొలిటికల్ ఆవేశం మెగాస్టార్ తో పోల్చితే పవర్ స్టార్ లోనే ఎక్కువ కనిపిస్తుంది. ఈ ఇద్దరు స్టార్లూ కలిసి ఒక్క ఫుల్ లెంగ్త్ మూవీ కూడా చేయలేదు. రాజకీయాల్లో కూడా వీళ్లు ఎక్కువ రోజులు కలిసి పనిచేయలేదు. చిరంజీవి పెట్టిన ప్రజారాజ్యం పార్టీలోని యువరాజ్యం విభాగానికి పవన్ కళ్యాణ్ నాయకత్వం వహించాడు. ఆ తర్వాత విడిపోయారు. మెగాస్టార్ పాలిటిక్స్ నుంచి దాదాపు తప్పుకున్నారు. పవర్ స్టారేమో జనసేన పేరుతో పార్టీ పెట్టి దాని ఉనికిని చాటుకోవటానికి నానా తిప్పలు పడుతున్నాడు.

chiru pawan Again In to politics
మళ్లీ ఏకమైతే..
పవన్ కళ్యాణ్ పొలిటికల్ గా ఒంటరి పోరాటం చేస్తున్నాడు. అన్న కలిసొచ్చినా రాకున్నా తమ్ముడు రాజకీయాల్లో కొనసాగుతున్నాడు. మధ్యలో ఒకసారి టీడీపీ, బీజేపీతో కలిసి పోటీ చేసి తెలుగుదేశం పార్టీకి మంచి ఫలితాలను సాధించి పెట్టాడు అంటుంటారు. పవన్ కళ్యాణ్ వల్ల టీడీపీకి లాభం జరిగిందనే నిజమేంటో జనానికే తెలుసు. పవన్ కళ్యాణ్ కే తెలుసు. అయితే ఈసారి తెలుగుదేశం పార్టీతో సంబంధం లేకుండా బీజేపీ, జనసేన మాత్రమే కలిసి బరిలో నిలవాలని భావిస్తున్నాయి. ఈ కొత్త కాంబినేషన్ కి మెగాస్టార్ చిరంజీవి కూడా జతకలిస్తే మెగాపవర్ స్టార్ ఏపీలో పవర్ లోకి వస్తుందని బీజేపీ భావిస్తోంది.

Janasena
తమ్ముడి కోసం.. : Chiru-Pawan
చిరంజీవి మళ్లీ పాలిటిక్స్ లోకి వస్తే గిస్తే తన కోసమో, ప్రజల కోసమో కాకుండా తమ్ముడు పడుతున్న శ్రమను చూసి అతనికి మద్దతుగా జనసేన తరఫున ప్రచారం చేస్తారేమో చూడాలి. కమలనాథులు మెగాస్టార్ ని కూడా ఫుల్ టైమ్ పాలిటిక్స్ లోకి రీఎంట్రీ ఇప్పిద్దామని చూస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ లోని రెడ్లు వైఎస్సార్సీపీ తరఫున, కమ్మలు తెలుగుదేశం పార్టీ వైపున కొమ్ముకాస్తున్నారు. దీంతో కాపులకు సైతం గట్టి నాయకుడు కావాలి. చిరంజీవి, పవన్ కళ్యాణ్ కలిసి ఇంకోసారి సీరియస్ గా రాజకీయాల పట్టు పడితే విజయం ఖాయమని కాషాయం పార్టీ లెక్కలేసుకుంటోంది. వచ్చే మూడేళ్లలో ఏపీ పాలిటిక్స్ ఇంకెన్ని మలుపులు తిరుగుతాయో చూడాలి.