Pension : గుడ్ న్యూస్.. అన్నదాతల కోసం తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం.. త్వరలోనే నెలనెలా పింఛన్ స్కీం !
Pension for farmers : రాష్ట్రంలోని అన్నదాతలను ఆదుకునేందుకు తెలంగాణ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. వ్యవసాయం దండగ కాదు పండగ అని ప్రతీరైతు అనుకునేలా వారి బాగుకోసం నెలనెలా పింఛన్ పథకాన్ని తీసుకుకొచ్చేందుకు సీఎం కేసీఆర్ సిద్ధమైనట్టు సమాచారం. రానున్న బడ్జెట్‌లో రైతులకు పింఛన్ స్కీం అమలు చేస్తే రాష్ట్ర ఖజానాపై ఎంత భారం పడుతుంది. ఈ స్కీమ్ వర్కౌట్ అవుతుందా? లేదా అనే సాధ్యాసాధ్యాలపై ఫైనాన్స్ డిపార్ట్‌మెంట్ ఇప్పటికే కసరత్తు ప్రారంభించినట్టు తెలిసింది. కొండపోచమ్మసాగర్ ప్రారంభోత్సవం సమయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ.. త్వరలోనే రైతులకు శుభవార్త చెబుతానని ప్రకటించారు.
ప్రస్తుతం తెలంగాణ సర్కార్ పైన రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో ఉపఎన్నికలు వచ్చిన ప్రతీసారి చివరి గింజ వరకు వడ్లను మేము కొంటామని చెప్పిన ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రులు ఇప్పుడు మాటమార్చారు. కేంద్రం ధాన్యం కొనడం లేదని అందుకే యాసంగిలో వరి వేయొద్దని సర్కార్ రైతులను బెదిరిస్తున్నది. ధాన్యాన్ని సర్కార్ కొనకపోవడంతో పలువురు రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. రైతుల్లోనే కాకుండా నిరుద్యోగులు, ఉద్యోగులు ఇలా ప్రతీ ఒక్కరు టీఆర్ఎస్‌పై వ్యతిరేకత చూపిస్తున్నారు.
Pension for farmers : ప్రజల్లో వ్యతిరేకత పోగొట్టెందుకేనా..?
ఈ నేపథ్యంలోనే పార్టీపై, మంత్రులు, నేతలపై ఉన్న వ్యతిరేకతను డైవర్ట్ చేసేందుకు కేసీఆర్ రైతులకు పింఛన్ ఇస్తానని మరో కొత్త నాటకానికి తెరలేపారని అంతా అనుకుంటున్నారు. దళితబంధు మాటలకే పరిమితమైంది. రైతు బంధు కొందరు రైతులకు మాత్రమే వస్తోంది. అందరికీ రావడం లేదు. దీంతో అన్నదాతలు ఆగ్రహంగా ఉన్నారు. వారిని సముదాయించేందుకు కేసీఆర్ నెలనెలా పింఛన్ స్కీం తెచ్చారని, కానీ ఇది అమలుకు నోచుకునేనా అని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే, 47 ఏళ్లు నిండిన చిన్న, సన్నకారు రైతులు ఆ పథకానికి అర్హులు. వీరికి నెలనెలా రూ.2,016 పింఛన్ ఇచ్చే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. రాష్ట్రంలో రైతుబంధు పథకం లబ్దిదారులు 67 లక్షల మంది ఉండగా, వీరిలో 47 ఏళ్లు నిండిన వారు ఎంత, 49 ఏళ్లు నిండిన వాళ్లు ఎంతమంది ఉన్నారనే విషయంపై పూర్తి వివరాలను సేకరిస్తున్నట్టు తెలుస్తోంది. 3 నుంచి 5 ఎకరాల లోపు ఉన్న రైతులకు పింఛన్ ఇచ్చే అవకాశాలున్నాయని అధికారులు పేర్కొంటున్నారు.