GST : సామాన్యులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్తలే..శుభవార్తలు
Good News from the Central Government for the Common Man : దేశంలో పండుగల సీజన్ సమీపిస్తున్న వేళ, కేంద్ర ప్రభుత్వం జీఎస్‌టీ వ్యవస్థలో పెద్ద మార్పులకు సిద్ధమవుతోంది. ఇప్పటి వరకు 5, 12, 18, 28 శాతం శ్లాబ్‌లుగా ఉన్న జీఎస్‌టీని ఇకపై కేవలం రెండు శ్లాబ్‌లకు పరిమితం చేయాలని ప్రతిపాదించింది. ఈ క్రమంలో గూడ్స్ అండ్ సర్వీసెస్‌ను ‘మెరిట్’ మరియు ‘స్టాండర్డ్’ కేటగిరీలుగా విభజించి, వరుసగా 5 శాతం, 18 శాతం పన్ను విధించాలని నిర్ణయానికి వచ్చారు. లగ్జరీ కార్లు, సిన్ గూడ్స్‌పై మాత్రం 40 శాతం వరకు ప్రత్యేక పన్ను కొనసాగుతుంది.

modi government good news
ఈ ప్రతిపాదనపై చర్చించేందుకు జీఎస్‌టీ కౌన్సిల్ సెప్టెంబర్ 3, 4 తేదీల్లో ఢిల్లీలో సమావేశం కానుంది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో అన్ని రాష్ట్రాల ఆర్థిక మంత్రులు పాల్గొంటారు. రాష్ట్ర మంత్రుల బృందం (జీఓఎం) ఇప్పటికే ఈ ప్రతిపాదనను సూత్రప్రాయంగా అంగీకరించగా, ఇప్పుడు కౌన్సిల్ ఆమోదం పొందిన వెంటనే నోటిఫికేషన్లు విడుదల అవుతాయని అధికార వర్గాలు చెబుతున్నాయి. అంతేకాకుండా, ఎక్కువగా ఉపాధి కల్పించే రంగాలకు మద్దతుగా 0.1 శాతం, 0.3 శాతం లేదా 0.5 శాతం తగ్గింపు రేట్లు కొనసాగిస్తారని సమాచారం.
ఈ మార్పులు అమల్లోకి వస్తే దేశ ఆర్థిక వ్యవస్థపై సానుకూల ప్రభావం చూపుతాయని నిపుణులు భావిస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగంలో ప్రకటించిన “జీఎస్‌టీ 2.0” భాగంగా తీసుకొస్తున్న ఈ సంస్కరణలు, సాధారణ ప్రజలకు ఉపశమనం కలిగించడంతో పాటు వ్యాపారాలకు స్పష్టతనూ అందిస్తాయి. ముఖ్యంగా రైతులు, మధ్యతరగతి కుటుంబాలు, ఎంఎస్ఎంఇ రంగానికి ఈ నిర్ణయం ఊరటనిచ్చేలా ఉంటుందని అంచనా. సెప్టెంబర్ 22 లోగా ఈ కొత్త పన్ను విధానం అమల్లోకి వచ్చే అవకాశం ఉండగా, నవరాత్రి పండుగల సమయంలో వినియోగదారులపై భారాన్ని తగ్గించగలదన్న ఆశలు ఉన్నాయి.