TCS Layoffs : లేఆఫ్ ఉద్యోగులకు టీసీఎస్ ఊపిరి పీల్చుకునే శుభవార్త
TCS Good News : భారతీయ ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) ఇటీవల దాదాపు 12 వేల మంది ఉద్యోగులను తొలగించడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఈ నిర్ణయంపై ఉద్యోగుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఇప్పటికే పలు ప్రాంతాల్లోని టీసీఎస్ కార్యాలయాల వద్ద ఐటీ, ఐటీఈఎస్ ఉద్యోగుల సమాఖ్య (యునైట్) ఆధ్వర్యంలో నిరసనలు జరుగుతున్నాయి. ప్రభుత్వం ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని, కంపెనీ ఈ ఉద్యోగుల కుటుంబాలను రోడ్డున పడేసిందని విమర్శలు వస్తున్నాయి. ఈ విమర్శల నేపథ్యంలో టీసీఎస్ ఈ లేఆఫ్‌లకు గల కారణాలపై స్పందించింది.

TCS
టీసీఎస్ తన భవిష్యత్తును దృష్టిలో ఉంచుకునే ఈ నిర్ణయం తీసుకుందని ఒక ప్రకటనలో తెలిపింది. ఆటోమేషన్ కారణంగా ఉద్యోగుల అవసరం లేని విభాగాల నుంచి మాత్రమే వారిని తొలగించామని పేర్కొంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తమ ఉద్యోగుల్లో కేవలం 2 శాతం మందిని మాత్రమే తొలగించామని, అది కూడా మధ్యస్థ, సీనియర్ గ్రేడ్లలో ఉన్నవారిని మాత్రమేనని వెల్లడించింది. తమ క్లయింట్లకు సర్వీస్ డెలివరీలో ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూసేందుకు ఈ మార్పులు అవసరమని కంపెనీ తెలిపింది.
ఉద్యోగాలు కోల్పోయిన ఉద్యోగుల సమస్యలను తాము అర్థం చేసుకోగలమని, వారికి అన్ని ప్రయోజనాలు కల్పిస్తామని టీసీఎస్ హామీ ఇచ్చింది. ఇందులో భాగంగా వారికి నోటీసు పీరియడ్ కాంపెన్సేషన్, సీవెరెన్స్ ప్రయోజనాలు అందిస్తామని ప్రకటించింది. అంతేకాకుండా, వారికి ఇతర ఉద్యోగాలు వెతుక్కోవడానికి అవసరమైన సహాయం, కౌన్సెలింగ్ కూడా అందిస్తామని కంపెనీ తెలిపింది. ఈ కష్ట సమయంలో ఉద్యోగులకు అండగా ఉంటామని టీసీఎస్ స్పష్టం చేసింది.