Balakrishna: బాలయ్య పంట పండింది, గుడ్ న్యూస్ చెప్పిన వైసీపీ
Nandamuri Balakrishana- నందమూరి బాలకృష్ణ.. అటు సినిమాలు, ఇటు రాజకీయాలు.. రెండింటినీ బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్తున్నారు. అయితే.. సినిమాల వరకు ఓకే కానీ.. రాజకీయాల్లోనే తను ఎక్కువ సమయం కేటాయించలేకపోతున్నారనే విమర్శ బలంగా వినిపిస్తోంది. ఆయన టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో కూడా తన నియోజకవర్గంలో పెద్దగా పర్యటించింది లేదు. ఎన్నికలు రాగానే హిందూపురం నియోజకవర్గం వెళ్లడం.. అక్కడ ప్రచారం చేయడం.. గెలవడం.. ఆ తర్వాత తన పనేదో తాను చూసుకోవడం. అంతకు మించిన రాజకీయాలు బాలయ్యకు తెలియవు.
అయితే.. వైసీపీ ప్రస్తుతం హిందూపురాన్ని టార్గెట్ చేసిన విషయం తెలిసిందే. హిందూపురంలో ఎలాగైనా పాగా వేయాలని వైసీపీ తెగ ప్రయత్నిస్తోంది. ఈ నేపథ్యంలో వైసీపీ నేతలు బాలకృష్ణపై విమర్శలు కురిపిస్తున్నారు. బాలయ్య కూడా హిందూపురంలో పర్యటించకుండా, నియోజకవర్గ ప్రజలను ఏమాత్రం పట్టించుకోకుండా ఉండటం వైసీపీకి కలిసొచ్చింది.
హిందూపురంలో ఇప్పటి వరకు టీడీపీ తప్పించి.. మరో పార్టీ గెలవలేదు. టీడీపీ పార్టీ అవిర్భవించిన తర్వాత నుంచి మరే పార్టీ అక్కడ అడుగు కూడా పెట్టలేకపోతోంది. దీంతో హిందూపురంలో టీడీపీని ఓడించి.. టీడీపీని మరింత బలహీనపరచాలనేది వైసీపీ ప్లాన్.
ఎమ్మెల్యే టీడీపీకి చెందినా.. పెత్తనం మాత్రం వైసీపీదే
అక్కడి ఎమ్మెల్యే టీడీపీ పార్టీకి చెందినా.. పెత్తనం మాత్రం వైసీపీ నేతలే చేస్తున్నారు. వైసీపీ ఇన్ చార్జీలదే అక్కడ హవా. ఎలాగూ బాలకృష్ణ తన తొందరపాటుతో వైసీపీకి బలాన్ని చేకూర్చుతూ.. టీడీపీ పరువును ఆయనే గంగలో కలుపుతున్నారు. దీంతో వైసీపీ నేతలు ఏం చేయాల్సిన పని లేకుండా.. కేవలం బాలయ్య చేసే పనులను చూస్తూ కూర్చోవాల్సి వస్తోంది.
హిందూపురంలో బాలకృష్ణ మాట వినే అధికారులందరినీ వైసీపీ ట్రాన్స్ ఫర్ చేసి.. వైసీపీకి ఫేవర్ గా ఉండేవాళ్లను దింపింది. దీనిపై బాలకృష్ణ కూడా ఓసారి ఫైర్ అయ్యారు. అంతవరకు ఓకే కానీ.. వైసీపీ నేతలు.. బాలకృష్ణ తొందరపాటును క్యాష్ చేసుకోవడం పక్కన పెట్టి.. వాళ్లలో వాళ్లే కొట్టుకుంటున్నారు. వర్గాలుగా విడిపోయారు.
హిందూపురంలో రెండు వైసీపీ వర్గాలు ఉన్నాయి. ఒకటి ఇక్బాల్ వర్గం.. రెండోది నవీన్ నిశ్చల్ వర్గం. రెండు వర్గాలు కొట్టుకొని.. తన నియోజకవర్గానికి ఏం చేయని బాలకృష్ణకు మైలేజ్ ఇస్తున్నారు. ఏంటో వీళ్లు.. ఇలా వర్గాలుగా విడిపోయి రాజకీయాలు చేస్తే ప్రజలు వైసీపీకి ఎలా ఓట్లేస్తారు?