International Flights : ఒమిక్రాన్ ఎఫెక్ట్ అంతర్జాతీయ విమాన సర్వీసుల రద్దు పొడిగింపు..!
ప్రపంచవ్యాప్తంగా మరోసారి కరోనా మహమ్మారి మరోసారి విజృంభిస్తోంది. ఈ నేపథ్యంలో విదేశాల నుండి వస్తున్న ప్రయాణీకుల విషయంలో ఆందోళన నెలకొనగా ఈ మేరకు డీసీజీఏ మరోసారి అంతర్జాతీయ విమానాల రద్దును పొడిగించింది. కొవిడ్ వ్యాప్తిని అడ్డుకునే క్రమంలో డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్.. అంతర్జాతీయ విమనాల నిషేదాన్ని ఫిబ్రవరి 28వరకూ పొడిగిస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేశారు.
అన్ని విమానాలు ఎయిర్ బబుల్ అగ్రిమెంట్స్, మిషన్ వందే భారత్ కు అనుగుణంగా ఆపరేట్ చేస్తామని పేర్కొన్నారు. అయితే ముందుగా అనుకున్నట్లు కార్గో విమాన సర్వీసులు మాత్రం కొనసాగుతాయని స్పష్టం చేశారు. కేసులు తగ్గుముఖం పడటంతో ముందుగా డిసెంబర్ 15 నుంచి అంతర్జాతీయ సర్వీసులను పూర్తి స్థాయిలో పునరుద్దరించాలని సివిల్ ఏవియేషన్ మొదట భావించింది. అయితే ఒమిక్రాన్ వల్ల దానిని జనవరి 31 వరకు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీచేసింది.
తాజాగా లక్షల్లో నమోదవుతోన్న కేసుల సంఖ్య దృష్ట్యా ఇప్పుడు వచ్చే నెల మొత్తం కూడా అంతర్జాతీయ విమాన సర్వీసులను రద్దు చేసింది. ప్రపంచ దేశాలను వణికించిన కరోనా విజృంభన తగ్గుముఖం పడుతోంది అనుకునే తరుణంలో మరో కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వెలుగులోకి వచ్చి.. భయాందోళనలకు గురి చేస్తోంది. ఇప్పటికే ఒమిక్రాన్ 57 దేశాలను విస్తరించిన క్రమంలోడబ్యూహెచ్ ఓ హెచ్చరికల మేరకు ప్రపంచ దేశాలు అప్రమత్తమవుతున్నాయి.