Janasena : దారుణమైన తప్పు చేస్తోన్న జనసేన పార్టీ.!
Janasena : నిండా మునిగినోడికి చలేంటి.? ఔను, జనసేన పార్టీకి ఇతర పార్టీల నుంచి వచ్చే నాయకులతో పనేంటి.? జనసేన పార్టీ పూర్తిగా యువతరాన్నే నమ్ముకుంటే కాస్తయినా, జనంలో మంచి పేరు తెచ్చుకోగలుగుతుంది. ఫక్తు రాజకీయ పార్టీలకు భిన్నంగా తమ రాజకీయం వుంటుందని జనసేన పదే పదే చెబుతుంటుంది. కానీ, మాటలకీ చేతలకీ అస్సలు పొంతన వుండదు. 2019 ఎన్నికల్లో చాలామంది యువతకు టిక్కెట్లు ఇచ్చినా, కక్కుర్తికి పోయి.. అన్నట్టు ఇతర పార్టీల నుంచి చివరి నిమిషంలో వచ్చిన సీనియర్ నాయకులకు టిక్కెట్లు ఇచ్చి అబాసుపాలయ్యింది జనసేన పార్టీ.
ఇంకోసారి అలాంటి తప్పు జరగకూడదంటూ జనసేన పార్టీలో అప్పట్లో లోతైన చర్చ జరిగింది. కానీ, మళ్ళీ కథ మొదటికి వచ్చింది. రాష్ట్రంలో అతి త్వరలో ముందస్తు ఎన్నికలంటూ ప్రచారం జరుగుతున్న వేళ, జనసేన పార్టీలోకి చేరికల్ని ప్రోత్సహించాలని ఆ పార్టీ అధినాయకత్వం నిర్ణయించుకుంది. ఈ నేపథ్యంలో ఇతర పార్టీల్లోంచి వివిధ కారణాలతో బయకు వచ్చినవారు, బయటకు నెట్టివేయబడ్డవారి మీద జనసేన స్పెషల్ ఫోకస్ పెట్టినట్లుంది. ఒకప్పుడు వైసీపీలో మంచి వాగ్ధాటిగల నాయకుడిగా పేరు తెచ్చుకున్న సినీ నటుడు పృధ్వీరాజ్, జనసేన పార్టీలో చేరుతున్నట్లు ప్రకటించడంతో జనసైనికులు అవాక్కయ్యారు.
ఎందుకంటే, ‘గుడియెనక నాసామి’ అంటూ పృధ్వీరాజ్ మీద అప్పట్లో జనసేన తీవ్రమైన ఆరోపణలు చేసింది. వైఎస్ జగన్ సర్కారు, పృధ్వీరాజ్‌కి ఎస్వీబీసీ ఛానెల్‌లో పవిత్రమైన ఉద్యోగమిస్తే, దాన్ని ఆయన అపవిత్రం చేశారు. దాంతో అతన్ని పీకి పారేసింది వైసీపీ సర్కారు. అలాంటి వ్యక్తిని జనసేనలో పవన్ కళ్యాణ్ చేర్చుకోవడమంటే, సభ్య సమాజానికి ఏం సంకేతమిస్తున్నట్లు.?