తిరుపతిలోనూ జనసేనకు చుక్కెదురు? పవన్ మూటాముళ్లె సర్దుకోవాల్సిందే?
మీకు గుర్తుందా? ఓ వైపు జీహెచ్ఎంసీ ఎన్నికలకు సంబంధించిన ప్రచారం జోరుగా సాగుతున్న వేళ… జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఢిల్లీ వెళ్లారు. అక్కడ కేంద్రమంత్రులను కలిశారు. ఆయన కేంద్ర మంత్రులను ఎందుకు ఆ టైమ్ లో కలిశారో ఎవ్వరికీ తెలియదు. అంతకుముందు జీహెచ్ఎంసీ ఎన్నికల్లో జనసేన ఒంటరిగా పోటీ చేస్తుందని పవన్ చెప్పుకొచ్చారు కానీ ఏమైంది.. తర్వాత మనసు మార్చుకొని.. జనసేన పోటీ చేయడం లేదు కానీ.. బీజేపీకి మద్దతు ఇస్తుంది అన్నారు. పోనీ.. పవన్ హైదరాబాద్ వచ్చి జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ప్రచారంలో పాల్గొన్నారా? అంటే లేదు.
కట్ చేస్తే.. తిరుపతి ఉపఎన్నికలో ఒంటరిగా పోటీ చేయాలని పవన్ భావించారు. అందుకోసం.. నివర్ తుపాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటన పేరుతో తిరుపతిలో కూడా పర్యటించి వచ్చారు పవన్. అక్కడ రైతులతో మాట్లాడారు. రోడ్ షోలు నిర్వహించారు. ఇదంతా వచ్చే తిరుపతి ఉపఎన్నికలో పోటీ చేయడం కోసమే అన్న ప్రచారమూ సాగింది. పోనీలే.. ఇప్పుడైనా పవన్ సొంతంగా తిరుపతి ఉపఎన్నికలో పోటీ చేస్తున్నారు కదా అని అంతా అనుకున్నారు. ఇప్పటికైనా జనసేన పార్టీకి జనాల్లో ఎంత మద్దతు ఉందో తెలుస్తుందిలే అని అనుకున్నారు.
కానీ.. ఏపీలో బీజేపీ తీరు చూస్తుంటే.. జనసేనకు టికెట్ ఇచ్చేలా లేదు. ప్రస్తుతం పవన్ తన స్వంత పనుల్లో బిజీగా ఉన్నారు. దీంతో బీజేపీ వెంటనే రంగంలోకి దిగి.. తిరుపతిలో తెగ హడావుడి చేస్తోంది. తిరుపతిలో గెలవాలన్న లక్ష్యంతో ముందుకెళ్తోంది. ఇప్పటికే దుబ్బాక, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో గెలిచిన ఉత్సాహంతో తిరుపతిలోనూ పాగా వేయాలని తెగ ఆరాటపడుతోంది బీజేపీ. ఈనేపథ్యంలో బీజేపీ జనసేనకు టికెట్ ఇచ్చే అవకాశమే లేదు. అంటే.. జనసేన పార్టీకి ఈ సారి కూడా ఉత్త చెయ్యే. పవన్ ఈసారి కూడా తిరుపతిలో మూటాముళ్లె సర్దుకోవాల్సిందేనంటూ రాజకీయ విశ్లేషకులు తమ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
వామ్మో.. వీళ్ల బంధం మొదలైన కొన్నిరోజులకే ఇలా ఉంటే.. 2024 ఎన్నికల దాకా ఉంటుందా? ఏంటో.. తిరుపతి ఉపఎన్నికతో ఈ రెండు పార్టీల మధ్య ఉన్న అసలు బంధం తేలిపోతుంది.. అనే ప్రచారం కూడా జోరుగా సాగుతోంది.