Pawan Kalyan : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్.. కేఏ పాల్ ఆఫర్ అదిరింది.!
Pawan Kalyan : అసలు ఇలాంటి ఐడియాలు ఎలా వస్తాయ్.? కేఏ పాల్ అనే మహానుభావుడికి. ఎంతైనా దైవదూత కదా.! ఆయనంతే.! దైవ దూతగా వున్నప్పుడు బాగానే వున్నాడు, రాజకీయ నాయకుడయ్యాకే మతి చెడిపోయినట్టుంది. లేకపోతే, 42 ఎంపీ సీట్లు పట్టుకుని దేశానికి ప్రధానమంత్రినైపోతానని అంటాడేంటి.? పైగా, తెలుగు రాష్ట్రాల్లో అన్ని సీట్లూ గెలిచేసి, ఇక్కడ ముఖ్య మంత్రి పదవుల్ని పంచేస్తానని చెబుతున్నాడు కేఏ పాల్. అందులో ఓ పదవి పవన్ కళ్యాణ్‌కి ఇచ్చేస్తాడట. అంటే, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్‌ని కేఏ పాల్ చేసేస్తాడట. సో, పవన్ కళ్యాణ్ అభిమానులంతా ప్రజాశాంతి పార్టీకి ఓటెయ్యాలి.
జనసేన పార్టీని, ప్రజాశాంతి పార్టీలో విలీనం చేసెయ్యాలి. 2014 ఎన్నికల సమయంలో పుట్టిన జనసేన పార్టీ, ఎన్నికల్లో పోటీ చేయడానికి ఐదేళ్ళ సమయం తీసుకుంది. 2019 ఎన్నికల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో పోటీ చేస్తే, జనసేన గెలిచింది ఒకే ఒక్క అసెంబ్లీ నియోజకవర్గం. 2024 ఎన్నికల్లో మాత్రం గెలిచేసి, అధికార పీఠమెక్కేస్తామంటోంది జనసేన. జనసేన పార్టీకీ, ప్రజాశాంతి పార్టీకి పెద్దగా తేడా ఏమన్నా వుందా.? ఈ విషయంలో జనసేన కొంచెం బెటర్. ఎందుకంటే, జనసేన పార్టీ ఓ అసెంబ్లీ నియోజకవర్గం గెలుచుకుంది. ప్రజాశాంతి పార్టీకి అది కూడా లేదు.
కానీ, ప్రపంచ స్థాయి నాయకులతో తనకు పరిచయం, స్నేహం వున్నాయంటాడు కేఏ పాల్. ట్రంప్ తన ఆగ్రహానికి గురై ఓడిపోయాడని కేఏ పాల్ చెబుతుంటాడు. రష్యా – యుక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో రష్యాని బెదిరించేస్తాడు. అబ్బో, కేఏ పాల్ చేసే కామెడీ అంతా ఇంతా కాదు. ఆ కామెడీతో ఇప్పుడు జనసేనకు పెద్ద చిక్కే వచ్చి పడింది. ‘ముఖ్యమంత్రి పదవి కావాలా.? అదిగో పాల్ ఇస్తానంటున్నాడు తీసుకో..’ అని జనసేనాని మీద సెటైర్లు పడుతున్నాయి సోషల్ మీడియాలో.