YS Jagan : ఆ ఎమ్మెల్యేకు మంత్రి పదవి ఖాయం.. వైఎస్ జగన్ నుంచి గ్రీన్ సిగ్నల్?
YS Jagan ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తన మంత్రి వర్గాన్ని విస్తరించనున్నారు. అయితే ఈసారి కేబినెట్ విస్తరణలో ఎమ్మెల్యే ముస్తాఫాకు ఖచ్చితంగా మంత్రిపదవి దక్కుతుందన్న ప్రచారం జరుగుతోంది. ఆయనకు మైనారిటీ కోటాలో మంత్రి పదవి ఖాయమైందని టాక్ వినిపిస్తోంది. మైనారిటీలకు తన పాలనలో పెద్దపీట వేస్తున్న వైఎస్ జగన్ ఈసారి ఎమ్మెల్యే ముస్తాఫాకు తన కేబినెట్ లో చోటు కల్పిస్తారని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ముస్తాఫా గుంటూరు తూర్పు నియోజకవర్గం నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. 2014లో వైసీపీ నుంచి తొలిసారి గెలిచినప్పుడు ముస్తాఫాపై పార్టీ మారాలని వత్తిడి వచ్చింది. తన గురువు రాయపాటి సాంబశివరావు కూడా టీడీపీలో చేరాలని వత్తిడి తెచ్చారు. అయినా ముస్తాఫా వైఎస్ జగన్ వెంటే ఉంటానని తేల్చి చెప్పారు. ఐదేళ్లు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆర్థికంగా, రాజకీయంగా ఎన్ని ఇబ్బందులు వచ్చినా ముస్తాఫా మాత్రం పార్టీని వీడలేదు.
తొలి విడతలో దెబ్బకొట్టిన సమీకరణాలు YS Jagan
ముస్తాఫాకు తొలి విడతలోనే కేబినెట్ లో చోటు దక్కాల్సి ఉంది. అయితే కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో కడప జిల్లాకు చెందిన అంజాద్ భాషాకు ఇవ్వాల్సి వచ్చింది. ఇప్పుడు వైసీపీలో ఉన్న మైనారిటీ నేతల్లో ముస్తాఫాయే సీనియర్. ఇక్బాల్ వంటి వారు ఉన్నా, వారంతా ఎమ్మెల్సీలుగా ఉన్నారు.
ఇక గుంటూరు జిల్లాలో రాజకీయ సమీకరణాలు చూసుకున్నా ముస్తాఫాకు ఈసారి మంత్రివర్గంలో చోటుదక్కుతుందని చెబుతున్నారు. 2014నుంచి 2019 వరకూ ముస్తాఫా ఎమ్మెల్యేగా ఉన్నా, టీడీపీ నేతలు చెప్పిందే వేదం కావడంతో బాగా ఇబ్బంది పడ్డారు. దీంతో మంత్రి పదవి ఉంటే, తన నియోజకవర్గంలో మంచినీటి సమస్యను పరిష్కరించాలని ముస్తాఫా భావిస్తున్నారని అనుచరులు చెబుతున్నారు. అసలే మైనార్టీ నేత కావడంతో, గ్యారంటీ అన్న టాక్ వినిపిస్తోంది. మరి ఈయనకు పదవి యోగం ఉందో లేదో వేచి చూడాల్సిందే.