YS Jagan : వైఎస్ జగన్ మీద కాషాయ విమర్శలు.. ఏపీ బీజేపీకి రాకూడని కష్టమిది.!
YS Jagan : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సత్సంబంధాలే వున్నాయి. చాలా విషయాల్లో రాష్ట్రంలోని అధికార వైసీపీ, కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కారుకి సాయం చేస్తోంది.. చట్ట సభల్లో ఆయా బిల్లుల ఆమోదం నేపథ్యంలో. రాష్ట్రపతి ఎన్నికలు సహా పలు సందర్భాల్లో వైసీపీ, ఢిల్లీ బీజేపీతో స్నేహంగానే మెలుగుతోంది. మరి, రాష్ట్రానికి కేంద్రం చేస్తున్న సాయమేంటి.? ఈ విషయమై భిన్న వాదనలున్నాయి. అప్పుల విషయంలో రాష్ట్రానికి కేంద్రం సాయం చేస్తున్న మాట వాస్తవం. కానీ, అప్పులిస్తే సరిపోదు.. రాష్ట్రానికి న్యాయ బద్ధంగా దక్కాల్సిన విభజన చట్టంలోని అంశాలకు అనుగుణంగా, సాయం చేయాల్సి వుంటుంది. శాసన మండలిని రద్దు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కోరినా కేంద్రం పట్టించుకోలేదు.
రాజధానుల విషయంలోనూ రాష్ట్రానికి కేంద్రం సరిగ్గా సహకరించడంలేదు.దిశ బిల్లు విషయంలోనూ కేంద్రం, రాష్ట్ర విజ్ఞప్తుల్ని పరిగణనలోకి తీసుకోవడంలేదు. వీటి విషయంలో కేంద్రానికి రాష్ట్ర బీజేపీ విజ్ఞప్తి చేసే అవకాశం వున్నా చేయడంలేదు. కానీ, రాష్ట్రం మీద విమర్శలు చేయడానికి మాత్రం ఏపీ బీజేపీ నేతలు తెగ ఉత్సాహం చూపేస్తున్నారు. దేవాలయాల మీద దాడుల వ్యవహారాన్నే తీసుకుంటే, అంతర్వేది రధం దగ్ధం ఘటనను రాష్ట్ర ప్రభుత్వం సీబీఐకి అప్పగిస్తూ గతంలోనే నిర్ణయం తీసుకుంది. ఆ సీబీఐ కేంద్ర పరిధిలోని అంశం. ఈ విషయమై కేంద్రం ఏం చేస్తోందో, రాష్ట్ర బీజేపీ ఆ కేంద్రాన్ని అడగాలి. కానీ, వైసీపీ హయాంలో దేవాలయాలపై దాడులంటూ నానా హంగామా చేస్తూ వస్తోంది. దానికి కేంద్ర స్థాయి బీజేపీ నేతలూ కొందరు వత్తాసు పలుకుతుండడం గమనార్హం.
ఈ రాజకీయాలతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీజేపీ ఏం సాధించగలుగుతుంది.? ప్రత్యేక హోదా, పోలవరం ప్రాజెక్టు, రైల్వే జోన్, దుగరాజపట్నం పోర్టు, కడప స్టీలు ప్లాంటు.. ఇలాంటి విషయాల్లో కేంద్రం, రాష్ట్రానికి ఏమీ చేయడంలేదు. ఇవి కేంద్రం పూర్తి చేయాల్సిన వ్యవహారాలు. విభజన చట్టంలోని అంశాలు కూడా. కేంద్రంలో ప్రభుత్వం తమదేనని ఏపీ బీజేపీ గట్టిగా చెప్పుకుంటుంటుంది. కానీ, ఏం ప్రయోజనం దాని వల్ల రాష్ట్రానికి.? ఆరోగ్యశ్రీ కేంద్రానిదంటూ బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా చెబుతున్నారు. ఆరోగ్యశ్రీ వైఎస్ రాజశేఖర్ రెడ్డి మానస పుత్రిక. అది వైఎస్సార్‌కి పేటెంట్ వున్న పథకం. ఇలాంటి చాలా విషయాల్లో కాషాయ దళం అనవసరపు వ్యాఖ్యలు చేసి, పరువు పోగొట్టుకుంటోంది.