Komatireddy Venkat Reddy: హుజూరాబాద్ లో టీఆర్ఎస్ అభ్యర్థికి మద్దతు ఇస్తా.. ఎంపీ పదవికి కూడా రాజీనామా చేస్తా
తెలంగాణ రాజకీయాల్లో వివాదాస్పద, సంచలన ప్రకటన చేయడంలో ముందుంటారు కాంగ్రెస్ సీనియర్ నేతలైన కోమటిరెడ్డి బ్రదర్స్. సొంత పార్టీపైనే ఆరోపణలు చేస్తుంటారు. ప్రత్యర్థి పార్టీలకు సపోర్టుగా మాట్లాడుతుంటారు. తెలంగాణలో కాంగ్రెస్ కు అవకాశం లేదని గతంలో కామెంట్ చేశారు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. టీపీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డిని ప్రకటించగానే.. పీసీసీ పోస్టును కొనుగోలు చేశారని వ్యాఖ్యానించి కాక రేపారు ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. తాజాగా మరోసారి సంచలన ప్రకటన చేశారు భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. తన లోక్ సభ సభ్యత్వానికి రాజీనామా చేస్తానని ప్రకటించారు. అంతేకాదు వచ్చే ఎన్నికల్లో కూడా పోటీ చేయనని స్పష్టం చేశారు. అంతటితో ఆగకుండా టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థికి మద్దతు ఇస్తానని కూడా ప్రకటించి సంచలనానికి తెర లేపారు. అయితే వీటిన్నంటికి ఓ కండిషన్ పెట్టారు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. భువనగిరి నియోజకవర్గంలో పర్యటించిన ఎంపీ… వాసాలమర్రిలాగే నియోజకవర్గం మొత్తం దళిత బంధు అమలు చేయాలని కోరారు. భువనగిరి పార్లమెంట్ స్థానంలో రోడ్లు, పెండింగ్ సమస్యలు పరిష్కరిస్తే ఎమ్మెల్యే, ఎంపీ పదవులకు రాజీనామా చేస్తామని.. వచ్చే ఎన్నికల్లో పోటీ కూడా చేసేదిలేదని, కావాలంటే బాండ్ రాసి ఇస్తామని ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సంచలన ప్రకటన చేశారు. తాను పోటీ చేయకుండా ఉండటమే కాదు.. టీఆర్ఎస్ అభ్యర్థికి మద్దతుగా ప్రచారం చేస్తానని కూడా కోమటిరెడ్డి ప్రకటించారు.
ఆరోపణాస్త్రాలు..
చౌటుప్పల్ మండలంలో కాంగ్రెస్ సర్వ సభ్య సమావేశంలో ఎంపీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో వివిధ పనులకు సంబంధించి.. కాంట్రాక్టర్లకు రూ.1,350 కోట్ల బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయని ఆరోపించారు. దీంతో కొంతమంది కాంట్రాక్టర్లు ఆత్మహత్యలు కూడా చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి సంబంధించిన పనులు అంటేనే.. ఎవరూ ముందుకు రావడం లేదని కోమటిరెడ్డి వెంకటరెడ్డి విమర్శించారు. మూసి ప్రక్షాళన కోసం పార్లమెంట్‌లో మాట్లాడతానని అన్నారు. హిట్లర్ బతికుంటే.. కేసీఆర్ ను చూసి ఏడ్చేవాడని ఎద్దేవా చేశారు. టీఆర్ఎస్ ప్రభుత్వంలో ప్రతిపక్ష ఎమ్మెల్యే, ఎంపీలకు ప్రొటోకాల్ కూడా ఇవ్వడం లేదని ఆరోపించారు. దళితులకు క్యాబినెట్‌లో స్థానం లేదని.. దళిత బంధు పేరుతో మోసం చేయడం సీఎం కేసీఆర్‌కు బాగా తెలుసని చెప్పారు. ఎంపీ స్థానంలో ఉన్న తనకే రెండేళ్ల నుంచి అపాయింట్‌మెంట్ అడిగితే ఇంతవరకు దిక్కేలేదని కోమటిరెడ్డి వెంకటరెడ్డి పేర్కొన్నారు. తాజాగా కోమటిరెడ్డి చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా చర్చనీయాంశమయ్యాయి. అయితే కోమటిరెడ్డి వెంకటరెడ్డి .. వ్యవహారం తెలిసిన నేతలు మాత్రం.. పెద్దగా పట్టించుకోనక్కరలేదని అంటున్నారట..