Motishwar Mandir | ఏడాది పొడవునా ఆలయంలో నీటితో ఉన్న బావి.. హిందూ ఆలయాల విశేషాలు మీకు తెలుసా?
Motishwar Mandir | ముస్లిం దేశం అయిన ఒమన్‌లో అధిక సంఖ్యలో ముస్లింలు నివసిస్తున్నప్పటికీ, హిందూ మతాన్ని అనుసరించే వారికి కూడా గౌరవప్రదమైన స్థానం ఉంది. ఈ నేపథ్యంలో ఒమన్ ప్రభుత్వం అధికారికంగా గుర్తించిన రెండు హిందూ దేవాలయాలు దేశ రాజధాని మస్కట్‌లో ఉన్నాయి.వాటిలో ఒకటి మోతీశ్వర మహాదేవ్ ఆలయం (శివాలయం). ఈ ఆలయం 20వ శతాబ్దం ప్రారంభంలో గుజరాత్‌కు చెందిన భాటియా వ్యాపారులు నిర్మించారు.

#image_title
ప్రత్యేకతలు ఏంటంటే..
మస్కట్‌లోని ముత్రా ప్రాంతంలో, అల్ ఆలం ప్యాలెస్ సమీపంలో ఉన్న ఈ ఆలయం మధ్యప్రాచ్యంలోని పురాతన హిందూ ఆలయాలలో ఒకటిగా గుర్తింపు పొందింది. ఆలయంలో శ్రీ ఆది మోతీశ్వర మహాదేవ్, శ్రీ మోతీశ్వర మహాదేవ్, హనుమంతుడితో పాటు మరికొన్ని విగ్రహాలు ప్రతిష్టించబడ్డాయి. మహాశివరాత్రి, శ్రీ రామనవమి, హనుమాన్ జయంతి, శ్రావణ మాసం, గణేశ్ చతుర్థి వంటి పండుగలను ప్రతి సంవత్సరం వైభవంగా నిర్వహిస్తారు.
ఈ ఆలయంలోని మరో ప్రత్యేకత ఏమిటంటే ప్రాంగణంలో ఉన్న బావి. మస్కట్ ఎడారి వాతావరణం కారణంగా తక్కువ వర్షపాతం ఉన్నా, ఈ బావిలో మాత్రం ఏడాది పొడవునా నీరు నిల్వ ఉండటం భక్తులు, స్థానికులు ఓ అద్భుతంగా భావిస్తున్నారు.మరో ప్రసిద్ధ ఆలయం శ్రీ కృష్ణ దేవాలయం. ఇది మోతీశ్వర ఆలయం నుంచి దాదాపు 10 కిలోమీటర్ల దూరంలో ఉంది. ప్రశాంతమైన వాతావరణంలో ఉన్న ఈ కృష్ణ ఆలయం భక్తులకు మానసిక శాంతిని, ఆధ్యాత్మిక అనుభూతిని అందిస్తోంది. భారతదేశం–ఒమన్ మధ్య సాంస్కృతిక సంబంధాల ప్రతీకగా నిలిచిన ఈ ఆలయాలు, స్థానిక హిందూ సమాజానికి మాత్రమే కాకుండా, దేశంలోని విభిన్న మతాల మధ్య సోదరభావానికి కూడా సంకేతంగా నిలుస్తున్నాయి.