సాగర్ ఉపఎన్నిక: బీజేపీ నేతల అత్యుత్సాహం? అప్పుడే అభ్యర్థి ఖరారయ్యారంటూ ప్రచారం ప్రారంభం?
ప్రస్తుతం తెలంగాణలో బీజేపీ దూకుడు మీదుంది. వరుసగా రెండు ఎన్నికల్లో గెలిచి.. తమ సత్తాను చాటింది బీజేపీ. దుబ్బాక ఉపఎన్నికలో గెలుపుతో పాటు జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఎక్కువ సంఖ్యలో సీట్లు సాధించడంతో బీజేపీ నాయకులకైతే ఒక కాన్ఫిడెన్స్ వచ్చేసింది. తెలంగాణలో బీజేపీకి ఓటు బ్యాంకు ఉందని.. ఇంకొంచెం కష్టపడితే అధికారంలోకి రావడం కూడా పెద్ద కష్టమేమీ కాదని వాళ్లకు అర్థమయింది. 2014 నుంచి టీఆర్ఎస్ పార్టీకి ప్రత్యామ్నాయం లేకుండా పోయింది. దీంతో ప్రస్తుతం టీఆర్ఎస్ పార్టీకి బీజేపీ ప్రత్యామ్నాయంగా మారుతోంది.
ఈనేపథ్యంలో త్వరలో నాగార్జునసాగర్ ఉపఎన్నిక జరగనుంది. దీంతో సాగర్ సీటును కూడా తమ ఖాతాలో వేసుకోవాలని ఉవ్విళ్లూరుతోంది బీజేపీ. ప్రస్తుతం తెలంగాణలో బీజేపీ హవా నడుస్తుండటంతో.. నల్గొండ జిల్లా బీజేపీ సీనియర్ నాయకులంతా టికెట్ తమకే అంటే తమకే అంటూ పోటీ పడుతున్నారు. టికెట్ కోసం ఎన్నడూ లేనంతగా విపరీతంగా పోటీ ఉండటంతో పార్టీ అధిష్ఠానం కూడా ఏం చేయాలో తెలియక సతమతమవుతోంది.
ఈనేపథ్యంలో కొందరు ఔత్సాహికులు మాత్రం సీటు తమదేనంటూ ఫిక్స్ అయిపోయి ప్రచార రథాలను సిద్ధం చేసుకుంటున్నారు. ఇప్పటి వరకు అఫిషియల్ గా బీజేపీ అభ్యర్థిని ప్రకటించనేలేదు కానీ.. ఓవైపు బీజేపీ పార్టీ అభ్యర్థిమి మేమే అంటూ ప్రచార రథాలు సిద్ధం చేసుకొని ప్రచారం ప్రారంభించారు.
ప్రచార రథం సిద్ధం చేసుకున్న నల్గొండ బీజేపీ అధ్యక్షుడు
నల్గొండ బీజేపీ అధ్యక్షుడు కంకణాల శ్రీధర్ రెడ్డి తన భార్య కంకణాల నివేదిత పేరుతో అప్పుడే ప్రచార రథాన్ని తయారు చేయించారు. మరి.. ఆమెకు అధిష్ఠానం టికెట్ ఇచ్చిందా? లేదా? అనేది తెలియనప్పటికీ.. కంకణాల నివేదితను సాగర్ లో బీజేపీ అభ్యర్థిగా గెలిపించాలంటూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేయించారు. బండి సంజయ్ హామీ ఇచ్చారా? లేక ఇంకెవరు హామీ ఇచ్చారో తెలియదు కానీ.. శ్రీధర్ రెడ్డితో పాటు చాలామంది నేతలు కూడా తమకే టికెట్ దక్కింది అంటూ ప్రచారాన్ని ప్రారంభించారు. దీంతో అసలు బీజేపీ నుంచి టికెట్ ఎవరికి వచ్చింది.. అనే విషయం తెలియక సతమతమవుతున్నారు.
అయితే.. కంకణాల నివేదిత గతంలో ఇదే సాగర్ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయింది. తాజాగా మళ్లీ తనకే టికెట్ దక్కింది.. అంటూ ఆమె ప్రచారాన్ని ప్రారంభించారు. అలాగే.. బీజేపీ అనుబంధ సంస్థల్లో పనిచేసిన విద్యార్థి నాయకుడు కోంపల్లి శ్రీనివాస్ యాదవ్ పేరుగా బలంగా వినిపిస్తోంది. ఆయన ఎన్ఆర్ఐ. ఆయన ఇక్కడ లేకున్నా కూడా ఆయన పేరు సాగర్ లో బాగా వినిపిస్తోంది. అలాగే.. సాగర్ నియోజకవర్గ ఇన్ చార్జ్ కడాలి అంజయ్య యాదవ్ కూడా పోటీలో ఉన్నారు. ఆర్ఎస్ఎస్ నేతలు రవీందర్ రెడ్డి, రఘునందన్ రెడ్డి.. కూడా బీజేపీ టికెట్ ను ఆశిస్తున్నారు. ఇంతమంది పోటీ మధ్య అసలు టికెట్ ఎవరికి వెళ్తుంది.. అనే విషయం కన్ఫమ్ కానప్పటికీ.. ఎవరికి వారు తమకే టికెట్ దక్కుతుంది.. అని ప్రచారాన్ని మాత్రం ప్రారంభించేశారు.
టీఆర్ఎస్ లోనూ అంతే
టీఆర్ఎస్ లో మొదటి ప్రాధాన్యతగా దివంగత ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య కొడుకు నోముల భగవత్ టికెట్ ఆశిస్తున్నారు. ఆయనకు టికెట్ ఇస్తే సానుభూతితో గెలిచే అవకాశం ఉంది. అయితే.. టీఆర్ఎస్ లోనూ సాగర్ టికెట్ కోసం నేతలు పోటీ పడుతున్నారు. భగవత్ తో పాటు అడ్వకేట్ కోటిరెడ్డి, ఎమ్మెల్సీ చిన్నపురెడ్డి, బొల్లెపల్లి శ్రీనివాస్ రాజ్.. వీళ్లంతా కూడా టీఆర్ఎస్ పార్టీ టికెట్ కోసం ఆశిస్తున్నారు. కానీ.. టికెట్ మాత్రం నోముల భగవత్ లేదంటే అడ్వకేట్ కోటిరెడ్డికే దక్కే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తోంది.
కాంగ్రెస్ నుంచి జానారెడ్డి కొడుకు బరిలోకి?
ఇక.. కాంగ్రెస్ నుంచి జానారెడ్డి కొడుకు రఘువీరారెడ్డి బరిలో దిగుతున్నట్టుగా తెలుస్తోంది. జానారెడ్డి తాను పోటీలో లేనని ముందే చెప్పిన సంగతి తెలిసిందే.
అయితే.. మూడు పార్టీల నుంచి చూసుకుంటే.. టీఆర్ఎస్, కాంగ్రెస్ కన్నా కూడా బీజేపీనే ఒక అడుగు ముందులో ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. టీఆర్ఎస్ పార్టీ గతంలో సాగర్ కు ప్రకటించిన హామీలను నెరవేర్చలేదని.. అందుకే.. ప్రజలు బీజేపీ వైపునకే ఎక్కువగా మళ్లుతున్నారని ప్రాథమిక సమాచారం.
అయితే యాదవ్.. లేదంటే రెడ్డి
సాగర్ లో ఎక్కువగా ప్రాబల్యం ఉన్న సామాజిక వర్గాలు రెండే. ఒకటి యాదవ్.. రెండు రెడ్డి. ఏ పార్టీ నుంచి అయినా సరే.. ఈ రెండు సామాజిక వర్గాలకు చెందిన నేతల్లో ఎవరో ఒకరు నిలబడితేనే గెలిచే అవకాశాలు ఎక్కువ. నియోజకవర్గం మొత్తం మీద యాదవ్ సామాజిక వర్గానికి చెందిన వాళ్లవి 50 వేల ఓట్లు ఉన్నాయి. అలాగే రెడ్డి ప్రాబల్యం కూడా ఎక్కువే ఉంది.
సో.. ఏ పార్టీ అయినా సరే.. ఈ సామాజిక వర్గాలను దృష్టిలో పెట్టుకొని అభ్యర్థులను కేటాయించే అవకాశం ఉంది.