Narasaraopet : మరో మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడని.. తండ్రిని దారుణ హత్య చేసి కొడుకు..!
నరసరావుపేట Narasaraopet : తన తండ్రి మరొక మహిళతో చనువుగా ఉంటూ డబ్బులు ఖర్చు చేస్తున్నాడని కిరాయి హంతకులకు సుఫారీ ఇచ్చి తండ్రిని అడ్డు తప్పించుకున్నాడు. చివరికి పోలీసులకు చిక్కాడు. పోలీసుల కథనం ప్రకారం నరసరావుపేట టౌన్, రామిరెడ్డిపేటకు చెందిన కోటపాటి సాయికృష్ణ తన తండ్రి మల్లికార్జున రావు (56) గత కొంత కాలంగా మరొక మహిళతో చనువుగా ఉండటాన్ని గమనించాడు. సాయికృష్ణ పలుమార్లు తన తండ్రిని హెచ్చరించాడు. మల్లికార్జున రావు వినకుండా ఆ మహిళకు డబ్బు ఖర్చు చేస్తూ కుటుంబాన్ని పట్టించుకోవడం మానేశాడు.
ఇలా అయితే ఉన్నంత వరకూ తనకు ఆస్తి దక్కదనే అక్కసుతో తండ్రి హత్యకు స్నేహితుడు కోట అనిల్‌తో కలిసి కుట్రపన్నాడు. కిరాయి హంతకులకు సుసారీ ఇచ్చి పకడ్బందీగా తండ్రిని అడ్డు తప్పించుకుందామనుకున్నాడు.ఈ క్రమంలోనే రొంపిచెర్ల మండలం మునమాకకు చెందిన ఈదర రాజారెడ్డిని సంప్రదించి, రూ.20 లక్షలకు బేరం కుదుర్చుకున్నారు. అనంతరం రాజారెడ్డి తన అనుచరులు మల్లికార్జునరావు కదలికలపై కొద్ది రోజులు రెక్కీ నిర్వహించారు. ఈనెల 7న గాయత్రీనగర్‌లో మల్లికార్జునరావును కిరాతకంగా మారణాయుధాలతో హతమార్చారు.
మల్లికార్జున రావు హత్యకును ప్రతిష్టాత్మకంగా తీసుకున్నపోలీసులు సీసీ కెమెరాల ఆధారంగా విచారణ వేగవంతం చేశారు. కొడుకు సాయికృష్ణ సెల్‌ఫోన్ కాల్ డేటా ఆధారంగా కేసును ఛేదించారు. శుక్రవారం ఉదయం నరసరావుపేట ఇస్సప్పాలెం వద్ద సాయికృష్ణ, అతని స్నేహితులను ఐదుగురిని అదుపోలోకి తీసుకున్నారు. నేరం వారే చేశారని ఒప్పుకోవడంతో నింధితులపై కేసు నమోదు చేశారు. వీరంతా 38 ఏళ్ల వయసులోపు వారే. వారివద్ద నుంచి మరణాయుధాలు, సెల్‌ఫోన్లు, ఓ ఆటో, ఓ ద్విచక్ర వాహనం స్వాధీనం చేసుకున్నారు. హత్య కుట్రలో భాగం పంచుకున్న మరో ఇద్దరు పరారీలో ఉన్నారని ఏఎస్పీ ఎన్‌వీఎస్ మూర్తి చెఎప్పారు. వారి ఆచూకీ కోసం గాలిస్తున్నట్టు వెల్లడించారు. మల్లికార్జున రావు స్వస్థలం ప్రకాశం జిల్లా. జీవనోపాధికై రామిరెడ్డిపేటకు వచ్చి రియలెస్టేట్ వ్యాపారం చేస్తూ ఇక్కడే స్థిరపడ్డాడు.