Ys Jagan : వైఎస్ జగన్ తో మీటింగ్ కి చిరంజీవితో పాటు ఎన్టీఆర్, మహేష్, ప్రభాస్ వెళ్లడం సాధ్యమా?
Ys Jagan : ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తో తెలుగు సినిమా పరిశ్రమ కు చెందిన ప్రముఖులు ఈ నెల పదవ తారీఖున భేటీ అయ్యే అవకాశాలు ఉన్నాయంటూ జోరుగా మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఆ విషయంలో ఇంకా క్లారిటీ రాలేదు. కానీ అతి త్వరలోనే ఇండస్ట్రీ నుండి ఏపీకి వెళ్లి సీఎం జగన్మోహన్ రెడ్డితో భేటీ అవ్వబోతున్నారు. ఈ సమయంలోనే చిరంజీవి తో పాటు ఇండస్ట్రీకి చెందిన పలువురు ప్రముఖ హీరోలు కూడా ఈ భేటీకి హాజరు అయ్యే అవకాశాలు ఉన్నాయంటూ మీడియా లో పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. ప్రధానంగా ప్రభాస్, ఎన్టీఆర్ మరియు మహేష్ బాబు కూడా ఈ భేటీకి హాజరు అయ్యే అవకాశాలు ఉన్నాయంటూ ప్రచారం జోరుగా జరుగుతోంది.ఇప్పటి వరకు ఇలాంటి భేటీ కి కానీ..
ఇలాంటి చర్చలకు కానీ మహేష్, ఎన్టీఆర్ మరియు ప్రభాస్ వెళ్లడం జరగలేదు. ఈసారి కూడా వెళ్తారని నమ్మకం ఏ ఒక్కరిలో లేదు. సాధారణంగా ఇలాంటి విషయాలకు దూరంగా ఉండే మహేష్ బాబు ఇప్పుడు ఈ భేటీకి వెళ్తాడు అనుకోవడం పొరపాటు అవుతుంది. అందుకే మహేష్ వెళ్తాడు అనే వార్తలో ఎలాంటి నిజం లేదు. ఇక ప్రభాస్ ఇలాంటి వ్యవహారాలకు చాలా దూరంగా ఉంటాడు. కనుక ఆయన అమరావతి వెళ్తాడు అనుకోవడం పొరపాటు అవుతుంది. ఇక ఎన్టీఆర్ ఇలాంటి వ్యవహారాలకు దగ్గరగా ఉన్నట్లుగా అనిపించినా కూడా ఇతర హీరోలు వెళ్ళనప్పుడు ఆయన కూడా వెళ్లడం అనుమానమే. కనుక ఇంతకు ముందు మాదిరిగానే చిరంజీవి నాగార్జున ఇతర ప్రముఖ నిర్మాతలు మాత్రమే వెళ్లే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే ఏపీ ప్రభుత్వం టికెట్ల విషయం లో ఒక నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తోంది.టికెట్ల రేట్ల విషయంలో ప్రభుత్వం నియమించిన కమిటీ సభ్యులు ఒక నివేదికను తయారు చేసి మంత్రికి ఇచ్చినట్లుగా తెలుస్తోంది.
ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులు సీఎం జగన్మోహన్ రెడ్డితో భేటీ అయిన తర్వాత ఆ నివేదికను బయటికి వెల్లడించే అవకాశాలు ఉన్నాయి. సీఎం జగన్ మోహన్ రెడ్డి తో ఇండస్ట్రీ ప్రముఖల భేటీ తర్వాత టికెట్ల రేట్లు విషయంలో క్లారిటీ వస్తుంది అంటూ గత వారం పది రోజుల నుండి ప్రచారం జరుగుతోంది. తాజాగా మంత్రి చేసిన వ్యాఖ్యలు కూడా అందుకు నిదర్శనంగా ఉన్నాయి. కనుక కచ్చితంగా అతి త్వరలోనే ఏపీ ప్రభుత్వం నుండి ఒక గుడ్ న్యూస్ టాలీవుడ్ కు వినిపించే అవకాశాలు ఉన్నాయంటూ ఇండస్ట్రీ వర్గాల వారు నమ్మకం వ్యక్తం చేస్తున్నారు. ఏపీలో టికెట్ల రేట్లు పెంచితే ఈ నెల నుంచే సినిమాల జోరు కొనసాగే అవకాశం ఉంది. అక్కడ టికెట్ల రేట్లు తక్కువగా ఉన్నాయని ఉద్దేశంతో చాలా మంది తమ సినిమాలను వాయిదా వేసిన విషయం తెలిసిందే. టికెట్ల రేట్ల పెంపుతో ఇప్పుడు బ్యాక్ టు బ్యాక్ సినిమాలు వచ్చే అవకాశం ఉంది.