Janasena : అల్లూరి కార్యక్రమం… జనసేన, బీజేపీ పొత్తు ఉన్నదా? లేదా?
Janasena : ఏపీ రాజకీయాలు ఎవరికి అర్థం కావడం లేదు. ఒక వైపు జనసేన మరియు బీజేపీ పొత్తులో ఉన్నట్లుగా ఆయా పార్టీల నాయకులు చెబుతున్నారు. కాని ఆ రెండు పార్టీలు నిజంగా పొత్తులో ఉన్నాయా అనే అనుమానం చాలా మందికి కలుగుతుంది. రాష్ట్రంలో బీజేపీ మరియు జనసేన కలిసి నిర్వహిస్తున్న కార్యక్రమాలు ఏమీ లేవు. అంతే కాకుండా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఏమాత్రం జనసేన పార్టీకి మరియు పవన్ కళ్యాణ్ కు ప్రాముఖ్యత ఇస్తున్నట్లుగా కనిపించడం లేదు.
ఈనెల 4వ తారీకున ఏపీలో కేంద్ర ప్రభుత్వం తరపున జరగబోతున్న అతి పెద్ద కార్యక్రమంకు సంబంధించి పవన్ కళ్యాణ్ కు ఆహ్వానం దక్కక పోవడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. అల్లూరి సీతారామరాజు కాంస్య విగ్రహ ఆవిష్కరణకు మోడీ హాజరు కాబోతున్నారు. కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం భారీగా నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి సీఎం జగన్ తో పాటు వైకాపా మంత్రులు అందరికి కూడా ఆహ్వానం అందిన విషయం ఇప్పటికే అధికారికంగా మీడియా ద్వారా తెలుస్తోంది.
మరో వైపు ఏపీ మాజీ ముఖ్యమంత్రి ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడుకు కూడా ప్రత్యేక ఆహ్వానం అందింది. చంద్రబాబు నాయుడు కొన్ని కారణాల వల్ల హాజరు అవ్వడం లేదు. ఆయన తరపున టీడీపీ ముఖ్య నాయకులు హాజరు అవ్వబోతున్నారు. జనసేన పార్టీని కూడా ఆహ్వానించారు. కాని చంద్రబాబు నాయుడుకు దక్కిన ప్రత్యేక ఆహ్వానం మాత్రం పవన్ కళ్యాణ్ కు అందలేదు. దాంతో పవన్ కళ్యాణ్ ఈ విషయంలో ఒకింత అసంతృప్తితో ఉన్నాడని.. అంతే కాకుండా జనసేన పార్టీ కి బీజేపీతో ఉన్న పొత్తు విషయమై నీలి నీడలు కమ్ముకున్నాయి అన్నట్లుగా చర్చ జరుగుతోంది.