Scientific Reason : నవజాతశిశువులకు అదనపు అవయవాలు ఉండటానికి కారణం ఇదే.. పుట్టుకకు ముందే గుర్తించవచ్చా..?
Scientific Reason : కొంతమంది నవజాత శిశువులు విచిత్రంగా పుడతారు. అంగవైకల్యం.. అదనపు అవయవాలు ఇలా జన్మిస్తుంటారు. దీనికి ప్రధానంగా జన్యుపరమైన సమస్యల కారణంగా ఎక్కువగా జరుగుతుంటాయి. వంశపారంపర్యంగా ఇదివరకు కుటుంబంలో ఎవరికైనా ఇలాంటి లోపాలు ఉంటే తర్వాత జనరేషన్ లో కూడా ఈ లోపాలు కనిపిస్తాయి. రెండు తలలతో శిశువు జన్మించడం… మూడు చేతులతో పుట్టడం… ఐదు వేళ్లకు బదులుగా ఆరు వేళ్లు రావడం జరుగుతుంది.ఇటీవల మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో ఇలాంటి శిశువే జన్మించాడు. ఆ బేబీకి రెండు తలలు, మూడు చేతులు ఉన్నాయి. అయితే గుండె, ఊపిరితిత్తులు, కడుపు ఒకటే ఉన్నాయి. ఇలాంటి కేసులు మిలియన్‌లో ఒకటిగా ఉంటాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. అటువంటి కేసును డైసెఫాలిక్ పారాపెగస్ అంటారని చెబుతున్నారు.
మన దేశంలో ఈ వైకల్యాలు ఉన్నవారిలో 2 నుంచి 3 శాతం మంది ఉన్నారు. అయితే అనేక అంగ వైకల్యాలను పుట్టుకకు ముందే గుర్తించవచ్చు. కొన్నింటిని మాత్రం పుట్టుకకు ముందు గుర్తించలేరు. వైద్యులు తెలిపిన వివరాల ప్రకారం పాథాలజీ ఎంత తీవ్రంగా ఉంటే, సమస్య ఆలస్యంగా గుర్తించబడుతుందంటున్నారు. ఈ వైకల్యాలకు ప్రధాన కారణం జన్యులోపం. జన్యువులలో ఉత్పరివర్తనాల కారణంగా ఇటువంటి సమస్యలు తలెత్తుతాయి. కొన్ని వైకల్యాలు వంశపారంపర్యంగా వస్తాయి. ఉత్పరివర్తనాల కారణంగా కుటుంబాలలో మొదటిసారిగా అనేక కేసులు సంభవిస్తాయి. బీబీసీ నివేదిక ప్రకారం గర్భం దాల్చిన మొదటి 16 నుండి 20 వారాల మధ్య ఇటువంటి వైకల్యాలను గుర్తించవచ్చు.
వాటిని గుర్తించడంలో సాధారణ సోనోగ్రఫీ సహాయకరంగా ఉంటుంది.ఈ ప్రక్రియ తర్వాత, వైకల్యాలు గుర్తించినప్పుడు భవిష్యత్తులో ఈ శిశువు ఎంత కాలం జీవిస్తాడనే దానిపై కూడా వైద్యులు పరిశోధన చేస్తున్నట్లు చెబుతున్నారు. మనదేశంలోని వివిధ గ్రామాలు, పట్టణాలలో సోనోగ్రఫీ లేదా ఇతర పరీక్షల కోసం వైద్య పరికరాలు, సౌకర్యాలు అందుబాటులో ఉంటే అటువంటి వైకల్యాలను ముందుగానే సులభంగా గుర్తించవచ్చని అంటున్నారు. వివిధ రకాల లోపాలతో జన్మించే శిశువులకు మెరుగైన వైద్యం అందించి తొంబై శాతం క్యూర్ చేసే అవకాశాలున్నట్లు వైద్య నిపుణులు చెబుతున్నారు. టెక్నాలజీ పెరిగినందున నవజాత శిశువులకు మెరుగైన వైద్య సేవలను అందించడానికి వైద్యరంగంలో పరిశోధనలు జరుగుతున్నాట్లు చెబుతున్నారు.