Siva Shankar Reddy : పెన్షన్ల తొలగింపుపై టీడీపీదీ తప్పుడు ప్రచారం… శివశంకర్ రెడ్డి…!!
Siva Shankar Reddy : రాష్ట్ర ప్రభుత్వం పెన్షన్ల జాబితా నుంచి అర్హులైన వారిని తొలగిస్తోందంటూ టీడీపీ చేస్తున్న ఆరోపణల్ని వైఎస్సార్ సీపీ ఖండించింది. రాజకీయంగా ఎదుర్కోలేకనే టీడీపీ మరియు వారి ఎల్లో మీడియా అసత్య ప్రచారాలకు దిగుతోందని వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి శివశంకర్ రెడ్డి మండిపడ్డారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రస్తుత ప్రభుత్వం వైఎస్సార్ పెన్షన్ కానుక పథకం కింద సాయం అందిస్తోందని ఆయన పేర్కొన్నారు. అర్హులైన వారిని పెన్షనర్ల జాబితా నుంచి తొలగిస్తున్నారని టీడీపీ నాయకులు చేస్తున్న ప్రచారం పూర్తిగా అవాస్తవమని మండిపడ్డారు.
ప్రభుత్వం ప్రతి ఆరు నెలలకు ఒకసారి పెన్షన్ కు అర్హులైనవారికి దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పిస్తుందని వెల్లడించారు. ఒకవేళ ఎవర్నైనా పెన్షన్ పథకం నుంచి తొలగించాలంటే ముందుగా 15 రోజుల నోటీసు కూడా ఇవ్వాల్సి ఉంటుందని ఆయన గుర్తు చేశారు. ఇది సర్వసాధారణమైన ప్రక్రియ అని, 2019 లో అధికారంలోకి వచ్చాక పెన్షన్ల రివ్యూ ప్రక్రియ చేపట్టడం ఇది మూడోసారి అని అన్నారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో రూ.400 కోట్ల బడ్జెట్ తో 39 లక్షల మందికి పెన్షన్ అందించగా.. ఇప్పుడు వైఎస్సార్ సీపీ హయాంలో రూ.1600 కోట్ల బడ్జెట్ తో 62 లక్షల మంది లబ్దిదారులకు పెన్షన్ అందిస్తున్నట్లు తెలిపారు.
అంతేకాకుండా, వచ్చే నెల నుంచి లబ్దిదారులకు పెన్షన్ సాయాన్ని రూ.2,500 నుంచి రూ.2,750 కి పెంచనున్నట్లు పేర్కొన్నారు. దీన్ని బట్టి రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ కు పేదల సంక్షేమం పట్ల ఉన్న అంకిత భావం స్పష్టమవుతోందన్నారు. ప్రతినెల మొదటి రోజునే దాదాపు 90శాతం మంది లబ్దిదారులకు పెన్షన్లు చేరుతున్నాయన్నారు. వైఎస్సార్ పెన్షన్ కానుక పథకం కింద వ్రుద్దులు, వికలాంగులు, ఒంటరి మహిళలు, కళాకారులు, కల్లు గీత కార్మికులు, ట్రాన్స్ జెండర్స్, డప్పు కళాకారులు ఎన్నడూ లేనివిధంగా ఈ ప్రభుత్వంలో లబ్ది పొందుతున్నారని శివశంకర్ రెడ్డి తెలిపారు.