జనసేన దెబ్బ.. సోము వీర్రాజు అబ్బ.. తిరుపతి ఉపఎన్నికపై వెనక్కి తగ్గాడుగా? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

జనసేన దెబ్బ.. సోము వీర్రాజు అబ్బ.. తిరుపతి ఉపఎన్నికపై వెనక్కి తగ్గాడుగా?

 Authored By jagadesh | The Telugu News | Updated on :23 December 2020,12:13 pm

ప్రస్తుతం ఏపీలో ఒకే ఒక్క హాట్ టాపిక్. అదే తిరుపతి ఉపఎన్నిక. తిరుపతి ఉప ఎన్నిక త్వరలో జరగనున్న నేపథ్యంలో ఏపీలోని ప్రధాన పార్టీలన్నీ అప్పుడే రంగంలోకి దిగాయి. నువ్వా.. నేనా.. అన్నట్టుగా పోటీ పడుతున్నాయి. అధికార పార్టీ వైసీపీ ఎలాగూ పక్కాగా గెలిచి తీరాలని పట్టుబడుతోంది. అలాగే.. టీడీపీ కూడా ఈసారి బాగానే ఆశలు పెట్టుకుంది. కనీసం తిరుపతి ఉపఎన్నికలో గెలిచి తమ సత్తా చాటాలని ప్రయత్నిస్తోంది. ఇక.. బీజేపీ, జనసేన మధ్య ప్రస్తుతం తిరుపతి ఉపఎన్నిక విషయంలో పెద్ద గొడవే జరుగుతోంది.

somu veerraju back step on tirupati by election

somu veerraju back step on tirupati by election

ఎందుకంటే.. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ కోసం జనసేన పోటీ చేయకుండా త్యాగం చేసింది. జనసేన తిరుపతి ఉపఎన్నికను దృష్టిలో పెట్టుకొని అక్కడ పోటీ చేయకుండా.. ఇక్కడ సీటు కావాలని బీజేపీకి కబురు పంపింది. కానీ.. బీజేపీ మాత్రం.. దూకుడు మీద ఉండి.. లేదు లేదు.. తిరుపతిలోనూ బీజేపీ పోటీ చేస్తుందంటూ హింట్ ఇచ్చింది. దీంతో జనసేన, బీజేపీ మధ్య మాటల వార్ ప్రారంభం అయింది. వార్నీ.. వీళ్లు కలిసి సంవత్సరం కూడా కాలేదు.. అప్పుడే రెండు పార్టీలు నడిరోడ్డు మీద కొట్టుకుంటున్నాయిగా.. అంటూ ప్రజలు అనుకున్నారు.

ఏది ఏమైనా.. ఈసారి తిరుపతి ఉపఎన్నికలో పోటీ చేసి తీరుతాం అని జనసేన కూడా భీష్మించుకు కూర్చున్నది. ఈనేపథ్యంలో ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు కూడా ఎటూ తేల్చుకోలేకపోతున్నట్టు తెలుస్తోంది. జనసేన దెబ్బకు ఆయన కూడా తిరుపతి ఉపఎన్నిక అభ్యర్థి విషయంలో వెనక్కి తగ్గినట్టుగా స్పష్టమవుతోంది.

బీజేపీ అంటేనే ఏపీలోని ఇతర పార్టీలు వణుకుతున్నా… జనసేన మాత్రం బెదరడం లేదు. సై అంటే సై అంటోంది. దీంతో సోము వెనక్కి తగ్గాల్సిన పరిస్థితి ఏర్పడింది.

ఇటీవల శోభాయాత్ర సమయంలో బీజేపీ తిరుపతి ఉపఎన్నిక బరిలో ఉంటుందని చెప్పినా… ప్రస్తుతం మాత్రం ఆమాట మాట్లాడటం లేదు. తిరుపతి వెంకన్న సాక్షిగా.. బీజేపీ అభ్యర్థిని గెలిపించాలన్న సోము.. ఇప్పుడెందుకు మౌనంగా ఉన్నారు.. అనేదే మిలియన్ డాలర్ల ప్రశ్న.

జనసేనతో ఇంకా చర్చిస్తున్నాం

అయితే.. ఇటీవల చిత్తూరు జిల్లా పర్యటనలో ఉన్న సోము… తిరుపతి ఉపఎన్నికపై ఇంకా జనసేన పార్టీతో చర్చిస్తున్నామని.. ఇంతవరకు అభ్యర్థిపై నిర్ణయం తీసుకోలేదని దాటవేశారు. బీజేపీ, జనసేన.. ఈ రెండు పార్టీలో ఒక పార్టీ అభ్యర్థి మాత్రమే పోటీ చేస్తారంటూ ఆయన చెప్పడం వెనుక జనసేనకు బీజేపీ భయపడింది.. అనే విషయం స్పష్టంగా అర్థమవుతోంది.

ఇన్ డైరెక్ట్ గా ఈసారి తిరుపతి ఉపఎన్నికలో బీజేపీ కాకుండా.. జనసేన అభ్యర్థి పోటీలో ఉండబోతున్నట్టుగా సోము సంకేతాలు ఇచ్చినట్టు తెలుస్తోంది. చూద్దాం మరి.. ఒకవేళ జనసేన బరిలో దిగితే అధికార పార్టీ వైసీపీ, టీడీపీని దాటుకొని గెలుస్తుందా? జనసేన దమ్మును చూపిస్తుందా?

jagadesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది