సౌతాఫ్రికా కోవిడ్ 19 వేరియెంట్‌తో ముప్పు తప్పదా ? వ్యాక్సిన్లకు లొంగడం లేదు..!
కరోనా నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా టీకాల పంపిణీ కార్యక్రమాలు కొనసాగుతుండగా.. ప్రస్తుతం సౌతాఫ్రికా కోవిడ్ 19 వేరియెంట్ సైంటిస్టులను, ప్రజలను ఆందోళనలకు గురి చేస్తోంది. సౌతాఫ్రికాలో వ్యాప్తి చెందుతున్న కోవిడ్ 19 వేరియెంట్ వ్యాక్సిన్లకు లొంగడం లేదని ఫైజర్, బయో ఎన్‌టెక్ సంస్థలు చేపట్టిన అధ్యయనాల్లో వెల్లడైంది. దీంతో ఈ వేరియెంట్‌పై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.
సౌతాఫ్రికాలో బి.1.351 అనే కరోనా వేరియెంట్ వ్యాప్తి చెందుతోంది. అయితే ఇది చాలా శక్తివంతమైందని సైంటిస్టులు అంటున్నారు. అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్ మెడికల్ బ్రాంచ్ సైంటిస్టులు సౌతాఫ్రికా కరోనా వేరియెంట్‌ను పోలిన వేరియెంట్‌ను ల్యాబ్‌లో సృష్టించారు. తరువాత ఫైజర్ వ్యాక్సిన్ తీసుకున్న వారి నుంచి రక్తాన్ని సేకరించారు. అనంతరం ఆ వైరస్‌తో ఆ రక్తాన్ని పరీక్షించారు. దీంతో ఆ రక్తంలో ఉన్న మూడింట రెండు వంతుల యాంటీ బాడీలు త్వరగా నాశనమైనట్లు గుర్తించారు. అంటే.. సౌతాఫ్రికా కోవిడ్ వేరియెంట్ వ్యాక్సిన్లకు లొంగదని స్పష్టమవుతుంది.
కానీ ఇది కేవలం చిన్నపాటి అధ్యయనమే అని, దీనిపై ఇంకా పరిశోధనలు చేయాల్సిన అవసరం ఉందని సైంటిస్టులు తెలిపారు. అయితే భారత్‌లో సీరమ్ ఇనిస్టిట్యూట్ ఉత్పత్తి చేస్తున్న కోవిషీల్డ్ వ్యాక్సిన్‌ను 10 లక్షల డోసుల మేర సౌతాఫ్రికా తీసుకుంది. కానీ ఆ వ్యాక్సిన్ తమ కరోనా వేరియెంట్‌పై పనిచేయకపోవచ్చనే కారణంతో ఆ డోసులను మొత్తాన్ని వెనక్కి తీసుకోవాలని సీరమ్‌ను కోరినట్లు తెలిసింది. ఈ క్రమంలో సౌతాఫ్రికా కరోనా వేరియెంట్‌పై అందరిలోనూ అనుమానాలు నెలకొన్నాయి. అసలు ఆ వైరస్ వ్యాప్తి చెందితే ప్రస్తుతం అందుబాటులో ఉన్న వ్యాక్సిన్లు పనిచేస్తాయా, లేదా అనేది సందేహంగా మారింది.