Telangana : క్రిస్మస్, న్యూ ఇయర్ వేడుకలపై తెలంగాణ ప్రభుత్వం ఆంక్షలు..!
Telangana : క్రిస్మస్, న్యూ ఇయర్ వేడుకలకు సంబంధించి తెలంగాణ హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి కీలక ఆదేశాలు జారీ చేసింది. ఆయా వేడుకలపై కఠిన ఆంక్షలు విధించాలని ఉత్తర్వులు ఇచ్చింది. ఈ మేరకు ప్రభుత్వం నుంచి మరో 2 రోజుల్లో స్పష్టమైన ఆదేశాలు రావాలని కోరింది. రాష్ట్రంలో ఒమిక్రాన్ వేరియంట్ కేసులు రోజురోజుకీ పెరిగుతూ పోతుండటంతో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. మహమ్మారి వ్యాప్తి తీవ్రంగా ఉందంటూ.. వేడుకల పేరిట జనం గుమిగూడే అవకాశం ఉందని వివరించింది
ఆ మేరకు అధికారులంతా అప్రమత్తంగా ఉండాలని సూచించింది. దాంతో పాటు ఇతర దేశం, రాష్ట్రాల నుంచి వచ్చే వారి పట్ల అప్రమత్తంగా ఉంటూ వారికి వ్యాధి నిర్వహణ పరీక్షలు నిర్వహించే ఏర్పాట్లన్నీ చేయాలని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ మేరకు అధికారులు రాష్ట్రంలోని ప్రధాన నగరాల్లో.. స్టార్ హోటళ్లు, వినోద క్లబ్బుల యజమానులు, ఫామ్‌హౌస్‌ల నిర్వాహకులకు ఈ మేరకు ఆదేశాలు జారీ చేయనున్నారు.
దేశంలో ఒమిక్రాన్ వ్యాప్తి దృష్ట్యా కేంద్రం ఇటీవల రాష్ట్రాలకు పలు సూచనలు జారీ చేసింది. ఈ మేరకు ఇప్పటికే పలు రాష్ట్ర ప్రభుత్వాలు.. ఆయా రాష్ట్రాల్లో క్రిస్ మస్ మరియు కొత్త సంవత్సరం వేడుకలపై నిషేధాలు ప్రకటించేందుకు సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే చెన్నై, ముంబై, బెంగళూరు నగరాల్లో నూతన సంవత్సర వేడుకల రద్దుకు ఆదేశాలు సిద్ధంకాగా.. ఢిల్లీ, కోల్ కతా, హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం వంటి నగరాల్లో న్యూ ఇయర్ వేడుకలపై ప్రభుత్వాలు రేపో మాపో నిర్ణయాన్ని ప్రకటించనున్నట్లు తెలుస్తోంది.