Etela Rajender : రాజకీయ నాయకులంటేనే ప్రజలు చీదరించుకుంటున్నారు? ఈటల సంచలన వ్యాఖ్యలు?
Etela Rajender : తెలంగాణలో ప్రస్తుతం రాజకీయాలన్నీ ఏదో కొత్త దారులను వెతుక్కుంటున్నాయి. ముఖ్యంగా అధికార టీఆర్ఎస్ పార్టీలో అయితే… అంతర్గత విభేదాలు బాగానే రగులుతున్నాయి. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు, మంత్రులు టీఆర్ఎస్ పార్టీపై బహిరంగంగానే విమర్శలు చేశారు. మంత్రి ఈటల రాజేందర్ కూడా చాలాసార్లు తన బాధను వెల్లగక్కారు. తాజాగా మరోసారి రాజకీయాలపై తన మనసులోని మాటను బయటపెట్టారు ఈటల.
వరంగల్ లో జరిగిన టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న ఈటల.. రాజకీయాలపై, ప్రస్తుతం ఉన్న రాజకీయ నాయకులపై సంచలన వ్యాఖ్యలు చేశారు. అసలు… రాజకీయాలంటేనే ప్రజలు నమ్మడం లేదు… ప్రజలకు విశ్వాసం పోయింది. రాజకీయ నాయకులపై ప్రజలకు రాను రాను నమ్మకం పోతోంది. ఇదివరకు రాజకీయ నాయకులంటే ప్రజలు చాలా నమ్మేవారు. వాళ్ల మీద ఎంతో విశ్వాసం ఉండేది. కానీ.. ఇప్పుడు పరిస్థితులు మొత్తం మారిపోయాయి. ప్రస్తుతం రాజకీయ వ్యవస్థ ఎలా ఉందో మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు… అంటూ ఈటల రాజేందర్ షాకింగ్ వ్యాఖ్యలు చేశారు.
Etela Rajender : రాజకీయ నాయకుల మీద ప్రజలకు విశ్వాసం పెరగాలి
రాజకీయాలు, రాజకీయ నాయకుల మీద ప్రజలకు విశ్వాసం పెరగాలి. వాళ్ల మీద గౌరవం పెరగాలి. ఆ విధంగా ప్రజలను మనం మున్ముందుకు తీసుకెళ్లాలి. రాజకీయ నాయకులు ప్రజల, సమాజ శ్రేయస్సు కోసం పని చేసే వారే కానీ… వాళ్లను ఇబ్బంది పెట్టాలని చూసేవాళ్లు కాదు. కానీ… నేటి పరిస్థితులు అలా తయారయ్యాయి. రాజకీయ నాయకులు, ప్రజల మధ్య నేడు ఉండే సంబంధాలు చూస్తుంటే బాధగా ఉంటోంది. వాళ్ల మధ్య స్నేహపూర్వకమైన సంబంధం ఉండాలి. మాటలు చెబుతూ.. రాజకీయ నాయకులు కాలం గడిపే రోజులు పోయాయి. గతమేమిటో…. అన్ని విషయాలు తెలుసుకొని ముందుకు వెళ్తేనే ప్రజలు ఆదరిస్తున్నారు. ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా మారుతూ… ప్రజల మనసును గెలుచుకునేవాడే నిఖార్సయిన రాజకీయ నాయకుడంటూ… ఈటల రాజకీయాలపై తనకున్న అభిప్రాయాన్ని టీఆర్ఎస్ కార్యకర్తల మీటింగ్ లో వెల్లడించారు.