YS Jagan : వైఎస్ జగన్ వాళ్ళని దుష్టచతుష్టయం అనేది అందుకే మరి.!
YS Jagan : పదే పదే ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎందుకు ‘దుష్ట చతుష్టయం’ అనే ప్రస్తావన తెస్తున్నారు.? అంటే, దానికి చాలా కారణాలున్నాయి. ప్రతి విషయానికీ టీడీపీ అను‘కుల’ మీడియా గగ్గోలు పెడుతుంటుంది. తెలుగు దేశం పార్టీ కంటే ఎక్కువగా, ఆ పార్టీ అను‘కుల’ మీడియా, వైఎస్ జగన్ సర్కారుకి వ్యతిరేకంగా పిచ్చి వార్తల్ని ప్రచారంలోకి తెస్తుంటుంది. అదే అసలు సమస్య. రాష్ట్రానికి అప్పులు దొరక్కూడదు.. రాష్ట్రానికి కేంద్రం సాయం చేయకూడదు.. ఇలా సాగుతుటుంది టీడీపీ అను‘కుల’ మీడియా తీరు. ఏ మీడియా సంస్థ అయినా, ఓ రాష్ట్రం బాగుపడకూడదని కోరుకుంటుందా.? కానీ, ఆంధ్ర ప్రదేశ్‌లో కాకుండా పొరుగు రాష్ట్రంలో తమ ఆస్తుల్ని పెట్టుకున్న ఆయా మీడియా సంస్థల యజమానులు, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి అన్యాయం చేయాలని చూస్తుంటారు. అందుకే, పదే పదే వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అలాంటివారిని ‘దుష్ట చతుష్టయం’గా పేర్కొనాల్సి వస్తుంది.
కోవిడ్ వల్ల జరిగిన మరణాల విషయమై కేంద్రం ఓ లెక్క విడుదల చేసింది. అందులో, ఆంధ్రప్రదేశ్ అధికారికంగా పేర్కొన్న కోవిడ్ మరణాల కంటే ఎక్కువ సంఖ్యలో కోవిడ్ మృతులకు పరిహారం అందించినట్లుగా పేర్కొన్నారు. ఇందులో ఆశ్చర్యపోవడానికేమీ లేదు. కోవిడ్ మరణాన్ని ధృవీకరించడానికి అప్పట్లో చాలా నియమ నిబంధనలుండేవి. ఆ తర్వాత పరిస్థితులు మారాయి. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం తరఫున పరిహారం అందడాన్ని స్వాగతించాలి కదా.? కానీ, కొత్త అనుమానాల్ని టీడీపీ అను‘కుల’ మీడియా తెరపైకి తెచ్చింది. ఇదొక్కటే కాదు, రాష్ట్ర ఆదాయం పెంచుకునేందుకు, రోడ్డు పక్కన వుండే భూముల ధరల్ని ప్రభుత్వం పెంచాలనుకుంటే.. దాన్నీ ఓ నేరంగా చూపుతోంది తెలుగు దేశం పార్టీ అను ‘కుల’ మీడియా. ఒకటా.? రెండా.? అను నిత్యం ఇదే పరిస్థితి.
వరదల నేపథ్యంలో బాధిత కుటుంబాలకు 2 వేల రూపాయల తక్షణ సాయాన్ని వైఎస్ జగన్ సర్కారు అందిస్తోంటే, అది ఈ మీడియాకి కనిపించడంలేదు. టీడీపీ చేసిన ఆరోపణల్ని పదే పదే ప్రస్తావించి, వైసీపీ మీద బురద చల్లడం ప్రభుత్వం మీద వ్యతిరేక వార్తలు రాయడం తప్ప.. ప్రజలకు అందుతున్న సాయం గురించి అస్సలేమాత్రం ప్రస్తావించడంలేదు సోకాల్డ్ మీడియా. టీడీపీ అంటే వైసీపీకి రాజకీయ ప్రత్యర్థి. కానీ, ఈ మీడియాకి ఏమయ్యింది.? మీడియా ఎందుకు వైసీపీ మీద రాజకీయ వైరం ప్రదర్శిస్తోంది.? అందుకే, ముఖ్యమంత్రి సదరు మీడియాపై మండిపడుతుంటారు. ప్రజలకు వాస్తవాలు తెలియాలి. ఆ తెలియజేసే ప్రయత్నంలోనే వైఎస్ జగన్, ‘దుష్ట చతుష్టయం’ అని అంటుంటారు.