AP High Court : అమరావతి నుంచి కర్నూలుకి ఏపీ హైకోర్టు.! కేంద్రం ఏం చెప్పిందంటే.!
AP High Court : ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నుంచి హైకోర్టును, కర్నూలుకి తరలించాలనీ, అలా కర్నూలుని న్యాయ రాజధానిని చేయాలనీ ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ జగన్ ప్రభుత్వం ప్రయత్నిస్తోన్న సంగతి తెలిసిందే. అయితే, న్యాయ రాజధాని తరలింపు విషయమై అనేక చిక్కుముడులున్నాయి. ఉమ్మడి తెలుగు రాష్ట్రం విభజనతో, ఉమ్మడి హైకోర్టు ఏర్పడింది. ఆ తర్వాత, హైకోర్టు ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి మారింది. ఈ క్రమంలో పెద్ద ప్రక్రియే నడిచింది. సుప్రీంకోర్టు అనుమతి, రాష్ట్రపతి ఉత్తర్వులు.. ఇదంతా పెద్ద వ్యవహారమే. మళ్ళీ అమరావతి నుంచి హైకోర్టు, కర్నూలుకు మార్చాలన్నా ఆ ప్రక్రియ మళ్ళీ అవసరమవుతుందన్నది న్యాయ నిపుణుల వాదన.
అయితే, రాజధాని అమరావతి కోసం భూములిచ్చిన రైతులతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందంలో టెర్మ్స్ అండ్ కండిషన్స్ పక్కగా వున్నాయి. చంద్రబాబు హయాంలో ఈ ఒప్పందాలు పక్కాగా జరిగాయి. అవిప్పుడు, రాజధాని అమరావతి నుంచి కార్య నిర్వాహక రాజధాని అయినా, న్యాయ రాజధాని అయినా తరలించడానికి వీల్లేకుండా చేస్తున్నాయి. ఇదిలా వుంటే, అమరావతి నుంచి కర్నూలుకు హైకోర్టు తరలించే విషయమై కేంద్రాన్ని, రాష్ట్ర ఎంపీలు ప్రశ్నిస్తే, ఆ ప్రశ్నకు సమాధానమిచ్చింది లోక్‌సభలో కేంద్ర ప్రభుత్వం. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రతిపాదన అందిందనీ, అయితే ఈ విషయమై రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టులో తేల్చుకోవాలనీ కేంద్రం స్పష్టం చేసింది. అంటే, బంతి ఇప్పుడు హైకోర్టులో పడ్డట్టయ్యిందన్నమాట.
హైకోర్టులో రాజధానికి సంబంధించి పలు పిటిషన్లు విచారణ దశలో వున్నాయి. అందులో న్యాయ రాజధాని అంశం కూడా వుంది. అది ఇప్పట్లో తేలేలా లేదు. ఆ విషయం కేంద్రానికీ తెలుసు. హైకోర్టు ద్వారా రాష్ట్ర ప్రభుత్వం న్యాయ రాజధాని విషయమై సానుకూల స్పష్టత తెచ్చుకుంటే, దాన్ని పరిశీలిస్తామని కేంద్రం తేల్చి చెప్పేసింది. సో, కేంద్రం చేతులు దులిపేసుకున్నట్టే. ఇక, ఇప్పుడు న్యాయ రాజధానికి సంబంధించి వైసీపీ సర్కారు ఎలాంటి వ్యూహం అమలు చేస్తుందన్నది ప్రస్తుతానికి సస్పెన్స్.!