Gannavaram TDP MLA : వంశీకి చెక్ పెట్టేందుకు దేవినేని కుటుంబాన్ని బరిలోకి దింపే ఆలోచన టీడీపీ..? వచ్చే ఎన్నికలల్లో గన్నవరం నుంచి పోటీకి దిగేది అతడేనా.?
Gannavaram TDP MLA : గన్నవరం. ఇప్పుడు ఎక్కడ విన్నా ఈ పేరే మారుమొగుతోంది. టీడీపీ కార్యాలయంపై జరిగిన దాడితో మరోసారి వార్తల్లో నిలిచిందీ ప్రాంతం. ఎమ్మెల్యే వల్లభనేని వంశీ కనుసన్నాల్లోనే టీడీపీ కార్యాలయంపై దాడులు జరిగాయని టీడీపీ ఆరోపిస్తోన్న విషయం తెలిసిందే. వల్లభనేని వంశీ తెలుగు దేశం పార్టీ ని మోసం చేశాడంటూ విమర్శలు గుప్పిస్తున్నారు గన్నవరం తెలుగుదేశం అభిమానులు .. ఇదిలా ఉంటే వచ్చే ఎన్నికల్లో వంశీ గన్నవరం నుంచి వైసీపీ తరపున పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారు. తానే వైసీపీ తరపున గన్నవరం నుంచి బరిలో ఉంటానని ఆయన ఇప్పటికే ప్రకటించారు కూడా. అటు వైపు వల్లభనేని వంశీ నిలబడితే ఇటు వైపు ఖచ్చితంగా స్ట్రాంగ్ లీడర్ ఉండి తీరాలి. లేకపోతే తెలుగుదేశం కి ఇక్కడ ఉన్న ఓటు బ్యాంకు మొత్తం గండి పడే ప్రమాదం ఉంది.
మొన్న జరిగిన సంఘటన తరవాత గన్నవరం శ్రేణులు ఈ ప్రాంతం లో ఒక బలమైన నాయకుడిని కోరుకుంటున్నారు. ప్రస్తుతం గన్నవరం టీడీపీ ఇంఛార్జ్‌గా ఉన్న ఆ పార్టీ నేత బచ్చుల అర్జునుడు అనారోగ్యం బారిన పడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ తరుణంలో గన్నవరంలో వంశీకి ఎలాగైనా చెక్ పెట్టాలనే ఉద్దేశంతో ఉన్న టీడీపీ అధిష్టానం దేవినేని కుటుంబానికి చెందిన యువ నాయకుడిని బరిలోకి దింపేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. రాజకీయ వర్గాల్లో జరుగుతోన్న చర్చ ఆధారంగా ప్రస్తుతం విజయవాడ టీడీపీలో కీలకంగా ఉన్న దేవినేని చంద్రశేఖర్(చందు)ను గన్నవరం నుంచి బరిలోకి దించేందుకు టీడీపీ అధిష్టానం కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. ఇందుకు కారణం లేక పోలేదు.. దేవినేని చందును గన్నవరం నుంచి బరిలోకి దింపడం వెనకాల టీడీపీ అధిష్టానానికి ఓ స్పష్టత ఉన్నట్లు సమాచారం.
ప్రస్తుతం చందు తెలుగు యువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పార్టీకి సేవలందిస్తున్నారు. 2012లో టీడీపీలో చేరిన చందు పార్టీలో క్రియాశీలక పాత్ర పోషిస్తూ వస్తున్నారు. ఆయన సేవలను గుర్తించిన పార్టీ అధిష్టానం తొలుత విజయవాడ అర్బన్ తెలుగు యువత అధ్యక్షుడిగా, ఆ తర్వాత ఉమ్మడి కృష్ణాజిల్లా తెలుగు యువత అధ్యక్షుడిగా నియమించారు. ఆ తర్వాత తెలుగు యువత రాష్ట్ర కమిటీ ప్రధాన కార్యదర్శిగా కీలక బాధ్యతలు అప్పగించారు. ఇక తాజాగా గన్నవరంలో ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలని ఫిక్స్ అయినట్లు సమాచారం. ఈసారి 40 శాతం మంది యువతకే సీట్లు అని చంద్రబాబు పలుసార్లు చేసిన ప్రకటన కూడా గన్నవరం సీటు దేవినేని చందుకే అనే వార్తలకు బలం చేకూరుస్తున్నాయి. మరి ఈసారి గన్నవరం బరిలో దేవినేని చందు దిగనున్నారో లేదో తెలియాలంటే చంద్రబాబు అధికారికంగా ప్రకటించే వరకు వేచి చూడాల్సిందే.