YS Jagan : ఆ మూడు జిల్లాల్లో వైసీపీని దెబ్బతీసిన అంశమిదే..!
YS Jagan : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా నెల్లూరు కార్పొరేషన్‌తో పాటు 12 మున్సిపాలిటీల్లో వైసీపీ విజయం సాధించింది. ఈ విక్టరీ పట్ల సీఎం జగన్ హర్షం వ్యక్తం చేశారు. అయితే, ఆ మూడు జిల్లాల్లో మాత్రం అధికార వైసీపీకి దెబ్బ తగిలినట్టే కనబడుతున్నది. మున్సిపల్ ఎన్నికల ఫలితాల ద్వారా ఈ విషయం స్పష్టమైంది. గతంతో పోలిస్తే ఇప్పుడు ఈ మూడు జిల్లాల్లో టీడీపీ పుంజుకున్నది. కాగా, అలా వైసీపీని దెబ్బతీసిన అంశమేమిటంటే..ప్రస్తుతం ప్రతిపక్ష పోషిస్తున్న టీడీపీ వచ్చే ఎన్నికల నాటికి అధికార పక్షంగా మారాలనుకుంది. ఈ క్రమంలోనే ఆ పార్టీ అధినేత చంద్రబాబు, భావినేత నారా లోకేశ్, నాయకులు, కార్యకర్తలు పార్టీ బలోపేతానికి కష్టపడుతున్నారు.
YS Jagan : గతంతో పోలిస్తే బాగా పుంజుకున్న టీడీపీ..
ఈ క్రమంలోనే మూడు రాజధానుల అంశాన్ని విమర్శిస్తూ అమరావతియే రాజధాని అని అంటున్నారు. అమరావతి రాజధాని అన్న విషయమై కట్టుబడి ఉన్నామని ఇప్పటికే చాలా సార్లు చంద్రబాబు ప్రకటన కూడా చేశాడు. ఈ నేపథ్యంలోనే గుంటూరు, కృష్ణ, ప్రకాశం జిల్లాల్లో టీడీపీ బలపడినట్లు కనబడుతున్నది. కృష్ణా జిల్లాలో జరిగిన మున్సిపల్ ఎలక్షన్స్‌లో టీడీపీ ఒక రకంగా గెలిచినట్లే అని చెప్పుకోవచ్చు. జగ్గయ్యపేటలో అధికార వైసీపీ ఎమ్మెల్యే ఉన్నప్పటికీ టీడీపీ చాలా గట్టి పోటీనిచ్చింది. కొండపల్లి మున్సిపాలిటీలోనూ టీడీపీ, వైసీపీ హోరాహోరీగా తలపడ్డాయి. మొత్తంగా కృష్ణా జిల్లాలో టీడీపీ బాగా పుంజుకుందని చెప్పడానికి ఆ పార్టీ గెలిచిన స్థానాలు చాలు.
గుంటూరు జిల్లాలోనూ అదే పరిస్థితులు కనబడుతున్నాయి. ప్రకాశం జిల్లాలోని దర్శి మున్సిపాలిటీని టీడీపీ కైవసం చేసుకోవడం గమనార్హం. మొత్తంగా మూడు రాజధానుల అంశం టీడీపీకి లాభం చేకూర్చిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. రాజకీయ పరిశీలకుల అభిప్రాయం ప్రకారం.. ఈ మూడు జిల్లాల్లో టీడీపీ ఇంకా బాగా పుంజుకునే చాన్సెస్ ఉన్నాయి. ఫలితంగా అధికార వైసీపీకి భవిష్యత్తులో గట్టి దెబ్బ తగిలే చాన్సెస్ ఉండొచ్చు. చూడాలి మరి.. ఈ మూడు జిల్లాల ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను సానుకూలతగా అధికార వైసీపీ ఎలా మార్చుకుంటుందో మరి..