AP Three Capitals : మూడు రాజధానులపై మళ్లీ కన్ఫ్యూజన్.. జగన్ అసలు ఏం చేయబోతున్నారు..?
AP Three Capitals : మూడు రాజధానుల విషయంపై సీఎం జగన్ మళ్లీ కన్ఫూజన్ క్రియేట్ చేశారు. రాజధానిగా అమరావతి ఉంటుందా? ఉండదా అనే అంశంపై కూడా క్లారిటీ ఇవ్వలేదు. విస్తృత విశాల ప్రయోజనాలను కాపాడేందుకే ఇంతకు ముందు తెచ్చిన మూడు రాజధానుల బిల్లును తాత్కాలికంగా ఉపసంహరించుకున్నట్టు జగన్ అసెంబ్లీలో ప్రకటించారు. మూడు రాజధానుల బిల్లు రద్దుకు కేబినెట్ ఆమోదం తెలపగా.. అసెంబ్లీలో దీనిపై జగన్ కీలక ప్రకటన చేస్తారని అంతా భావించారు. కానీ ఆయన దీనిపై ఏమీ చెప్పుకుండానే పూర్తి స్థాయిలో మరో బిల్లును తేనున్నట్టు ప్రకటించారు. మొదట అసెంబ్లీలో మూడు రాజధానుల ఉపసంహరణ బిల్లు చర్చకు రాగా, ఆర్ధిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ఆ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. దీంతో బిల్లుపై చర్చకు అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం అనుమతి మంజూరు చేశారు.
AP Three Capitals : అభివృద్ధి కోసమే ఈ బిల్లు..

YS jagan about on AP Three Capitals Issue
అసెంబ్లీలో సీఎం జగన్ మాట్లాడుతూ తమిళనాడు నుంచి ఏపీ విడిపోయాక.. రాజధానిగా కర్నూలు ఉండేది. గుంటూరులో హైకోర్టు నడిచేది. గుంటూరు అంటే తనకు ఎలాంటి వ్యతిరేకత లేదని.. తన ఇల్లు అక్కడే ఉందని జగన్ చెప్పారు. అమరావతి ప్రాంతం అటు విజయవాడ, గుంటూరుకు దగ్గరగా ఏమీ లేదని.. ఇక్కడ రోడ్లు, కరెంటు, డ్రైనేజీ వంటి కనీస సౌకర్యాల ఏర్పాటుకు లక్ష కోట్లు అయ్యాయని గత ప్రభుత్వం లెక్కలేసింది. ఈ రోజు లెక్కల ప్రకారం, ఇంకా పదేళ్లు దాటితే ఆ ఖర్చు 6 లక్షల కోట్లో 7 లక్షల కోట్లు అవుతుందన్నారు జగన్. రాష్ట్రంలో 3 ప్రాంతాల అభివృద్ధి కోసమే విశాఖలో పరిపాలనా రాజధాని, అమరావతిలో శాసన రాజధాని, కర్నూలులో న్యాయ రాజధాని ఉండాలని తమ ప్రభుత్వం ఆలోచన చేసిందన్నారు.
మూడు రాజధానుల ప్రక్రియ వెంటనే ప్రారంభమై ఉంటే ఇప్పటికే మంచి ఫలితాలు కనిపించేవన్నారు.న్యాయపరమైన చిక్కులను కావాలనే సృష్టించారని ఆయన మండిపడ్డారు. శ్రీభాగ్ ఒప్పందం స్పూర్తితో పరిపాలనా వికేంద్రీకరణ బిల్లును తెచ్చామన్నారు.ప్రభుత్వం మంచి నిర్ణయాలు తీసుకుంటుదన్న కారణంగానే గడచిన రెండున్నరేళ్లలో జరిగిన అన్ని ఎన్నికల్లో తమ పార్టీ గెలిచిందన్నారు.