Ys Jagan : వైఎస్ జగన్ ముందు పిల్లి గంతులు ఎందుకు.. ఉద్యోగుల సమ్మె విరమణకు కారణం ఇదేనా?
Ys Jagan : ఆంధ్ర ప్రదేశ్ ఉద్యోగ సంఘాల నాయకులు తమ సమ్మె నిర్ణయాన్ని ఉపసంహరించుకున్నట్లు ప్రకటించారు. వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పై తీవ్రస్థాయి వ్యతిరేకత తో సమ్మెకు సిద్ధమన్న ఉద్యోగ సంఘాలు తమ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నట్లు అధికారికంగా ప్రకటించడం జరిగింది. రాష్ట్ర సచివాలయం లో చర్చలు జరిపిన అనంతరం ఉద్యోగులు ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన సలహాదారు సజ్జల రామకృష్ణ మరియు మంత్రుల కమిటీ తో ఉద్యోగ సంఘాలు నిర్వహించిన చర్చలు సఫలం అయినట్లు గా ప్రకటించారు. గత కొన్ని రోజులుగా వివాదంగా మారిన కొన్ని విషయాల పట్ల ప్రభుత్వం ఒక మెట్టు దిగి రాగా ఉద్యోగ సంఘాల నాయకులు కూడా కాస్త వెనక్కి తగ్గినట్లుగా తెలుస్తోంది.విశ్లేషకులు చెబుతున్న దాని ప్రకారం ప్రభుత్వం కంటే ఉద్యోగ సంఘాలు కాస్త ఎక్కువగానే తగ్గినట్లుగా అనిపిస్తుంది.
జగన్ ప్రభుత్వం కు భయపడి ఉద్యోగ సంఘాల నాయకులు తగ్గి ఉంటారు అంటూ కూడా గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ సమయంలో ఉద్యోగ సంఘాల పై ప్రభుత్వం ఎస్మా చట్టాన్ని కూడా ప్రకటించింది. ఇప్పటికే కొన్ని విభాగాల్లో ఆ చట్టంను ప్రయోగించేందుకు సిద్ధమైంది. అందుకే ఉద్యోగులు ఈ నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తోంది. అసలే సీఎం జగన్మోహన్ రెడ్డి చాలా పట్టుదల కలిగిన వ్యక్తి.. కనుక ఆయనకు పోటీగా వెళ్లి విషయాన్ని మరింత సీరియస్ గా చేయడం ఎందుకు అన్నట్లుగా ఉద్యోగులు భావించి ఉంటారు.ఈ విషయాన్ని మరింత ముందుకు తీసుకు వెళ్లడం సబబు కాదని ఉద్యోగ సంఘాల నాయకులు భావించినట్లు తెలుస్తోంది. అనుకున్నది రాకున్నా వచ్చిన దానితో సంతృప్తి చెంది సమ్మెను విరమించుకోవాలని భావించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే సమ్మె వల్ల ప్రజలు ఇబ్బంది పడుతున్నారు.
పూర్తిస్థాయిలో సమ్మె చేస్తే ఇంకా ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది అనే ఉద్దేశంతో కూడా ఉద్యోగ సంఘాల నాయకులు మరియు ఉద్యోగులు ఈ నిర్ణయానికి వచ్చినట్లుగా చెబుతున్నారు. ఉద్యమం తో ఉద్యోగులు సాధించింది ఏమిటి అంటే క్లారిటీ లేదు. సాధారణ ఉద్యోగుల నుండి ఉన్నత స్థాయి ఉద్యోగుల వరకు ఈ పరిస్థితుల్లో సమ్మెను విరమించుకోవడం మంచిది అనే నిర్ణయాన్ని వ్యక్తం చేశారట. సమ్మె విరమించినప్పటికీ సీఎం జగన్మోహన్ రెడ్డి పై మాత్రం ఉద్యోగుల్లో కోపం ఉన్నట్లుగా గుసగుసలు వినిపిస్తునాయి. ఆ కోపం వచ్చే ఎన్నికల్లో చూపించే అవకాశాలు కూడా లేకపోలేదంటున్నారు. గతంలో చంద్రబాబు నాయుడు పై ఉన్న కోపాన్ని ఎన్నికల సమయంలో చూపించి ఆయన్ని అధికారం నుంచి తప్పించారు అనే ప్రచారం జరిగింది… మరి జగన్ పై కూడా అలాంటి కోపాన్ని చూపిస్తారా అనేది రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.