Ys Jagan : పొత్తుల పంచాయితీ.. గేమ్ ఎంజాయ్ చేస్తున్న వైఎస్ జగన్.!
Ys Jagan : జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏ ముహూర్తాన ‘వైసీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వను..’ అన్నారో, అప్పుడే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేతికి నిఖార్సయిన ఆయుధం దొరికింది. చంద్రబాబు దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్.. అంటూ వైఎస్ జగన్ విమర్శలు చేయడం షురూ చేశారంటే, దాని వెనుక పెద్ద గేమ్ ప్లాన్ వుండి వుండాలి. ఆ గేమ్ ప్లాన్ వర్కవుట్ అయ్యిందన్న ఆనందంలో వైఎస్ జగన్ ఇప్పుడు వుండి వుండాలి.! ఔను, అదే నిజం. రాష్ట్రంలో నిజానికి చాలా సమస్యలున్నాయి. ఆ సమస్యల్ని విపక్షాలు క్యాష్ చేసుకోవాలి. కానీ, వాటిపై పోరాడేంత తీరిక విపక్షాలకు లేకుండా పోయింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆ మధ్య కౌలు రైతు భరోసా యాత్ర చేపట్టారు. అదిప్పుడేమయ్యిందో ఎవరికీ తెలియదు.
టీడీపీ అధినేత చంద్రబాబు కూడా ఏదో పేరు పెట్టుకుని జనంలోకి వెళ్ళారు. ఆయనా సైలెంటయిపోయారు. బీజేపీ సంగతి సరే సరి. టీడీపీ, జనసేన, బీజేపీ.. ‘ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరు.?’ అన్న కోణంలో కొట్టుకుంటున్నాయి. ‘జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ని బీజేపీ, జనసేన ఉమ్మడి ముఖ్యమంత్రి అభ్యర్థిగా బీజేపీ ప్రకటించాలి..’ అనే డిమాండ్‌తో జనసైనికులు, జనసేన నేతలు బిజీగా వున్నారు. ‘ముఖ్యమంత్రి పదవి మాకే సొంతం..’ అంటూ టీడీపీ యాగీ చేస్తోంది. ‘మా పార్టీలో ముఖ్యమంత్రి అవగల అర్హత వున్న నాయకులు చాలామందే వున్నారు..’ అంటూ బీజేపీ చెబుతోంది.
ఆలూ లేదు, చూలూ లేదు కొడుకు పేరు సోమలింగమన్నట్టు.. అసలు ఎన్నికలు ఎప్పుడొస్తాయో తెలియదు.. కానీ, 2024 కంటే ముందే.. అంటే, రేపో మాపో ఎన్నికలొచ్చేస్తాయన్నట్టు ముఖ్యమంత్రి పదవి విషయమై పంచాయితీ పెట్టుకున్నాయి విపక్షాలు. బీజేపీ నేత సత్యకుమార్ అన్నట్టు, వైసీపీ ట్రాప్‌లో జనసేనాని పడ్డారు. చిత్రంగా అదే జనసేన ట్రాప్‌లో బీజేపీ పడింది. బీజేపీ, జనసేన ట్రాప్‌లో చంద్రబాబూ పడిపోయారు. రాజకీయం అంటే ఇలాగే వుంటుంది. కానీ, వైఎస్ జగన్ వ్యూహం మాత్రం అదుర్స్ అంతే.