Ys Jagan : వాళ్ళకి కడుపు మంట పెంచుతోన్న వైఎస్ జగన్ సంక్షేమం
Ys Jagan : రాజధాని కోసం కేంద్రం సాయం చేయడంలేదు.. జాతీయ ప్రాజెక్టు అయిన పోలవరం ప్రాజెక్టుకి సైతం కేంద్రం కొర్రీలు పెడుతోంది. స్టీలు ప్లాంటు ఇవ్వడంలేదు, దుగరాజపట్నం పోర్టు కూడా సాధ్యం కాదంటోంది.. చెప్పుకుంటూ పోతే, కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సినవేవీ రావడంలేదు.
చంద్రబాబు హయాంలో ఏమన్నా గొప్పగా వుందా.? అంటే, అప్పుడూ లేదు. కానీ, అప్పట్లో టీడీపీ అనుకూల మీడియా, చంద్రబాబునీ అలాగే నరేంద్ర మోడీనీ భుజాన వేసుకుని తిరిగింది.
ఇప్పుడేమో, అదే మీడియా తప్పంతా వైఎస్ జగన్ మోహన్ రెడ్డిదేనని అంటోంది. నిజమే, వైఎస్ జగన్.. గట్టిగా కేంద్రాన్ని ప్రశ్నించలేకపోతున్నారు. కేంద్రాన్ని గట్టిగా నిలదీస్తే, రాష్ట్రం అదనపు అప్పులు చేయడానికి ఆస్కారం వుండదు. అప్పులు చేయకపోతే, రాష్ట్రం ముందుకు నడవదు. పెద్ద సంకటమే ఇది. ఏ రాష్ట్రానికీ ఇలాంటి దుస్థితి రాకూడదు. ఉమ్మడి తెలుగు రాష్ట్రం విడిపోయాక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పెద్ద కష్టమే వచ్చింది. విభజన కష్టం ఓ యెత్తు.. కేంద్రం, రాష్ట్రాన్ని పట్టించుకోకపోవడం మరో యెత్తు..
చంద్రబాబు హయాంలో నడిచిన పబ్లిసిటీ స్టంట్లు ఇంకో యెత్తు. ఇన్ని సమస్యల నడుమ, ముళ్ళ కిరీటాన్ని వైఎస్ జగన్ తన నెత్తిన పెట్టుకున్నారు. సంక్షేమం లేకపోతే, రాష్ట్రంలో పరిస్థితులు వేరేలా వుంటాయి. కానీ, పులి మీద స్వారి కూడా అంత తేలిక కాదు వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి అయినా. విపక్షాలు సహకరిస్తే, మీడియా నుంచి పోటు తక్కువగా వుంటే, కేంద్రాన్ని నిలదీయడానికి తగినంత శక్తి దొరుకుతుంది వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి. కానీ, ఆ సహకారం దొరకడంలేదాయె. దాంతో, వైఎస్ జగన్ ముందు ఇంకో ఆప్షన్ లేకుండా పోయింది.