YS Sharmila : వైఎస్ షర్మిల అరెస్ట్.. స్పృహతప్పి పడిపోయిన షర్మిల?
YS Sharmila : తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని.. ప్రస్తుతం ఖాళీగా ఉన్న సుమారు 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రభుత్వం వెంటనే నోటిఫికేషన్ విడుదల చేయాలని వైఎస్ షర్మిల ఇవాళ ఇందిరా పార్క్ వద్ద ఉన్న ధర్నాచౌక్ లో నిరాహార దీక్ష చేపట్టిన విషయం తెలిసిందే. నిజానికి తను మూడు రోజుల పాటు అక్కడ నిరాహార దీక్ష చేయాలని భావించారు. కానీ… తనకు ఒక రోజు మాత్రమే దీక్షకు అనుమతి ఇచ్చారు పోలీసులు. ఉదయం నుంచి సాయంత్రం వరకు తను నిరాహార దీక్షలో పాల్గొన్నారు. తనకు పలువురు మద్దతు పలికారు. పలు ప్రజాసంఘాలు, కొన్ని పార్టీలు, పాత్రికేయులు, రచయితలు, వైఎస్సార్ అభిమానులు, నిరుద్యోగ యువత తన వెంట నడిచారు. తనతో పాటు దీక్షలో పాల్గొన్నారు.
ఉదయం నుంచి ప్రశాంతంగా కొనసాగిన దీక్ష… సాయంత్రానికి ఉద్రిక్తంగా మారింది. తనకు ఇచ్చిన అనుమతి గడవు ముగిసిందని… దీక్షను విరమించాలంటూ పోలీసులు షర్మిలను కోరారు. దీంతో షర్మిల మాత్రం తాను మూడు రోజులు దీక్ష చేస్తానని పట్టుబట్టారు. దీంతో పోలీసులు మాత్రం షర్మిల దీక్ష విరమించాలంటూ రిక్వెస్ట్ చేశారు. అక్కడి నుంచి వెళ్లిపోవాలని.. లేకుంటే శాంతిభద్రతల సమస్య వస్తుందని పోలీసులు తనను కోరడంతో.. ఇందిరా పార్క్ నుంచి లోటస్ పాండ్ వరకు షర్మిల పాదయాత్ర చేయడానికి పూనుకున్నారు.
YS Sharmila : అడుగడుగునా షర్మిల పాదయాత్రను అడ్డుకున్న పోలీసులు
కనీసం పాదయాత్ర ద్వారా అయినా తను లోటస్ పాండ్ వరకు వెళ్లాలనుకుంటే… తనను పోలీసులు అడుగడుగునా అడ్డుకున్నారు. తెలుగు తల్లి ఫ్లైఓవర్ మీద షర్మిల వెంట నడుస్తున్న తన మద్దతుదారులకు, పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది. అందరూ ఒకరి మీద మరొకరు పడ్డారు. తోపులాటలో షర్మిల మీద పడటంతో ఆమె స్పృహ తప్పి పడిపోయారు. వెంటనే షర్మిలను లేపి తనను అరెస్ట్ చేసి అక్కడి నుంచి తరలించారు. షర్మిలను బేగంపేట మహిళా పోలీస్ స్టేషన్ కు పోలీసులు తరలించారు.