YS Sharmila : బ్లైండ్ గా పవన్ కళ్యాణ్ ను ఫాలో అవుతున్న వైఎస్ షర్మిల..?
YS Sharmila హుజరాబాద్ ఉప ఎన్నిక నేపథ్యంలో వైయస్సార్ టీపీ పోటీ చేస్తుందా అనే విషయంపై ఆసక్తికర ప్రకటన చేశారు షర్మిల. హుజురాబాద్ ఎన్నిక వల్ల ఉపయోగం ఉందా అని ప్రశ్నించిన వైఎస్ షర్మిల, హుజురాబాద్ ఉప ఎన్నికలో తాము పోటీ చేసేది లేదని స్పష్టం చేశారు. హుజురాబాద్ ఎన్నికల వల్ల నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయా? దళితులకు 3 ఎకరాల భూమి వస్తుందా ? ఇవన్నీ చేస్తామని చెబితే అప్పుడు మేం కూడా పోటీ చేస్తామంటూ షర్మిల పేర్కొన్నారు. అంతేకాదు హుజురాబాద్ ఉప ఎన్నిక పగ, ప్రతీకారం కోసం మాత్రమేనని తేల్చిచెప్పారు. అందుకే ఈ ఎన్నికల్లో వైయస్సార్ టీపీ పోటీ చేయదని వైయస్ షర్మిల స్పష్టం చేశారు. ఇప్పటికే నిరుద్యోగులకు ఉద్యోగాల కోసం సీఎం కేసీఆర్ ను టార్గెట్ చేసిన షర్మిల, తెలంగాణలో కొత్త పార్టీ పెట్టే అవసరం ఏముందని వస్తున్న విమర్శలకు కూడా సమాధానం చెబుతున్నారు.
హుజూరాబాద్ పై యూటర్న్.. YS Sharmila
హుజూరాబాద్ ఉప ఎన్నికలను బాయ్ కాట్ చేయడం వైఎస్ షర్మిల పార్టీపై వ్యతిరేక ప్రభావాన్ని చూపిస్తుందని అంటున్నారు. అధికార టీఆర్ఎస్, ప్రతిపక్ష కాంగ్రెస్, బీజేపీలకు సమ దూరం పాటిస్తున్నారు వైఎస్ షర్మిల. నాలుగో ప్రత్యామ్నాయంగా తన సత్తా చూపిస్తానంటున్నారు. ఈ దశలో కనీసం వైఎస్సార్టీపీకి తెలంగాణలో ఎంత పట్టు ఉందో తెలుసుకోడానికి హుజూరాబాద్ ఉపఎన్నిక బరిలో షర్మిల ఎంట్రీ ఇచ్చి ఉంటే బాగుండేదనే వాదన మొదలైంది. పోటీకి దిగితే.. విజయం వరించకపోయినా, ఇంకోసారైనా షర్మిలకు తెలంగాణ ప్రజలు అవకాశం ఇస్తారు. పవన్ మార్క్ రాజకీయం చేస్తామంటూ ఎన్నికలను వదిలేసుకుంటూ పోతే మాత్రం మొదటికే మోసం వస్తుందని టాక్ వినిపిస్తోంది. నిరుద్యోగ సమస్యలపై ధ్వజమెత్తి, నిరాహార దీక్షలతో జనంలో ఐడెంటిటీ కోసం ప్రయత్నిస్తున్న షర్మిల ఎన్నికల రణరంగంలో దిగేందుకు మాత్రం వెనకడుగేశారు. రాజకీయాల్లోకి రావడంతోనే అందివచ్చిన ఓ ఉప ఎన్నికను స్కిప్ చేశారు షర్మిల.
జనసేన తరహాలో.. YS Sharmila
ఈ లాజిక్ అయితే బాగానే ఉంది కానీ.. ఇప్పుడు చాలామంది.. షర్మిల పార్టీని, పవన్ స్థాపించిన జనసేనతో పోల్చడం మొదలుపెట్టారు. ఏడేళ్ల క్రితం జనసేన ప్రస్థానం మొదలైనా.. ఇప్పటికీ ఆ పార్టీకి కనీసం ఓ ఎమ్మెల్యే కూడా లేరు. పొరపాటున ఓ ఎమ్మెల్యే గెలిచినా అతడిని కూడా నిలుపుకోలేని పరిస్థితి జనసేనానిది. అయితే ఈ ప్రస్థానానికి జనసేన రాజకీయ వ్యూహాలే కారణం. పార్టీ పెట్టిన తొలిసారి వచ్చిన ఎన్నికల్లో టీడీపీ-బీజేపీకి మద్దతిచ్చి తాను సైలెంట్ అయ్యారు జనసేనాని.
కనీసం తాను సపోర్ట్ చేసిన పార్టీలు అధికారంలోకి వచ్చినా మొహమాటానికిపోయి ఒక్క నామినేటెడ్ పోస్ట్ కూడా తీసుకోలేదు. ఇక రెండోసారి వచ్చిన ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసి బోల్తా పడ్డారు పవన్. ఆ తర్వాత తెలంగాణలో ఉప ఎన్నికలు, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా బీజేపీకే మద్దతిచ్చారు. ప్రతి ఉపఎన్నికనూ స్కిప్ చేసుకుంటూ వెళ్లేసరికి చివరికి పార్టీకి గుర్తు కూడా సమస్యగా మారిపోయింది. తిరుపతి బైపోల్ లో జనసేన గాజుగ్లాసు గుర్తుని ఓ స్వతంత్ర అభ్యర్థికి కేటాయించారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు షర్మిల కూడా అదే రూటు ఎంచుకుంటే తెలంగాణలో రాజకీయ మనుగడ కష్టమేనంటున్నారు విశ్లేషకులు.