YS Sharmila : తెలంగాణ రాజకీయాలు వంటపట్టించుకున్న షర్మిల.. ఏకంగా కేసీఆర్ పైకే బాణాన్ని వదిలిందిగా?
YS Sharmila : తెలంగాణలో కొత్త పార్టీ పెట్టబోతున్న వైఎస్ షర్మిల ఇప్పుడిప్పుడే అధికార పార్టీపై, ప్రభుత్వంపై, ఇతర పార్టీలపై విమర్శలు చేయడం ప్రారంభించారు. నిజానికి రాజకీయాలు అంటేనే ఇవి కదా. తనకు తెలంగాణ రాజకీయాలు వంట పట్టాయి. అందుకే.. దూకుడును పెంచారు. త్వరలోనే తెలంగాణలో పార్టీ పేరు, పార్టీ విధి విధానాలను ప్రకటించనున్న షర్మిల ఇప్పటి నుంచే అన్నింటికీ సమాయత్తమవుతున్నారు.
అయితే.. ఇవాళ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా షర్మిల.. హైదరాబాద్ లోని లోటస్ పాండ్ లో వేడుకలను నిర్వహించారు. ఈసందర్భంగా ఆమె ప్రసంగిస్తూ.. మహిళా సాధికరత గురించి మాట్లాడారు.
తెలంగాణలో మహిళల కోసం, మహిళల ప్రాతినిథ్యం కోసం ప్రభుత్వం ఏపాటి కృషి చేస్తోందో అందరికీ తెలుసంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు.
YS Sharmila : తెలంగాణ గడ్డ అంటేనే రాజకీయ చైతన్యానికి అడ్డా..
తెలంగాణ గడ్డ అంటేనే రాజకీయ చైతన్యానికి అడ్డా. ఇక్కడ మహిళలు ఎవ్వరికీ తక్కువ కాదు. కాకతీయలు గడ్డను ఏలిన రాణీ రుద్రమదేవి గురించి అందరికీ తెలుసు. తన చరిత్రను అందరం చదివాం. ఉద్యమాల్లో మహిళల పాత్ర చాలా కీలకం. కానీ.. తెలంగాణలో ప్రస్తుతం స్త్రీల ప్రాతినిథ్యం ఎక్కడుంది. అసమానతలను గెలిచిన రాష్ట్రంలో ఎన్నో అసమానతలు ఉన్నాయి. ఎన్నో ఏళ్ల పోరాటం తర్వాత తెలంగాణ రాష్ట్రం వచ్చింది. పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో మహిళలకు తీవ్ర అన్యాయం జరుగుతోంది. అధికార పార్టీ మహిళలకు తీవ్ర అన్యాయం చేసింది. చేస్తోంది.. మహిళలకు న్యాయం చేయడంలో అధికార పార్టీ ఘోరంగా విఫలం అయింది.. అని వైఎస్ షర్మిల విమర్శించారు.
YS Sharmila : వైఎస్సార్ హయాంలో మహిళలకు పెద్దపీఠ వేశారు
అలాగే.. వైఎస్సార్ హయాంలో మహిళలకు ఇచ్చిన పదవులపై కూడా షర్మిల మాట్లాడారు. వైఎస్సార్ హయాంలో చాలామంది మహిళలకు మంత్రి పదవులు వచ్చాయని.. కానీ సొంతంగా పోరాటి తెచ్చుకున్న రాష్ట్రంలో మాత్రం మహిళలకు పదవులు దక్కలేదని.. కేవలం ఇద్దరికే అది కూడా ఇటీవలి కాలంలో పదవులు దక్కాయని షర్మిల స్పష్టం చేశారు.
ఒక్క చట్ట సభల్లోనే కాదు.. ఉద్యోగాల్లో కూడా మహిళలకు తీవ్ర అన్యాయం జరుగుతోంది. అందుకే మహిళల కోసం, వాళ్ల హక్కుల కోసం నేను నిలబడతా. ఇప్పటి నుంచి నేను చేసే ప్రతి పనిలో మహిళలకు ఖచ్చితంగా ప్రాధాన్యం ఉంటుంది.. ప్రాతినిథ్యం ఉంటుంది.. మీ అందరి చెల్లిగా, అక్కగా నేను మాటిస్తున్నా.. అంటూ షర్మిల హామీ ఇచ్చారు.