Nagarjuna Sagar By Elections : సాగర్ లో వైకాపా పోటీ.. ప్రయోజనం ఎవరికి…?
Nagarjuna Sagar By Elections : నాగార్జున సాగర్ ఉప ఎన్నికకు రంగం సిద్దం అయ్యింది. ఇప్పటికే నామినేషన్ లు పెద్ద ఎత్తున దాఖలు అయ్యాయి. ఈ సమయంలో ఏపీ అధికార పార్టీ వైకాపా తరపున కూడా సాగర్ లో నామినేషన్ దాఖలు అవ్వడం చర్చనీయాంశంగా మారింది. వైకాపా గత కొంత కాలంగా తెలంగాణలో పోటీ చేయకుండా టీఆర్ఎస్ పార్టీకి మద్దతు తెలుపుతూ వస్తోంది. కేసీఆర్ మరియు వైఎస్ జగన్ మోహన్ రెడ్డిల మద్య ఉన్న స్నేహం కారణంగా ఇన్నాళ్లు వైకాపా పోటీ చేయలేదు అనేది అందరికి తెల్సిన విషయమే. కాని ఇటీవల వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల కారణంగా సాగర్ లో వైకాపా పోటీ చేస్తుందని గెలుపు కోసం తీవ్రంగా ప్రయత్నాలు చేస్తుంది అంటూ ఆ పార్టీ నాయకులు చెబుతున్నారు.
కాంగ్రెస్‌కు నష్టం..
కేసీఆర్ అండ్ టీమ్ ఎట్టి పరిస్థితుల్లో నాగార్జున సాగర్ లో గెలవాలని భావిస్తున్నారు. ఇప్పటికే దుబ్బాకలో సిట్టింగ్ స్థానం కోల్పోయిన అధికార టీఆర్ఎస్ పార్టీ సాగర్ లో లైఫ్ అండ్ డెత్ అంటూ పోరాడాలంటూ కేసీఆర్ ఆదేశించారు. అందుబాటులో ఉన్న అన్ని వనరులను కూడా కేసీఆర్ వినియోగించుకునేందుకు సిద్దం అవుతున్నట్లుగా తెలుస్తోంది. సాగర్ లో జానారెడ్డి గెలుపుపై చాలా ధీమాగా ఉన్నారు. కాంగ్రెస్ ఓట్లను చీల్చడం ద్వారా ఆయన గెలుపును అడ్డుకోవచ్చు అంటూ రాజకీయ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. నాగార్జున సాగర్ లో ఉన్న కాంగ్రెస్ ఓట్లు వైకాపా పోటీ చేస్తే ఖచ్చితంగా చీలే అవకాశం ఉంటుంది. అందుకే ఈ ప్లాన్ చేసినట్లుగా చెబుతున్నారు.
బీజేపీకి కూడా ఇబ్బందే..
కేసీఆర్ కు వ్యతిరేకం అన్నట్లుగా వైకాపా అభ్యర్థి ప్రచారం చేసుకుంటున్నారు. కనుక ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఖచ్చితంగా చీలిపోయే అవకాశం ఉంది. కేసీఆర్ తీరు నచ్చని వారు బీజేపీకి ఓటు వేయాలని అనుకున్నా జగన్ పై ఉన్న అభిమానంతో కొందరు అటుగా ఓటు వేసే అవకాశం ఉంటుంది. తద్వారా బీజేపీకి కూడా నష్టం తప్పదని అంటున్నారు. కేసీఆర్ కు ఇది కలిసి వచ్చే అంశం అంటున్నారు. రాజకీయ విశ్లేషకుల అంచనా ప్రకారం కేసీఆర్ వ్యూహాత్మకంగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో మాట్లాడి ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది.