Janasena : బీజేపీతో తెగదెంపులకు జనసేన సిద్దమైందా..? అసలేమీ జరుగుతుంది..?
Janasena : 2019 ఎన్నికలు ముగిసిన తర్వాత జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎలాంటి ఆలస్యం చేయకుండా బీజేపీతో జతకట్టి కీలకమైన కూటమిగా ఏర్పడ్డాడు. వచ్చే ఎన్నికల దాక ఇద్దరి కలిసి ప్రయాణం చేయాలనీ అనుకున్నట్లు అనేక సందర్భాల్లో చెప్పాడు, కానీ రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్న పరిస్థితులను గమనిస్తే అతి త్వరలోనే బీజేపీ – జనసేన పొత్తు బంధం తెగిపోయేలా కనిపిస్తుంది.
Janasena : విశాఖ ఉక్కు.. జనసేనకు చిక్కు
రాష్ట్రంలో ఎలాంటి సమస్య తెర మీదకు వచ్చిన నేను ఉన్నాను అంటూ పవన్ కళ్యాణ్ ముందుకు వచ్చేవాడు. అలాంటిది విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరించాలనే కేంద్రం నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆందోళనలు తీవ్రస్థాయికి చేరుకున్న కానీ, దానిపై కనీసం ఒక్క మాట కూడా మాట్లాడలేని స్థితిలో ఉన్నాడు పవన్ కళ్యాణ్. కనీసం విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో తమ వైఖరిని కూడా స్పష్టం చేయలేదు. ఏపీలో బీజేపీతో పొత్తు పెట్టుకొని ముందుకు సాగుతున్న జనసేన పార్టీకి, బీజేపీతో పొత్తు లాభించకపోగా, పార్టీకి నష్టాన్ని తెచ్చిపెడుతోందన్న అభిప్రాయం ఈ సందర్భంగా వ్యక్తమవుతోంది.
ఢిల్లీ దాకా వెళ్లి కేంద్ర పెద్దలను విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరించవద్దని కోరిన పవన్ కళ్యాణ్ , వైఎస్ జగన్మోహన్ రెడ్డి కి తెలిసే ఇదంతా జరుగుతోందని ఆరోపించారు. ఇక ఆ తర్వాత నుంచి విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో ఒక్క ప్రకటన కూడా చేయలేదు.అందుకు కారణం జనసేన కు బీజేపీతో ఉన్న పొత్తేనని తెలుస్తోంది. మరోపక్క బిజెపి నేతలు సైతం కేంద్ర పెద్దల నిర్ణయంతో ఒకింత అసహనంతో ఉన్న పరిస్థితుల్లో, ఆంధ్రప్రదేశ్ లో బీజేపీతో పొత్తు పెట్టుకున్న జనసేన పార్టీ ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి కనిపిస్తుంది.
గతంలో అమరావతి రైతుల దగ్గరికి వెళ్ళినప్పుడు, కేంద్రంతో మాట్లాడి రాజధాని తరలింపు ఆపడానికి ప్రయత్నం చేస్తానని పవన్ కళ్యాణ్ వారికి హామీ ఇచ్చారు. ఆ తర్వాత కేంద్రానికి పవన్ కళ్యాణ్ విజ్ఞప్తి చేసినప్పటికీ, మూడు రాజధానులు విషయంలో తాము జోక్యం చేసుకోలేమని కేంద్ర తేల్చిచెప్పింది. అప్పుడే పవన్ కళ్యాణ్ మాట కేంద్ర పెద్దల వద్ద చెల్లలేదనేది చర్చ జరిగింది.
మరోవైపు బీజేపీ తీరుతో పవన్ కల్యాణ్ అంత సంతృప్తిగా లేరనే మాట వినిపిస్తోంది. పొత్తు ధర్మమంటూ లేకుండా సొంత ఎజెండాతో రాజకీయాలు చేసుకుంటుంటే ఇక పొత్తులు ఉంది ఏమి లాభం అనే కోణంలో పవన్ కళ్యాణ్ ఆలోచిస్తున్నట్లు తెలుస్తుంది. ఆ ఆలోచనలకూ ఒక రూపం వస్తే బీజేపీతో పొత్తు కు స్వస్తి చెప్పినట్లే అంటూ రాజకీయ నిపుణులు చెపుతున్న మాట.. బహుశా బీజేపీకి దూరం జరిగి, టీడీపీకి దగ్గరవుతాడేమో జనసేనాని..