Cold Wave : తెలుగు రాష్ట్రాలని వణికిస్తున్న చలి.. ఉక్కిరి బిక్కిరి అవుతున్న ప్రజలు
ప్రధానాంశాలు:
Cold Wave : తెలుగు రాష్ట్రాలని వణికిస్తున్న చలి.. ఉక్కిరి బిక్కిరి అవుతున్న ప్రజలు
Cold Wave : తెలుగు రాష్ట్రాల్లో చలి పంజా విసురుతోంది. వారం రోజుల నుంచి కనిష్ట స్థాయి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో 10 డిగ్రీల దిగువున ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇక రానున్న రోజుల్లో చలి తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందంటున్నారు వాతావరణ శాఖ అధికారులు. తెలంగాణలో రెండు రోజుల పాటు అక్కడక్కడ కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే తక్కువగా అంటే 2 డిగ్రీల సెల్సియస్ నుంచి 4 డిగ్రీల సెల్సియస్ వరకు మాత్రమే నమోదయ్యే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. విశాఖ ఉమ్మడి జిల్లాలో మన్యప్రాంతంలో పరిస్థితి తీవ్రంగా ఉంది. అరకు తో పాటు లంబసింగిలో కనిష్ట ఉష్ణోగ్రత మూడు డిగ్రీలకు పడిపోయింది. దీంతో గిరిజనులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు.
Cold Wave వణికిస్తున్న చలి..
విశాఖ జిల్లాకు సంబంధించి జి మాడుగుల మండలం కుంతలంలో కనిష్ట ఉష్ణోగ్రత 5.7° నమోదయింది..ఏజెన్సీ ప్రాంతంలో పగటి సమయం మొత్తం మంచు దుప్పట్లోనే ఉంటోంది. మధ్య భారత దేశం నుంచి వీస్తున్న అతి శీతల గాలుల ప్రభావంతో ఉత్తరాంధ్ర జిల్లాల్లో చలి పెరిగినట్టు వాతావరణ శాఖ చెబుతోంది. సోమవారం మన్యంలో పలు ప్రాంతాల్లో ప్రజలు చలికి ఇబ్బందులకు గురయ్యారు. ఈ ఏడాది తొలిసారి సోమవారం ఏజెన్సీలో సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. చలి తీవ్రతకు గిరిజనులు వణుకుతున్నారు. పగటి పూట కూడా వాహనాలను లైట్లు వేసుకుని ప్రయాణించాల్సి వస్తోంది. అల్పపీడనం ప్రభావంతో బుధవారం నుంచి చలి స్వల్పంగా తగ్గుతుందని వాతావరణ శాఖ తెలిపింది.
సాయంత్రం నాలుగు గంటల నుంచి మొదలవుతూన్న చలి… రాత్రి పూట భారీగా ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దట్టంగా పొగ మంచు అలముకుంటుంది. ఉదయం పది అయినా మంచు తెరలు వీడడం లేదు. పొగమంచుతో దట్టంగా కురుస్తున్నడంతో వాహనదారులకు అవస్థలు తప్పడం లేదు. పగటిపూట కూడా హెడ్ లైట్లు వేసుకుని వాహనదారుల ప్రయాణం చేయాల్సిన పరిస్థితి. చలికాలంలో వృద్ధులు, శ్వాస కోసం వ్యాధులతో ఇబ్బందులు పడేవారు చాలా జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. వ్యాధులతో బాధపడేవారు ఆరోగ్యంలో ఏమాత్రం తేడా కనిపించిన వెంటనే వైద్యులను ఆశ్రయించాలని చెబుతున్నారు.ఉదయం, రాత్రి చలి తీవ్రతను తట్టుకునేందుకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. రాత్రిళ్లు, తెల్లవారుజామున ఉన్ని దుస్తులు ధరించాలని, సరైన జాగ్రత్తలు తీసుకోకుండా అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని హెచ్చరిస్తున్నారు.