Band Melam Movie Review : బ్యాండ్ మేళం మూవీ రివ్యూ అండ్ రేటింగ్..!

 Authored By sudheer | The Telugu News | Updated on :26 March 2026,9:07 pm

ప్రధానాంశాలు:

  •  Band Melam Movie Review : బ్యాండ్ మేళం మూవీ రివ్యూ అండ్ రేటింగ్..!

Band Melam Movie Review : గతేడాది వచ్చిన ‘కోర్ట్’ సినిమాతో మంచి హిట్ అందుకుని ప్రేక్షకులను మెప్పించిన హర్ష్ రోషన్, శ్రీదేవి అప్పాల జంటగా నటించిన తాజా చిత్రం ‘బ్యాండ్ మేళం’. ప్రముఖ రచయిత కోన వెంకట్ నిర్మాణంలో తెరకెక్కిన ఈ సినిమాపై సహజంగానే అంచనాలు ఏర్పడ్డాయి. తెలంగాణ గ్రామీణ నేపథ్యంతో, బావామరదళ్ల ప్రేమకథగా శుక్రవారం మార్చి 26, 2026న థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుందో రివ్యూలో చూద్దాం.

Band Melam Movie Review : బ్యాండ్ మేళం మూవీ రివ్యూ అండ్ రేటింగ్..!

Band Melam Movie Review : బ్యాండ్ మేళం మూవీ రివ్యూ అండ్ రేటింగ్..!

నటీనటులు: హర్ష్ రోషన్, శ్రీదేవి అప్పాల, సాయికుమార్, గోపరాజు విజయ్, యోగిత తదితరులు

దర్శకత్వం: సతీష్ జవ్వాజి

సంగీతం: విజయ్ బుల్గానిన్

సినిమాటోగ్రఫీ: సతీష్ ముత్యాల

నిర్మాతలు: కావ్య, శ్రావ్య (కోనా ఫిల్మ్ కార్పోరేషన్, మ్యాంగో మాస్ మీడియా)

సమర్పణ: కోన వెంకట్

Band Melam Movie Review కథ ఏంటంటే

తెలంగాణలోని బ్రాహ్మణపల్లి గ్రామంలో యాదగిరి అలియాస్ గిరి (హర్ష్ రోషన్), రాజీ (శ్రీదేవి) బావామరదళ్లు. చిన్నప్పటి నుంచే కలిసి పెరిగిన వీరిద్దరికీ ఒకరంటే ఒకరికి ప్రాణం. గిరి తండ్రి సుందరయ్య (గోపరాజు విజయ్) దానధర్మాలు చేసి ఆస్తులన్నీ పోగొట్టుకుంటే, ఆయన అండతో పైకొచ్చిన రాజీ తండ్రి సాయన్న (సాయికుమార్) మాత్రం ఆ సాయాన్ని మరిచిపోయి గిరి కుటుంబాన్ని చిన్నచూపు చూస్తుంటాడు.

గిరి చదువు అబ్బక టెన్త్ ఫెయిల్ అయ్యి ఊర్లో స్నేహితులతో కలిసి ఓ ‘బ్యాండ్ మేళం’ ట్రూప్ నడుపుతూ, ఎప్పటికైనా గొప్ప మ్యూజిక్ డైరెక్టర్ కావాలని కలలు కంటాడు. రాజీ ఏమో బీటెక్ చదువుతూ సిటీకి వెళ్తుంది. అంతస్తుల అంతరం, మారిన పరిస్థితుల కారణంగా రాజీ.. గిరికి దూరమవుతుంది. అంతలోనే సాయన్న తన కూతురికి వేరే పెళ్లి నిశ్చయిస్తాడు. కానీ రాజీ పెళ్లి మండపం నుంచి తన క్లాస్‌మేట్‌తో పారిపోతుంది. అసలు రాజీ ఎందుకు పారిపోయింది? ఆమె ఎదుర్కొన్న సమస్య ఏంటి? మ్యూజిక్ డైరెక్టర్ అవ్వాలనే గిరి కల నెరవేరిందా? చివరకు ఈ బావామరదళ్లు ఎలా ఒక్కటయ్యారు? అన్నదే మిగతా కథ.

Band Melam Movie Review విశ్లేషణ

బావామరదళ్ల ప్రేమకథ, అంతస్తుల అంతరాలు అనగానే మనకు టక్కున ‘ఉయ్యాలా జంపాలా’ లాంటి పాత సినిమాలు ఎన్నో గుర్తొస్తాయి. దర్శకుడు సతీష్ జవ్వాజి కూడా అచ్చం అలాంటి పాత రొటీన్ ఫార్ములానే ఎంచుకున్నాడు. ఫస్ట్ హాఫ్ అంతా బావామరదళ్ల మధ్య చిన్నపాటి గొడవలు, హీరో బ్యాండ్ గ్యాంగ్ చేసే అల్లరి, ఊళ్లో తిరగడం.. ఇలాంటి రొటీన్ సన్నివేశాలతోనే కాలక్షేపం అయిపోతుంది. కథలో ఎక్కడా ఎలాంటి ఫ్రెష్‌నెస్ కనిపించదు.

ఇంటర్వెల్ సమయానికి సినిమాపై ప్రేక్షకుడికి పూర్తి క్లారిటీ వచ్చేస్తుంది. ఇక సెకండాఫ్ అయితే సహనానికి అసలు సిసలైన పరీక్ష పెడుతుంది. హీరోయిన్ పారిపోవడం, ఆ తర్వాత వచ్చే డ్రామా ఏమాత్రం ఆసక్తికరంగా సాగదు. ఎమోషనల్ సీన్స్ ఏవీ మనసుకు హత్తుకోవు, బలవంతపు కామెడీ చిరాకు తెప్పిస్తుంది. దర్శకుడు తెలంగాణ నేటివిటీని వాడుకుని ట్రెండ్ క్యాష్ చేసుకోవాలని చూశారు తప్ప, ఆ ఆత్మను, స్వచ్ఛతను కథలో నిలపలేకపోయారు. లాజిక్స్ లేని సన్నివేశాలు, ఊహకందే క్లైమాక్స్‌తో సినిమాను ముగించారు.

Band Melam Movie Review నటీనటుల పనితీరు

హర్ష్ రోషన్: యాదగిరి పాత్రలో డ్యాన్సులు, ఎనర్జీ పరంగా బాగానే కష్టపడ్డాడు. కానీ చాలా సన్నివేశాల్లో అతని నటన ఓవర్‌గా (లౌడ్) అనిపిస్తుంది. ఎమోషనల్ సీన్స్‌లో ఇంకాస్త పరిణతి చెందాలి.

శ్రీదేవి అప్పాల: రాజీగా శ్రీదేవి సహజంగా నటించింది. ఫస్టాఫ్‌లో ఆకట్టుకున్నా, సెకండాఫ్‌లో ఆమె పాత్రకు పెద్దగా స్కోప్ లేదు. ఈ ఇద్దరి మధ్య కెమిస్ట్రీ బాగానే వర్కవుట్ అయింది.

మిగతా తారాగణం: సాయికుమార్ తన అనుభవంతో సాయన్న పాత్రకు పూర్తి న్యాయం చేయగా, గోపరాజు విజయ్ కామెడీ పంచ్‌లు అక్కడక్కడా నవ్విస్తాయి. హీరో ఫ్రెండ్స్ గ్యాంగ్ పర్వాలేదనిపిస్తుంది.

సాంకేతిక వర్గం

సాంకేతికంగా విజయం బుల్గానిన్ సంగీతం సినిమాకు పెద్ద ప్లస్. “తిప్పుకుంటున్నావే” లాంటి ఫోక్ సాంగ్ యూత్‌ను ఆకర్షిస్తుంది. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ పర్వాలేదు. సతీష్ ముత్యాల సినిమాటోగ్రఫీ పల్లెటూరి వాతావరణాన్ని కెమెరాలో అందంగా బంధించింది. ఎడిటింగ్ సినిమాకు ప్రధాన లోపం. సెకండాఫ్‌లో చాలా సీన్స్ కత్తిరించాల్సింది. నిర్మాణ విలువలు బాగున్నాయి. కానీ కోన వెంకట్ లాంటి సీనియర్ రచయిత అయి ఉండి కూడా, ఇంత పాత చింతకాయ పచ్చడి లాంటి కథను ఎలా ఓకే చేశారో అర్థం కాదు.

ఫైనల్‌గా

‘బ్యాండ్ మేళం’ ఎలాంటి కొత్తదనం లేని, సహనానికి పరీక్ష పెట్టే రొటీన్ విలేజ్ లవ్ స్టోరీ. లీడ్ పెయిర్ ఎనర్జీ, ఒకట్రెండు పాటలు మినహా ఇందులో ఆకట్టుకునే అంశాలు దాదాపు శూన్యం. బలహీనమైన కథ, సాగదీసిన కథనం వల్ల సినిమా పూర్తిగా నిరాశపరుస్తుంది. ఏదైనా కొత్త అనుభూతి ఆశించి థియేటర్‌కి వెళ్తే ఆడియన్స్‌కి ‘బ్యాండ్ బాజా బరాత్’ మోగినట్లే!

దితెలుగున్యూస్ రేటింగ్ : 2.0/5

sudheer

Ramanujam Sudheer Sr Journalist is experienced in Digital Media field. He worked in various Telugu media for about 10 years. lam worked as a Vaartha Daily Newspaper , 123telugu , Cineoutlook, Telugu Mirchi, TeluguMovies. com, Hashtagu, Mahaa News tv channel telugu As a News content writer, he wrote various articles on Human angle, Andhra pradesh And Telangana Local news live reporting, special stories. He is also expert in news analyzing, proof editing and best title editing. He is the present Conterwriter of thetelugunews.com website. Contact Details : Sudheer7606@gmail.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి