10th Class Diaries Review : 10th క్లాస్ డైరీస్ రివ్యూ.. నాటి రోజుల్లోకి తీసుకెళ్తుంది
10th Class Diaries Review లవర్ బాయ్ ఇమేజ్ చార్మింగ్ హీరోగా తెలుగు ప్రేక్షకుల్లో శ్రీరామ్ మంచి పేరు సంపాదించుకున్నాడు. ఒకరికి ఒకరు వంటి ఫీల్ గుడ్ లవ్ స్టోరీ తరువాత చాలా రోజులకు మళ్లీ ఓ ప్రేమ కథ చేశాడు. 10th క్లాస్ డైరీస్ అంటూ శ్రీరామ్, అవికా గోర్‌లు, నేడు (జూలై 1) ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అజయ్ మైసూర్ సమర్పణలో అచ్యుత రామారావు .పి, రవితేజ మన్యం నిర్మించిన ఈ చిత్రానికి గరుడవేగ అంజి దర్వకత్వం వహించారు. మరి ఈ చిత్రం ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించిందో ఓ సారి చూద్దాం.
కథ
సోమయాజి అలియాస్ సోము (శ్రీ రామ్) 1997లో టెన్త్ పాస్ అవుతాడు. సోముది రాజమండ్రిలోని భార్గవ్ విద్యానికేతన్. సోముకి హాఫ్ బాయిల్ రంజిత్ (శ్రీనివాస రెడ్డి), గౌరవ్(వెన్నెల రామారావు) అనే ఫ్రెండ్స్ ఉంటారు. ఇక సోముకి టెన్త్ క్లాస్‌లోనే చాందినీ అనే అమ్మాయితో ప్రేమ చిగురిస్తుంది. అయితే కొన్ని కారణాల విడిపోవాల్సి వస్తుంది. ఆ తరువాత సోము విదేశాలకు వెళ్లి బాగా స్థిరపడిపోతాడు. పెళ్లి చేసుకుంటాడు. అన్ని సుఖాలు అనుభవిస్తుంటాడు. కానీ వాటిలో తనకు సంతృప్తి దొరకదు. దీనికి కారణం చిన్నతనంలో తాను ప్రేమించిన చాందినీ అని తెలుసుకుంటాడు. చాందినినీ కలుసుకునేందుకు మళ్లీ ఇండియాకు వస్తాడు సోము.. ఆ తరువాత చాందినీ కోసం చేసిన ప్రయత్నాలేంటి? చివరకు చాందినీ దొరికింది? దొరికితే ఎలాంటి పరిస్థితుల్లో ఉంది? చివరకు చాందినీ సోములు ఏమయ్యారు? అనేదే కథ.
నటీనటులు
సోము పాత్రలో శ్రీరామ్ మెప్పించాడు.లవర్ బాయ్ తనకు అలవాటైన పాత్రను ఈజీగా చేసేశాడు. కానీ మునుపటిలా మాత్రం స్క్రీన్‌పై కనిపించలేదు. ఇక అవికా గోర్ పాత్ర పరిమితం అనిపిస్తుంది. ఆమె ఎప్పుడో ద్వితీయార్థంలో ఎంట్రీ ఇస్తుంది.క కానీ కనిపించినంత సేపు పర్వాలేదనిపించింది. ఈ చిత్రంలో నటించిన వారందిలోనూ ఓ నటుడు గురించి చెప్పుకోవాల్సిందే. సోము స్నేహితుడిగా గౌరవ్ పాత్రలో కనిపించిన వెన్నెల రామారావు అందిరినీ ఔరా అనిపిస్తాడు. తన కామెడీ టైమింగ్‌తో అదరగొట్టేశాడు. ఈ చిత్రానికి నిర్మాత కూడా ఆయనే. ఈ సినిమాతో ఆయన తనలోని నటుడుని బయటకు తీశాడు. అందరితో శభాష్ అనిపించుకునేలా ఉన్నాడు. ఇక శ్రీనివాస్ రెడ్డి, హిమజ, భాను శ్రీ, నాజర్, శివ బాలాజీ అందరూ కూడా తమ పరిధి మేరకు నటించారు.
చిన్నతనం, స్కూల్‌లో పుట్టే ప్రేమలు ఎంత స్వచ్చంగా ఉంటాయో మరోసారి చెప్పే ప్రయత్నం చేశాడు దర్శకుడు. ఇది నిర్మాత నిజ జీవితంలో జరిగిన సంఘటనల ఆధారంగా తెరకెక్కిన చిత్రమని అందరికీ తెలిసిందే.అయితే సినిమా లిబర్టీల్లో భాగంగా చాలానే మార్పులు చేర్పులు చేసినట్టున్నా.. అవన్నీ కూడా ప్రేక్షకుడి కోణంలోంచి బాగానే సెట్ అయినట్టు కనిపిస్తుంది. కామెడీ ట్రాక్ అద్భుతంగా వర్కవుట్ అయింది. శ్రీనివాస్ రెడ్డి, శ్రీరామ్, వెన్నెల రామారావు సినిమా ఆద్యంతం నవ్వించేశారు.
అయితే ఈ ప్రేమ కథలో శ్రీరామ్, అవికా గోర్ మధ్య ఉన్న ఘాడత ప్రేక్షకుడికి ఎక్కకపోవడం మాత్రమే కాస్త మైనస్. మిగతాదంతా ఓకే అనిపిస్తుంది. సోము, చాందినీల మధ్య ఇంకాస్త ఎమోషన్ పెట్టి ఉండాల్సింది. అయితే చిన్నతనంలో పుట్టే ప్రేమకు అంత కారణాలు కూడా అవసరం లేదేమోననిపిస్తుంది. మొత్తానికి ఆ వయసులో పుట్టిన ప్రేమ ఎలా ఉంటుంది.. ఎంతటి వరకు తీసుకెళ్తుంది.. చివరకు ఏం చేసిందనేది మాత్రం క్లైమాక్స్‌లో చూపించి అందరి గుండెను బరువెక్కేలా చేసేశాడు దర్శకుడు. ఈ విషయంలో మాత్రమే టీం అంతా సక్సెస్ అయినట్టే.
తెరపై విజువల్స్ మాత్రం అదిరిపోయాయి. అంజి తన కెమెరా పనితనం చూపెట్టాడు. సురేష్ బొబ్బలి పాటలు అలా ఫ్లోలో వచ్చి వెళ్తుంటాయి. నిర్మాణ విలువలు అద్భుతంగా ఉన్నాయి. సెకండాఫ్‌లోని సీన్లు, ప్రకృతిని బంధించిన తీరు అందరినీ ఆకట్టుకుంటాయి. తెరపై ఖర్చు పెట్టిన ప్రతీ రూపాయి కనిపిస్తుంది.
బాటమ్ లైన్ : 10th క్లాస్ డైరీస్.. కొన్ని అందమైన క్షణాలు