IT Develop in India : దేశ వ్యాప్తంగా ఈరోజు ఐటీ అభివృద్ధి చెందిందంటే దానికి కారణం రాజీవ్ గాంధే – రేవంత్
IT Develop in India : ఇంటిగ్రేటెడ్ సబ్-రిజిస్ట్రార్ కార్యాలయాల శంకుస్థాపన కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్ నగర భవిష్యత్ దిశ, అభివృద్ధి ప్రణాళికలపై కీలక వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ చారిత్రాత్మక మహానగరమని, కుతుబ్ షాహీ కాలం నుంచి ఇప్పటి వరకు ఎన్నో తరాల కృషి ఫలితంగానే ఈ నగరం అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిందని అన్నారు. దేశంలో ఐటీ రంగానికి రాజీవ్ గాంధీ పునాది వేశారని, హైటెక్ సిటీ నిర్మాణం అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వ దూరదృష్టి ఫలితమని గుర్తుచేశారు. నేడు హైటెక్ సిటీ హైదరాబాద్ గర్వకారణంగా నిలిచిందని పేర్కొన్నారు.
IT Develop in India
హైదరాబాద్ పోటీని ఇతర భారతీయ నగరాలతో పోల్చకూడదని సీఎం స్పష్టం చేశారు. బెంగళూరు, చెన్నైలతో కాదు, టోక్యో, న్యూయార్క్ లాంటి అంతర్జాతీయ మహానగరాలతో హైదరాబాద్ పోటీ పడే స్థాయిలో ఉందని తెలిపారు. ముఖ్యంగా ఓల్డ్ సిటీ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించనున్నట్టు చెప్పారు. మూసీ ప్రక్షాళన చేపట్టి, గోదావరి జలాలతో రివర్ ఫ్రంట్ నిర్మాణం చేసి పాతబస్తీకి పూర్వ వైభవం తీసుకొస్తామని హామీ ఇచ్చారు. అలాగే మధ్యతరగతి ప్రజలకు గృహ వసతి కల్పించేందుకు “రాజీవ్ స్వగృహ భవనాలు” నిర్మించాలని నిర్ణయించామని తెలిపారు.
రిజిస్ట్రేషన్ వ్యవహారాల్లో సమస్యలను శాశ్వతంగా పరిష్కరించేందుకు ఇంటిగ్రేటెడ్ సబ్-రిజిస్ట్రార్ కార్యాలయాలను ఆధునిక సౌకర్యాలతో ఏర్పాటు చేస్తున్నట్టు సీఎం ప్రకటించారు. ఫైవ్ స్టార్ హోటల్ స్థాయి సౌకర్యాలు కలిగిన ఈ కార్యాలయాలు ప్రభుత్వానికి రూపాయి ఖర్చు లేకుండా నిర్మించబడతాయని చెప్పారు. రాష్ట్ర అవతరణ దినోత్సవానికి 11 కార్యాలయాలు పూర్తి చేయాలని సూచించామని వెల్లడించారు. 2034 నాటికి ప్రపంచం హైదరాబాద్ వైపు చూస్తుందని విశ్వాసం వ్యక్తం చేసిన ఆయన, నగర అభివృద్ధిని అడ్డుకునే వారిని ప్రజలు గుర్తించాలని పిలుపునిచ్చారు.