Indiramma Houses Scheme : అర్హులందరికీ శుభవార్త .. ఇందిరమ్మ ఇళ్ల మంజూరుకు డేట్ ఫిక్స్.. ఎప్పటినుంచంటే..?

 Authored By suma | The Telugu News | Updated on :18 February 2026,4:00 pm

ప్రధానాంశాలు:

  •  Indiramma Houses Scheme : అర్హులందరికీ శుభవార్త .. ఇందిరమ్మ ఇళ్ల మంజూరుకు డేట్ ఫిక్స్.. ఎప్పటినుంచంటే..?

Indiramma Houses Scheme : రాష్ట్రంలోని గృహరహితులకు సొంతిల్లు కల్పించాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్న తెలంగాణ ప్రభుత్వం తాజాగా ఇందిరమ్మ ఇళ్ల పథకంపై ముఖ్యమైన నిర్ణయం తీసుకుంది. చాలా కాలంగా కొత్త ఇళ్ల కోసం ఎదురుచూస్తున్న వేలాది కుటుంబాలకు ఇది పెద్ద ఊరటగా మారింది. త్వరలోనే అర్హులైన లబ్ధిదారులకు కొత్త ఇళ్లను మంజూరు చేయనున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ విషయాన్ని రెవెన్యూ, గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అధికారికంగా వెల్లడించారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో నివసిస్తున్న అర్హులైన కుటుంబాలకు తొలి దశలో ఇళ్ల కేటాయింపు చేపట్టనున్నట్లు మంత్రి తెలిపారు. నగరంలోని మూడు కార్పొరేషన్ల పరిధిలో ఉన్న అర్హులందరికీ పారదర్శక విధానంలో ఇళ్లు అందించేందుకు చర్యలు ప్రారంభించినట్లు చెప్పారు. లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను వేగవంతం చేయాలని ఇప్పటికే అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు వెల్లడించారు.

Key update on Indiramma houses

Indiramma Houses Scheme : అర్హులందరికీ శుభవార్త .. ఇందిరమ్మ ఇళ్ల మంజూరుకు డేట్ ఫిక్స్.. ఎప్పటినుంచంటే..?

Indiramma Houses Scheme : ఈ నెలాఖరులో మంజూరు ప్రక్రియ పూర్తి

హైదరాబాద్‌లో ఇందిరమ్మ ఇళ్ల మంజూరుపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇతర మంత్రులతో కలిసి సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకున్నారు. హైదరాబాద్‌తో పాటు రంగారెడ్డి, సంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లాల పరిధిలోని అర్హులకూ త్వరలోనే ఇళ్లు మంజూరు చేయనున్నట్లు ప్రకటించారు. నగరంలో ఇప్పటికే నిర్మాణం ప్రారంభమై మధ్యలో నిలిచిపోయిన డబుల్ బెడ్ రూం ఇళ్ల పనులను తిరిగి ప్రారంభించేందుకు నిర్ణయం తీసుకున్నారు. నిర్మాణం పూర్తయ్యేలా హౌసింగ్ కార్పొరేషన్ ద్వారా సాంకేతిక, ఆర్థిక సహాయం అందించనున్నట్లు తెలిపారు. ఈ నెలాఖరులోగా తొలి విడతగా ఇళ్ల మంజూరు పత్రాలను జారీ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వెల్లడించారు.

Indiramma Houses Scheme : మురికివాడల్లో ఇందిరమ్మ మోడల్ కాలనీలు

నగరంలోని మురికివాడల అభివృద్ధిపై కూడా ప్రభుత్వం దృష్టి సారించింది. ఇందిరమ్మ మోడల్ కాలనీల నిర్మాణానికి అవసరమైన స్థలాల సేకరణపై అధికారులతో సమగ్ర చర్చ జరిగింది. లబ్ధిదారులు ప్రస్తుతం నివసిస్తున్న ప్రాంతాలకే సమీపంగా 5 నుంచి 10 అంతస్తుల భవనాలు నిర్మించి ఇళ్లు అందించాలనే నిర్ణయం తీసుకున్నారు. సిటీకి దూరంగా ఇళ్లు కేటాయిస్తే వారి ఉపాధిపై ప్రభావం పడుతుందనే ఉద్దేశంతో ఈ చర్యలు చేపడుతున్నట్లు మంత్రి తెలిపారు. జీవనోపాధి, పిల్లల విద్య, సామాజిక అనుబంధాలు దెబ్బతినకుండా ఉండేలా ప్రణాళికలు రూపొందిస్తున్నామని పేర్కొన్నారు.

Indiramma Houses Scheme : 28 వేల మందికి మంజూరు పత్రాలు

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఇప్పటికే సొంత స్థలాలు ఉన్నవారికి ఈ నెలాఖరులోగా ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలు అందజేయనున్నట్లు మంత్రి తెలిపారు. దాదాపు 28 వేల మంది లబ్ధిదారులకు ఈ పత్రాలు జారీ చేయనున్నట్లు చెప్పారు. అలాగే రాబోయే కేబినెట్ సమావేశంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి సంబంధించి మరిన్ని కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశముందని సంకేతాలు ఇచ్చారు. నగరంలో అర్హుల సంఖ్య, అందుబాటులో ఉన్న స్థలాలు, నిర్మించగలిగే ఇళ్ల సంఖ్యపై పూర్తి వివరాలు సమర్పించాలని అధికారులను ఆదేశించారు. అర్హత కలిగిన ప్రతి కుటుంబానికి ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద ఇల్లు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి స్పష్టం చేశారు. ప్రతి పేద కుటుంబం సొంతింటి కలను సాకారం చేయాలన్నదే తమ ప్రభుత్వ ధ్యేయమని తెలిపారు.

suma

Suma is experienced in Digital Media field. Iam worked in various Telugu media houses for about 10 years. lam worked as a Vaartha DailyNewspaper , Hashtagu, Siri Daily News Paper , MeSpandana .com, Telugu24 .in and present TheTelugunews.com As a News Content Writer, I wrote various articles on Breaking News , Local news live reporting, special stories. Iam is also expert in News Analyzing Contact Details: lathasuma895@gmail.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి