KTR vs Revanth Reddy : ముందు అందరికీ కరెంట్ బిల్లులు కట్టండి.. లేకపోతే ప్రజలు తిరగబడతారు.. అసెంబ్లీ కేటీఆర్ ఫైర్
ప్రధానాంశాలు:
మళ్లీ పవర్ హాలీడేస్ రాకుండా చూసుకోండి
విద్యుత్ మోటార్లు పెట్టకండి
24 గంటల కరెంట్ ఇవ్వండి
KTR vs Revanth Reddy : తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వాడీవేడీగా జరిగిన విషయం తెలిసిందే. ముఖ్యంగా కేటీఆర్, సీఎం రేవంత్ రెడ్డి మధ్య మాటల యుద్ధమే జరిగింది. మీరు ప్రజల నుంచి అస్సలు తప్పించుకోలేరు. నేను అడుగుతున్నా ఈ ప్రభుత్వాన్ని. మేము మోటర్లకు మీటర్లు పెట్టం అని తెగేసి చెప్పాం. అదనంగా 25 నుంచి 30 వేల కోట్ల నష్టం వస్తున్నా తెగేసి గట్టిగా నిలబడ్డాం. రైతులకు అన్యాయం చేయమని చెప్పాం. ఈ ప్రభుత్వం ఆమాట మీద నిలబడుతుందా? లేక మోటర్లకు మీటర్లు పెడుతుందా? చెప్పాలి అని ముఖ్యమంత్రిని కోరుతున్నా. రాష్ట్రంలో రైతుల పక్షాన కోరుతున్నా? ఉచిత విద్యుత్ ను ఊడగొట్టే పన్నాగాన్ని ప్రతిఘటించాం. నేను ఒకటే కోరుతున్నా. కొత్తగా వచ్చిన ప్రభుత్వం.. ఒక్కటే కోరుతున్నా. మూడు గంటల కరెంట్.. 10 హెచ్‌పీల మోటర్లు.. వినవద్దని కోరుతున్నాం. 24 గంటల కరెంట్ ఉండాలని కోరుకుంటున్నాం. వ్యవసాయానికి 24 గంటల కరెంట్ ఉండాలి. గృహాలకు 24 గంటల కరెంట్ ఉండాలి. పరిశ్రమలకు 24 గంటల కరెంట్ రావాలి. పవర్ హాలీడే ఇచ్చే దుస్థితి రాకూడదు అన్నారు.
వాళ్లే పిలుపునిచ్చారు. కరెంట్ బిల్లులు కట్టొద్దు. మేము వచ్చేస్తున్నాం. కట్టకండి అన్నారు. మరి రాష్ట్రంలో ప్రజలు కట్టబోవడం లేదు. మరి వెంటనే మీరు గృహజ్యోతి కార్యక్రమాన్ని ప్రారంభించి ఇచ్చిన హామీని కూడా నెరవేర్చాలని నేను కోరుతున్నా. వ్యవసాయం విషయానికి వస్తే ఆనాడు మీకు తెలుసు అధ్యక్షా. ఎండిన చెరువులు, ప్రాజెక్టులు కట్టలేదు. రకరకాల అవస్థలు. ఒక్కో ప్రాజెక్ట్.. ఎస్సారెస్పీ కానీ.. అప్పర్ మానేరు నా నియోజకవర్గంలో 12 ఏళ్లకు ఒకసారి నిండేది. కుడెళ్లి వాగులో మంజీరాలో నీళ్లే వచ్చేది కాదు. ఎన్నడూ ఆనాడు ప్రాజెక్టుల విషయంలో పట్టించుకోలేదు. నేను మళ్లీ ఎక్కువ మాట్లాడితే ఎక్కువ మాట్లాడిన అంటరు. ఆరోజు కాంగ్రెస్ పాలనలో పరిస్థితి ఏంటంటే.. రైతుల ఇంటి పేర్లే మారిపోయాయి. నల్గొండ పక్కన మూషంపల్లి అనే ఊరు ఉంటుంది. రాంరెడ్డి అనే ఒక పెద్దమనిషి.. 54 బోర్లు వేస్తే పడక ఆయనకు బోర్ల రాంరెడ్డి అని ఆయన ఇంటి పేరు అయింది. అది ఆనాడు పరిస్థితి. చుక్క నీరు రాని పరిస్థితి అన్నారు.
KTR vs Revanth Reddy : వాళ్ల పాలనకు, మా పాలనకు తేడా అదే
అదేవిధంగా మా శ్రీధర్ బాబుకు తెలుసు. ఆయన మంత్రిగా ఉన్నారు అప్పుడు. ఆరోజు వెంకటాపూర్ గ్రామం ఎల్లారెడ్డి మండలంలో మునిగె ఎల్లయ్య అనే రైతు ఎరువుల కోసం లైన్ లో నిలబడి నిలబడి సొమ్మసిల్లిపోయి అక్కడే మూర్చవచ్చి మరణించాడు. ఇదేం నేను వక్రీకరించడం లేదు.. ఉన్న వాస్తవాలే చెబుతున్నా. ఆ రోజు మీరు మంత్రిగా ఉన్నారు. ఇలా ఎన్నో ఉన్నాయి.. వాళ్ల పాలనకు, మా పాలనకు తేడా ఏంటంటే ఓ సంవత్సరం కింద మా సురభి వాణీ దేవి గారు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రచారం చేస్తుంటే ఒక రోజు కాలేజీ యాజమాన్యాలతో మీటింగ్ పెట్టారు. అప్పుడు యాజమాన్యాలు అందరూ వచ్చారు. నేను ఉపన్యాసం చెప్పిన తర్వాత ఓటేయాలంటే వీళ్లంతా గంభీరంగా ఉన్నారు. నాకు అనుమానం వచ్చింది. దీంతో ఒక పెద్దమనిషిని నేను అడిగాను. మీరు ఇంత సీరియస్ గా ఉన్నారు. ఓటేస్తారా లేదా అంటే నాకు ఒక్క నిమిషం మైక్ ఇస్తారా అన్నారు. తీసుకోండి అన్నాను. ఆ పెద్ద మనిషి పేరు కృష్ణారెడ్డి. మన ఐతవోలు అనే ఊరు ఆయనది. ఆయన ఒక గొప్ప మాట చెప్పారు. ఆయన ఏమన్నారంటే నా పేరు కృష్ణారెడ్డి. నేను ఎస్వీఎస్ మెడికల్ కాలేజీ నడుపుతాను. మహబూబ్ నగర్ జిల్లాలో. ఒకప్పుడు నా ఊర్లో ఏమయ్యా కృష్ణారెడ్డి నీ చేను ఎక్కడ ఉంది అంటే చెరువు కింద ఉంది అని చెప్పేవాడిని. కానీ కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత నా చేను చెరువు కింద లేదు.. నా చేను కిందికే చెరువు వచ్చింది అని కృష్ణారెడ్డి చెప్పారు. నేను చెప్పేది అతిశయోక్తి కాదు. కావాలంటే ఆ కృష్ణారెడ్డిని పిలిపించి మీరు అడగొచ్చు. వారే చెబుతారు.. అని కేటీఆర్ అసెంబ్లీలో అన్నారు.