Mynampally : రేవంత్‌కి గుడ్ న్యూస్.. సోనియా సమక్షంలో కాంగ్రెస్‌లోకి మైనంపల్లి?
Mynampally : అనుకున్నదే జరిగింది. అధికార బీఆర్ఎస్ పార్టీకి ఇప్పటికే చాలామంది కీలక నేతలు షాకిచ్చారు. తాజాగా మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతారావు కూడా షాకిచ్చారు. తనకు పార్టీ టికెట్ కన్ఫమ్ చేసినా కూడా ఆయన పార్టీకి రాజీనామా చేశారు. ఆయన ఏ పార్టీలో చేరుతాను.. తదుపరి కార్యచరణ ఏంటి అనేది తర్వాత వెల్లడిస్తా అని చెబుతూ ఓ వీడియోను కూడా మైనంపల్లి విడుదల చేశారు. అలాగే.. తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడమే కాదు బీఆర్ఎస్ పార్టీకి కూడా రాజీనామా చేస్తున్నట్టు మైనంపల్లి.. సీఎం కేసీఆర్ కు లేఖ రాశారు.
మల్కాజిగిరి ప్రజలు, శ్రేయోభిలాషుల కోరిక మేరకే తాను బీఆర్ఎస్ పార్టీని వీడినట్టు మైనంపల్లి తెలిపారు. రాష్ట్రంలో నలుమూలలా నా వెల్ విషర్స్ కోరిక మేరకు బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశానని, తప్పకుండా త్వరలోనే తాను ఏ పార్టీలో చేరబోతున్నానో తెలియజేస్తానన్నారు. అందరికీ ఇంత వరకు సహకారం అందించినందుకు ధన్యవాదాలు తెలిపారు. మల్కాజిగిరి ప్రజలకు ఈ సందర్భంగా మైనంపల్లి ధన్యవాదాలు తెలిపారు. వాళ్లకు అండగా ఉంటానన్నారు. ఎప్పుడు కూడా తన ప్రాణమున్నంత వరకు ప్రజల కోరిక మేరకే ముందుకు నడుస్తానని.. దేనికి కూడా లొంగే ప్రసక్తి లేదని మైనంపల్లి స్పష్టం చేశారు.
Mynampally : కాంగ్రెస్ లో చేరిక ఖాయమేనా?
కొడుకు కోసం టికెట్ ఆశించినా బీఆర్ఎస్ లో దక్కకపోవడంతో మైనంపల్లి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. కేసీఆర్ మేనల్లుడు, మంత్రి హరీశ్ రావుపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు మైనంపల్లి. అయినా కూడా మల్కాజిగిరి నుంచి మైనంపల్లికి కేసీఆర్ టికెట్ కేటాయించారు కానీ.. మెదక్ నుంచి ఆయన కొడుకు రోహిత్ కు టికెట్ దక్కకపోవడంతో ఆయన కాంగ్రెస్ లోకి వెళ్తారనే ప్రచారం సాగింది. దాన్ని నిజం చేస్తూ ఈనెల 26న కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిక ఖాయం అయింది. ఆయన కాంగ్రెస్ లో చేరేందుకు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చాలా ప్రయత్నాలు చేశారు. అవి తాజాగా ఫలించబోతున్నాయి. మైనంపల్లికి మల్కాజిగిరి నుంచి, ఆయన కొడుకు రోహిత్ కు మెదక్ నుంచి కాంగ్రెస్ తరుపున ఎమ్మెల్యే టికెట్ ఇచ్చేందుకు కాంగ్రెస్ అధిష్ఠానం కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది.