Telangana : బీసీలపై అవమానకర వ్యాఖ్యలు .. కోమటిరెడ్డి వెంకటరెడ్డిని మంత్రివర్గం నుంచి తొలగించాలి ..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Telangana : బీసీలపై అవమానకర వ్యాఖ్యలు .. కోమటిరెడ్డి వెంకటరెడ్డిని మంత్రివర్గం నుంచి తొలగించాలి ..!

 Authored By sudheer | The Telugu News | Updated on :18 March 2026,6:31 pm

ప్రధానాంశాలు:

  •  Telangana : బీసీలపై అవమానకర వ్యాఖ్యలు .. కోమటిరెడ్డి వెంకటరెడ్డిని మంత్రివర్గం నుంచి తొలగించాలి ..!

Telangana : తెలంగాణలో బీసీలపై అవమానకరంగా వ్యాఖ్యలు చేసిన రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. బీసీ జేఏసీ రాష్ట్ర కన్వీనర్ జాజుల లింగంగౌడ్ మాట్లాడుతూ.. జనాభాలో 60 శాతం పైగా ఉన్న బీసీల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా మంత్రి ప్రవర్తిస్తున్నారని ఆరోపించారు. ఆయనను తక్షణమే మంత్రివర్గం నుంచి తొలగించాలని కాంగ్రెస్ అధిష్టానాన్ని డిమాండ్ చేశారు. నిన్న అసెంబ్లీ లాబీలో కోమటిరెడ్డి చేసిన వ్యాఖ్యలను లింగంగౌడ్ తీవ్రంగా ఖండించారు. టీపీసీసీ అధ్యక్షుడిగా జగ్గారెడ్డి ఉంటే పార్టీకి 100 సీట్లు వస్తాయని ఆయన చెప్పడం, బీసీల నాయకత్వంపై అనుమానం వ్యక్తం చేస్తున్నట్టు ఉందని అన్నారు. ఇది బీసీల పట్ల ఆయనకు ఉన్న వ్యతిరేక ధోరణిని స్పష్టం చేస్తోందని విమర్శించారు.

Protest against Komatireddy Venkata Reddy

Telangana : బీసీలపై అవమానకర వ్యాఖ్యలు .. కోమటిరెడ్డి వెంకటరెడ్డిని మంత్రివర్గం నుంచి తొలగించాలి ..!

ఇటీవల మహేష్ కుమార్ గౌడ్ టీపీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత రాష్ట్రంలో బీసీ కులగణన, కాంగ్రెస్ పార్టీలో 70 శాతం పదవులను బహుజనులకు కేటాయించడం, డిసిసి అధ్యక్షుల నియామకాల్లో బీసీలకు ప్రాధాన్యత ఇవ్వడం వంటి నిర్ణయాలు తీసుకున్నారని లింగంగౌడ్ గుర్తుచేశారు. అలాగే ఎమ్మెల్సీ పదవుల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మహిళలకు అవకాశాలు కల్పించడం, గ్రామపంచాయతీ మరియు మున్సిపల్ ఎన్నికల్లో బీసీలు పెద్ద ఎత్తున గెలవడం కొందరికి జీర్ణించుకోవడం కష్టమైందన్నారు. ఈ నేపథ్యంలోనే కోమటిరెడ్డి, పీసీసీ అధ్యక్షుడిని తప్పించాలనే ఉద్దేశంతో వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారని లింగంగౌడ్ మండిపడ్డారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరియు కాంగ్రెస్ నాయకత్వం బీసీల పట్ల నిజమైన చిత్తశుద్ధి ఉంటే వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కోమటిరెడ్డి వ్యాఖ్యలకు నిరసనగా పట్టణంలో బీసీ జేఏసీ నేతలు ఆందోళన చేపట్టారు. ఈ కార్యక్రమంలో బీసీ జేఏసీ పట్టణ అధ్యక్షులు బంటు వెంకటేశ్వర్లు ముదిరాజ్ దోనేటి శేఖర్ సత్య ప్రకాష్ నాయుడు, సురేష్ యాదవ్ మురళీకృష్ణ ప్రశాంత్ రవితేజ హేమంత్ ఆర్యన్ తదితరులు పాల్గొన్నారు.

 

sudheer

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది