Home » News » Rulers Have Failed To Provide Education Medical And Employment Rights To Youth Aiyf
News

యువతకు విద్య, వైద్య, ఉపాధి హక్కులను కల్పించడంలో పాలకులు విఫలం : AIYF

Authored By
Ramu Tandu Ramalingaiah
The Telugu News | Published on: May 3, 2025, 10:00 pm
Advertisement

AIYF  : యువతకు విద్య, వైద్య, ఉపాధి హక్కులను కల్పించడంలో పాలకులు విఫలమయ్యారని, మత ఛాందస విధానాలకు వ్యతిరేకంగా యువత పోరాడాలని అఖిల భారత యువజన సమాఖ్య (ఏఐవైఎఫ్) రాష్ట్ర కార్యదర్శి కల్లూరు ధర్మేంద్ర అన్నారు. ఏఐవైఎఫ్ 66వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ జిల్లా సమితి ఆధ్వర్యంలో హిమాయత్ నగర్ లోని సత్యనారాయణరెడ్డి భవన్ ముందు యువజన సంఘ జెండాను ధర్మేంద్ర ఎగురవేశారు. అనంతరం తీవ్రవాదాన్ని వ్యతిరేకిస్తూ – దేశ సమైక్యత, సమగ్రత, సార్వభౌమాధికారాన్ని కాపాడుకుందామని ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా ఏఐవైఎఫ్ రాష్ట్ర కార్యదర్శి కల్లూరు ధర్మేంద్ర మాట్లాడుతూ దేశ భవిష్యత్ను తీర్చిదిద్దడంలో యువత పాత్ర ప్రధానమైనదన్నారు. యువతరంలో ప్రగతిశీల, అభ్యుదయ భావాలను, దేశభక్తి, లౌకిక ప్రజాస్వామిక ఆలోచనలను, నైతిక విలువలను, మానవత్వాన్ని పాదుకొల్పడానికి అఖిల భారత యువజన సమాఖ్య (AIYF) నిరంతరం కృషి సల్పుతున్నదన్నారు. దేశం కోసం ప్రాణార్పణ చేసిన భగత్ సింగ్, రాజ్ గురు, సుఖదేవ్, చంద్రశేఖర్ ఆజాద్, సుభాష్ చంద్రబోస్ లాంటి అమరవీరుల వారసత్వాన్ని పుణికిపుచ్చుకొని స్వాతంత్ర్యోద్యమంలో, యువకులను సమీకరించి వీరోచితమైన పోరాటం చేసిందన్నారు, దేశాన్ని పట్టిపీడిస్తున్న తెల్లదొరలను తరిమిందన్నారు. దేశ స్వాతంత్ర్యానంతరం నల్లదొరల దోపిడీని అడ్డుకునేందుకు 1959 మే 3వ తేదీన ఎఐవైఎఫ్ ఆవిర్భవించిందన్నారు. పొత్తిళ్ళలోనే ఎన్నో ఉద్యమ ఆటుపోట్లను ఎదుర్కొని యువజన హక్కుల సాధనకు సామాజికాభివృద్ధికి పాటుపడుతూ యువజనోద్యమాల వేదికగా ముందుకు సాగిందన్నారు. AIYF పనిహక్కును ప్రాథమిక హక్కుగా గుర్తించాలని, సమగ్ర యువజన విధానం కోసం, విద్య, వైద్య వ్యాపారాన్ని రద్దుచేయాలని, అవినీతికి వ్యతిరేకంగా, ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం, ప్రకృతి సంపద ప్రజలకే దక్కాలని, భగత్ సింగ్ నేషనల్ ఎంప్లాయ్మెంట్ గ్యారెంటీ యాక్టును రూపొందించి, అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు.

Advertisement

యువతకు విద్య, వైద్య, ఉపాధి హక్కులను కల్పించడంలో పాలకులు విఫలం : AIYF

భారతదేశంలో నివసిస్తున్న ప్రతి పౌరుడికి ఉపాధి అవకాశాలు కల్పించాల్సిన కర్తవ్యం పాలకులపై ఉంటుందన్నారు. కేంద్రంలోని నరేంద్రమోదీ ప్రభుత్వం మత పోకడలను అనుసరిస్తూ దేశ యువతను పెడదారి పట్టిస్తున్నారని వారు ధ్వజమెత్తారు.ప్రస్తుతం నరేంద్రమోదీ ఆర్ఎస్ఎస్ విధానాలను దేశమంతటా వ్యాప్తి చేయడానికి నీచ కుయుక్తులు పన్నుతున్నాడని ఆరోపించారు. దేశ గతిని మార్చే యువతకు ఉపాది అవకాశాలు కల్పించడంలో మోడీ పూర్తిగా విఫలమయ్యారని వారు అన్నారు. దేశంలో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలను నిర్వీర్యం చేసిన ఘనత మోదీ ప్రభుత్వానికే దక్కుతుందని వారు విమర్శించారు. “భారత రాజ్యాంగాన్ని మారుస్తానంటూ దేశ మంతటా ప్రచారం చేస్తున్న దేశ ప్రధాని మోడీ నిర్లక్ష్యపు వ్యాఖ్యలపై – దేశ ఐక్యత, సమగ్రాభివృద్ధి కోసం పాటుపడుతున్న మనమందరం నినదించాలన్నారు.

Advertisement

AIYF : మత ఛాందస విధానాలకు వ్యతిరేకంగా యువత పోరాడాలి

ఈ సందర్భంగా ఏఐవైఎఫ్ హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు, కార్యదర్శి ఆర్. బాలకృష్ణ, నెర్లకంటి శ్రీకాంత్ లు మాట్లాడుతూ స్వాతంత్య్రం సిద్ధించి 77 సంవత్సరాలు గడుస్తున్నా దేశంలో ఇప్పటికీ విద్యనభ్యసించిన ప్రతి విద్యార్ధి, యువతకు ఉపాధి అవకాశాలు లేవన్నారు. విద్యార్హతలకు తగ్గ ఉపాధి అవకాశాలు లేక మన దేశంలో రోజు రోజుకు నిరుద్యోగం పెరుగుతున్నదన్నారు. ఇటీవల ప్రకటించిన సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమి సంస్థ ఆర్థిక గణాంకాల ప్రకారం దేశంలో నిరుద్యోగ శాతం గతంలో 4.8% ఉండగా, నేడు 23.7% శాతానికి పెరిగిందని, దీని మూలంగా భారత దేశంలో ఉపాధి లేని యువత నిరుద్యోగ సైన్యంగా మారారన్నారు. ఉపాధికి ఊతం ఇచ్చే అన్ని పరిశ్రమలు, వాణిజ్య సముదాయాలు, విద్యాలయాలు, ఐటి రంగాలను పాలకులు నిర్వీర్యం చేస్తున్నారన్నారు. 2016-2025 మధ్యకాలంలో జాతీయ వ్యాప్తంగా నిరుద్యోగ రేటు క్షీణించిందన్నారు. కరోనా మహమ్మారితో విలవిల్లాడుతూ ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న మన దేశంలో నిరుద్యోగం పెరిగిపోవడం ఆందోళన కలిగిస్తోందన్నారు. విద్యలో నాణ్యత ప్రమాణాలు తగ్గడం, యువతలో నైపుణ్యాలు కరువు, పనిచేసే ప్రాంతాల్లో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అత్యధికంగా వినియోగించడం వంటివన్నీ నిరుద్యోగాన్ని పెంచిపోషిస్తున్నాయన్నారు. మరికొంత మంది యువత చిన్నా చితక ఉద్యోగాలు చేయలేక వదులుకొని వెళ్ళిపోవడం కూడా నిరుద్యోగం పెరిగిపోవడానికి కారణంగా మారిందన్నారు. కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు సమగ్ర యువజన విధానం ద్వారా నిర్దిష్టమైన ఉద్యోగ, ఉపాధి అవకాశాలను యువతకు కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏఐవైఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు శ్రీమాన్, హైదరాబాద్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ షేక్ మహమూద్, ఏఐవైఎఫ్ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు, కార్యదర్శి మధు, శివకుమార్, ఉపాధ్యక్షుడు మాజీద్ అలీ ఖాన్, సభ్యులు కళ్యాణ్, భరత్…. సీపీఐ నాయకులు చెట్టుకింది శ్రీనివాస్ పాల్గొన్నారు.

Ramu Tandu Ramalingaiah

Author Bio Info : Author Bio Info : Ramu Tandu Ramalingaiah is experienced in Media field. He worked in various Telugu media houses for about 15+ years. Iam worked as a Prajasakti Daily Newspaper , Surya Daily Newspaper , Namasthe Telangana Daily Newspaper News Reporter, Chief Editor, Digital Media Expert , Social Media Expert, Technical Expert and Digital Marketing Expert. As a News reporter, he wrote various articles on Human angle, Local news live reporting, special stories. He is also expert in news analyzing, proof editing and best title editing. He is the present Editor of thetelugunews.com | Contact Details : ramu@thetelugunews.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి